వేదవతి ప్రాజెక్టును పూర్తి చేస్తాం
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:34 PM
కరువు నేలను సస్యశ్యామలం చేసేందుకు వేదవతి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామని కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.
80వేల ఎకరాలకు సాగునీరు
కలెక్టర్ ఏ.సిరి
హాలహర్వి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కరువు నేలను సస్యశ్యామలం చేసేందుకు వేదవతి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామని కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం అమృతాపురం గ్రామం వద్ద ప్రవహిస్తున్న వేదవతి నదిని ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేదవతి నదిలో ప్రవహిస్తున్న నీటి ద్వారా రెండు చోట్ల జలాశయాలు నిర్మిస్తామన్నారు. అందు లో మొదట బిలేహాల్ వద్ద రెండు టీఎంసీలు నీటిని, మొగవల్లి వద్ద ఒక టీఎంసీ నీటిని నిల్వచేసి ఆనీటితో 80వేల ఎకరాలకు సాగునీరు, ఆదోని, ఆలూరు, పత్తికొండకు తాగునీరు అందజేస్తామన్నారు. ప్రస్తుతం నాలుగు వేల ఎకరాలను భూ సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. అందులో 500ఎకరాలు మాత్రమే భూసేకరణ పూర్తి చేశామన్నా రు. మరో 15 రోజుల్లో 3,500 ఎకరాలకు భూసేకరణ పూర్తి చేసి రైతులకు తగిన పరిహారం అందజేస్తామన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ ఆలూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆలూరు ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడి ఉందని నియోజకవర్గానికి అధిక నిధులు కేటాయించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జేసీ నూరల్‌ఖమర్, ఇరిగేషన్ చీఫ్ ఇం జనీర్ శైలేశ్వర్, ఎన్‌హెచ్‌ఎస్ కిష్టన్న, డీఈలు షఫీవుల్లా, నారాయణ, ఎల్‌ఎల్‌సీ డీఈ చెన్నకేశవనాయక్, తహశీల్దార్ ఓంకార్ ప్రసాద్, ఎంపీడీవో వరలక్ష్మి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వెంకటరమణి, సొసైటీ చైర్మన్ ప్రకాష్, మండల కన్వీనర్ శ్రీధర్ , సీనియర్ నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.