కర్నూలు రూపురేఖలు మారుస్తాం
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:11 AM
కర్నూలు నగరం సహ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి కర్నూలు రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంలో రూ.వంద కోట్లతో నగరాభివృద్ధి
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి
రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం సహ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి కర్నూలు రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక మౌర్యఇన్ హోటల్‌లోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, కేఈ శ్యాంబాబు, టీడీపీ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రూ.వంద కోట్లతో నగరాభివృద్ధి చేపట్టామని అన్నారు. నగరంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు ఆఽధునికీకరించామని, పార్కులు అభివృద్ధి చేశామన్నారు. విశాఖ తరహాలో ఓర్వకల్లులో అతిపెద్ద డేటా సెంటర్ రాబోతుందన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే పత్తికొండ టమోటా జ్యూస్ పరిశ్రమ ప్రారంభిస్తామన్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో దాదాపు రూ.50వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ పనులు పూర్తయితే జిల్లా స్వరూపమే మారిపోతుందని, యువతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు మెరుగు పడుతాయన్నారు. కర్నూలులో మసీదు పెద్దలను ఒప్పించి మెడికల్ కాలేజీ వద్ద రహదారి విస్తరించామన్నారు. చౌరస్తా వద్ద ఎస్‌ఏపీ క్యాంప్ అధికారులతో చర్చించి బైపాస్ రోడ్డు వేశాని, ఇలా చెప్పుకుంటూ పోతే చేసిన అభివృద్ధి ఎంతో ఉందన్నారు. రెండున్నరేళ్లలో సుమారుగా రూ.85కోట్ల పనులు పూర్తి చేశామని, రూ.940 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. క్రీడా మైదానం అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్ ఏర్పాటు చేశామన్నారు. గడియారం ఆస్పత్రి, ప్రభుత్వ సర్వజన వైద్యశాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామన్నారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆధ్వరంలో త్రిపుల్ ఇంజన్ సర్కారు రావాలంటే టీడీపీ, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
తాగు, సాగునీటి ప్రాధాన్యం: ఎంపీ బస్తిపాటి
తాగు, సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. రూ.4,300 కోట్లతో హంద్రీనీవా కాలువను 3,800 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించామన్నారు. ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో వేదవతి ప్రాజెక్టును చేర్చి రూ.1,985 కోట్లు మంజూరు చేశామన్నారు. అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో మేధావులు ఆలోచించి ఓటేయాలని కోరారు.
విజయం తఽథ్యం..
కర్నూలు మేయర్ టీడీపీ అభ్యర్థి విజయ ప్రత్యూష సహ కూటమి అభ్యర్థులు విజయం తథ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు అర్బన్ వార్డుల్లో సీఎం చంద్రబాబు సహకారంతో రెండేళ్లలో రూ.400కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, సమష్టిగా కష్టపడి టీడీపీ, కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యతను తీసుకుంటామన్నారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం.. అన్ని వార్డులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి విజయం ఖాయమన్నారు. కర్నూలు టీడీపీ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల ప్రత్యూష మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడు.. కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. తనను మేయర్‌గా గెలిపిస్తే మా నాయకుడి అడుగుజాడల్లో నగరాభివృద్ధికి నిరంతరం కష్టపడుతానని వివరించారు.