Share News

‘సీమ’కు మరిన్ని పరిశ్రమలు తెస్తాం

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:19 AM

కరువును పారదోలేందుకు రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తానని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

‘సీమ’కు మరిన్ని పరిశ్రమలు తెస్తాం

స్వర్ణగిరి గోల్డ్‌ ఏపీ బ్రాండ్‌

ప్రైవేటు రంగంలో దేశంలోనే తొలి గోల్డ్‌మైన్‌ జొన్నగిరి

ఆనాడు పోలీసులతో అడ్డుకుంటే.. పాదయాత్రలో మీరే నడిపించారు

పత్తికొండ పౌరుషం.. ప్రేమ అదుర్స్‌

హోసూరు సభలో మంత్రి నారా లోకేశ్‌

టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

పల్లెపల్లెన యువనేతకు జేజేలు పలికిన టీడీపీ శ్రేణులు, మహిళలు

కర్నూలు/పత్తికొండ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కరువును పారదోలేందుకు రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తానని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పత్తికొండ మండలం హోసూరు దగ్గర టాటా పవర్‌ రెన్యూవ బుల్‌ ఎనర్టీ లిమిటెడ్‌, (టీపీఆర్‌ఈఎల్‌) సంస్థ రూ.5,350 కోట్లతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు గురువారం మంత్రి టీజీ భరత్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలసి శంకు స్థాపన చేశారు. ఈప్రాజెక్టు ఏర్పాటుకు భూములు లీజుకు ఇచ్చిన రైతులు, నియో జకవర్గం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన టీడీపీ శ్రేణుల సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడారు. పత్తికొండ అంటే గుర్తుకొచ్చేది వజ్రాలు.. బంగారు గనుల ఖిల్లా ఈప్రాంతం. స్వర్ణగిరి (జొన్నగిరి) బంగారం ఏపీ బ్రాండ్‌ అని అన్నారు. పత్తికొండ నియో జకవర్గం విశిష్టతలు, ప్రతిపక్షంలో ఉండగా యువగళం పాదయాత్ర తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు గుర్తుచేసుకున్నారు. అశోకుడు పాలించిన గొప్ప నేల పత్తికొండ అని, బంగారమే కాదు.. బంగారం లాంటి ప్రజలు ఉన్న నేల ఇది అని కొనియాడారు. వాన చినుకులు పడితే ఈనేలలో వజ్రాలు దొరుకుతాయని, వజ్రాల లాంటి యువత కూడా ఇక్కడే ఉందన్నారు. ‘యువత ఉజ్వల భవతను కాంక్షించి.. ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా టాటా రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టును ఇక్కడికి తెచ్చాం. మరిన్ని ప్రాజెక్టులు కూడా తీసుకొస్తాం. అయితే.. రైతులు కూడా సహరించాలని, ప్రతిపక్షాలు మాటలు నమ్మి మోసపోవద్దని లోకేశ్‌ వివరించారు’. ఇంకా ఏమన్నారంటే..

అడ్డంగా నిలబడి నడిపించారు

యువగళం పాతయాత్రలో భాగంగా మీ నియోజక వర్గానికి వచ్చాను. మీ అభిమానం ఎల్లలు దాటి జన సంద్రంగా పాదయాత్ర సాగుతుంటే.. చూసి ఓర్వలేక వెయ్యి మంది పోలీసులతో అడ్డుకున్నారని నాటి పాద యాత్ర సమయంలో ఎదురైన ఇబ్బందులు, అడ్డంకులు మంత్రి లోకేశ్‌ గుర్తు చేసుకున్నారు. పోలీసులు అడ్డుకుంటే తగ్గేదేలే అంటూ మీరే అడ్డంగా నిలబడి నన్ను నడిపించారు.. నాతో కలసి నడిచారు. అందుకే మీరంటే నాకు ప్రాణం.. మీఅభిమానం ఎన్నటికి మరవలేను అని ఉద్వేగ భరితంగా అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 రోజులు పాదయాత్ర సాగింది. ప్రజల కష్టాలు, కన్నీళ్లు కళ్లారా చూశానని అన్నారు. ఆ బాధలు తీరాలంటే ప్రాజెక్టులు, పరిశ్ర మలు రావాలని సంకల్పించాం. యువతకు 25 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఉద్యోగాలు, ఈ ప్రాంతం అభివృద్ధికి కాంక్షిస్తూ టాటా లాంటి పరిశ్రమలను కరువు సీమకు తీసుకొస్తున్నాం. పత్తికొండ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు తెస్తామని వివరించారు.

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని మరోసారి స్పష్టమైన హామీఇచ్చారు. మన మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతుంటాయని, అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్‌ను చూస్తే నాలో కసి పెరుగుతుంది. 65ఏళ్లు ఎంతో అభివృద్ధి చేస్తే, మెడ పట్టుకొని గెం టేశారు. హైదరాబాద్‌కు మించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.

పల్లెపల్లెన నీరాజనాలు

మంత్రి లోకేశ్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన యువనేత లోకేశ్‌కు బుధవారం సాయంత్రం చీకట్లు కుమ్ముకుంటున్నా, వర్షాలు కురస్తున్నా జనం తగ్గేదేలే అంటూ లోకేశ్‌ రాకకోసం రోడ్లుపైనే గడిపారు. యువనేత రాగానే ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల నుంచి కొత్త బైపాస్‌ రోడ్డు వరకు జనం నీరాజనాలు పలికారు. రెండు రోజు గురువారం ఆదోని పర్యటన ముగించుకొని పత్తికొండ నియోజకవర్గంలో అడుగుపెట్టి యువ నేతకు పల్లెపల్లెన పూలవర్షం కురిపించారు. చిన్నహుల్తి, పత్తికొండ, హోసూరులో పెద్దఎత్తున జనం వచ్చిన స్వాగతం పలికారు. మహిళలు వెల్లువలా రోడ్డుపైకి వచ్చి యువనేతకు జేజేలు పలకడం కొసమెరుపు. కార్యక్రమంలో టీడీజీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, వాల్మీకి ఫెడరేషన్‌ చైర్‌పర్సన్‌ బొజ్జమ్మ, టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతినాయుడు, టీడీపీ సీనియర్‌ నాయకులు సాంబశివారెడ్డి, బత్తిన లోక్‌నాథ్‌, వెంకటపతి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ అలంకొండ నబీ, మాజీ చైర్మన్‌ శ్రీనివాసులు, టీడీపీ మద్దికెర మండలం అధ్యక్షుడు ధనుంజయ, మాజీ ఎంపీపీ పద్మావతి, మాజీ జడ్పీటీసీ సభ్యులు రాజన్నయాదవ్‌, పురుషోత్తం చౌదరి, పత్తికొండ సొసైటీ అధ్యక్షు డు చందోలి రంగప్ప, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, చేనేత సంఘం తాలుకా అధ్యక్షుడు అవ్వాప్ప శంకర్‌ పాల్గొన్నారు.

మంత్రి టీజీ భరత్‌ మహా ఘటికుడు

మంత్రి టీజీ భరత్‌ మహా ఘటికుడు. ఆయనకు స్వార్థం ఎక్కువగా ఉంది. మంత్రి వర్గ సమావేశాలు పెట్టినప్పుడు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఆలోచిస్తాం. ఏ పరిశ్రమ వచ్చినా కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని మాతో కొట్లాడుతాడు. ఇప్పటికే ఓర్వకల్లు సహా ఉమ్మడి జిల్లాలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈ ప్రాంత అభిమానంతో ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో కోట్లాడుతున్నాడంటే అలాంటి మంత్రి మీకుండడం అదృష్టమని కొనియాడారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి బాధ్యతను మేము తీసుకుంటాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను, పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ ప్రపంచం మొత్తం తిరిగి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం. రూ.50వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

Updated Date - Jul 31 , 2026 | 12:19 AM