బాధితులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:48 AM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
డీఐజీ, ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని డీఐజీ, ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నగరంలోని కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్‌పీరా, సీఐలు విజయలక్ష్మి, కంబగిరి రాముడు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పేరుతో భూములు ఇప్పిస్తామని, రెవెన్యూ శాఖలో ఆరుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సల్కాపురం ప్రవీణ్ కుశల్ రూ.52 లక్షలు తీసుకుని మోసం చేశాడనీ కర్నూలు గీతానగర్‌కు చెందిన మల్లికార్జున ఫిర్యాదు చేశారు. బాగా పండిన 8 క్వింటాళ్ల కంది పంటను రాత్రి వేళల్లో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కోసుకుని వెళ్లారని పసుపుల గ్రామానికి చెందిన రమణ ఫిర్యాదు చేశారు. స్థలం రిజిస్ట్రేషన్ దగ్గర చీటింగ్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కర్నూలు మండలం ఉల్చాల గ్రామానికి చెందిన చిన్న నాగరాజు ఫిర్యాదు చేశారు. హ్యూజ్ ఆన్‌లైన్‌లో ప్రమోషన్ వీడియోలు చూడడం ద్వారా వారానికి, నెలకు తిరిగి డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మించి రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారని కర్నూలు క్రిష్ణానగర్ చెందిన ప్రభుదాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీశ్‌రెడ్డి అనే వ్యక్తి క్రెడిట్ కార్డు పర్మిషన్‌తో, యాప్ సెటప్ యాక్సిస్ సెట్టింగ్‌లో క్రెడిట్ కార్డుతో రూ.8 లక్షలు, పర్సనల్ లోన్ కింద రూ.2 లక్షలు తీసుకుని నమ్మించి మోసం చేసినట్లు కర్నూలు గణేశ్ నగర్‌కు చెందిన వినీత్ కుమార్ ఫిర్యాదు చేశారు.