Share News

జలసిరులు కావాలి..!

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:51 PM

కరువు సీమలో పసిడి రాసులు పోగేసే ‘జొన్నగిరి గోల్డ్‌ మైనింగ్‌ ప్రాజెక్టు - జీజీఎంపీ’ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారం భించనున్నారు.

జలసిరులు కావాలి..!
అసంపూర్తిగా హంద్రీనీవా ప్రాజెక్టు పత్తికొండ జలాశయం కుడి కాలువ పనులు

కరువు సీమ సెంటిమెంట్‌ ‘గుండ్రేవుల జలాశయం’

జిల్లాలో అసంపూర్తి ప్రాజెక్టులకు నిధులు వచ్చేనా?

హంద్రీ నీవా, పత్తికొండ జలాశయం పూర్తయ్యేనా?

ఆ ప్రాజెక్టులతో 45 వేల ఎకరాలకు సాగునీరు

రూ.210 కోట్లు ఇస్తే కరువు సీమ సస్యశ్యామలం

ప్రతిపాదనల్లోనే పుచ్చకాయలమడ ఎత్తిపోతల పథకం

ముందుకు కదలని ‘స్లూయిస్‌’ ఫైల్‌

నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు

కరువు సీమలో పసిడి రాసులు పోగేసే ‘జొన్నగిరి గోల్డ్‌ మైనింగ్‌ ప్రాజెక్టు - జీజీఎంపీ’ని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారం భించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 700 మందికి ఉపాధి లభిస్తుంది. రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లు వచ్చి చేరుతుంది. వలసలకు నిలయ మైన పత్తికొండ ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు కీలకం కానున్నాయి. అయితే.. వ్యవసా యమే జీవనాధారమైన కందన వోలు ముంగిట జల సిరులతో మెట్ట చేలకు మళ్లించినప్పుడే పశ్చిమ ప్రాంతంలో వలసలను శాశ్వతంగా రూపుమాపవచ్చు. ఏటా కడలి పాలవుతున్న వందలు, వేల టీఎంసీలు తుంగభద్ర, కృష్ణా వరద జలాలు ఒడిసిపట్టి కాలువల ద్వారా మెట్టచేలకు మళ్లించాలి. అది జరగాలంటే అంతర్రాష్ట్ర సమస్య అంటూ ముద్రవేసి అటకెక్కించిన ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మాణం జరగాలి. జిల్లా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పనులు తక్షణమే చేపట్టాలి. కేవలం రూ.210 కోట్లు ఖర్చు చేస్తే, 45 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే హంద్రీనీవా ప్రాజెక్టు పత్తికొండ జలాశయం, కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులు పూర్తి చేయాలి. ఏడాదిన్నర క్రితం సీఎం హామీ ఇచ్చిన పుచ్చకాయలమడ ఎత్తిపోతల పథకం, హంద్రీనీవా స్లూయిస్‌ ఏర్పాటు పనులకు మోక్షం లభించాలి. నేడు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి)

రూ.210 కోట్లు ఇస్తే.. 45 వేల ఎకరాలకు సాగునీరు

హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి సీమ జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగు, 35 లక్షల జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7.5 టీఎంసీలు నీటిని వినియోగించుకొని 80 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పత్తికొండ (పందికోన) జలాశయం కుడి కాలువ (ఆర్‌బీసీ) పరిధిలో 50,620 ఎకరాలు, ఎడమ కాలువ (ఎల్‌బీసీ) పరిధిలో 10,774 ఎకరాలు కలిపి 61,394 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటే 15-20 వేల ఎకరాకు మించి ఇవ్వడం లేదు. ప్రధాన కారణం.. పత్తికొండ రిజర్వాయర్‌ రివిట్‌మెంట్‌, ఎడమ కాలువ పరిధిలో సింగిల్‌ లైన్‌ బిడ్జి (ఎస్‌ఎల్‌బీ), ఆర్‌బీసీ, ఫీల్డ్‌ చానల్స్‌, డిస్ట్రిబ్యూటరీలు, కుడి కాలువ (ఆర్‌బీసీ) పరిధిలో దేవనకొండ, ఆస్పరి మండలాల్లో డిస్ట్రీబ్యూటర్లు, ఫీల్డ్‌ చానల్స్‌, ఆర్‌అండ్‌బీ క్రాసింగ్‌ బిడ్జిలు, ఎల్‌బీసీ వంటి నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే మరో 45 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. అందుకోసం రూ.210 కోట్లు కావాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ఏళ్లు గడుస్తున్నా మోక్షం లభించడం లేదు. రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి చేసి కుప్పానికి కృష్ణా జలాలు తీసుకెళ్లారు. అయితే పత్తికొండ రిజర్వాయర్‌, కుడి, ఎడమ కాలువ అసంపూర్తి పనులపై నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిస్తోంది.

సీమ జలధామం గుండ్రేవుల

సీమ కరువు రైతుల జీవితాలు స్వర్గధామం కావాలంటే ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మాణం జరగాలి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో చర్చించి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. కేసీ కాలువ పరిధిలో కర్నూలు, నంద్యాల, పడప జిల్లాల్లో 2.65,628 ఎకరాల ఆయకట్లు ఉంది. 31.90 టీఎంసీల నీటివాటా ఉన్నా.. ఆ నీటిని నిల్వ చేసుకునే జలాశయం లేదు. తుంగభద్ర నది నుంచి ఏటేటా 180 టీఎంసీల వరద కృష్ణాలో చేరుతుంది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)-1 ప్రకారం తుంగభద్ర నుంచి శ్రీశైలం డ్యాంకు 32.75 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలి. ఆపై వరద జలాలు ఎగువన వాడుకునేందుకు హక్కు ఉందని రాయలసీమ సాగునీటి నిపుణులు అంటున్నారు. సుంకేసుల బ్యారేజీ ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మాణం చేస్తే కేసీ ఆయకట్టు, పశ్చిమ పల్లెలను సస్యశ్యామలం చేయవచ్చనే లక్ష్యంగా.. 2019 ఫిబ్రవరి 21న నాటి సీఎం చంద్రబాబు రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్‌టీ నం.154 జారీ చేశారు. మార్చి 2న కృతజ్ఞత శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యను గాలికొదిలేసింది. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం రావడంతో గుండ్రేవుల ఆశలు చిగురించినా.. ఈ ప్రభుత్వం కూడా వైసీపీ పాటే పాడుతూ అటకెక్కించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అంత ర్రాష్ట్ర సమస్య ఉందని పేర్కొనడమే ఇందుకు నిరద్శనం. 25న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర డ్యాం గేట్లు ప్రారంభోత్సవంలో ఒకే వేదికపై కలువనున్నారు. సీఎం చంద్ర బాబు గుండ్రేవులపై కర్ణాటక, తెలంగాణ సీఎంలతో చర్చించి సాకారం దిశగా కృషి చేయాలి. తద్వారా రాయలసీమను జలధామంగా మార్చాలని కరువు రైతులు కోరుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా సీఎం చంద్రబాబు, యువనేత, మంత్రి లోకేశ్‌లు యువగళం పాదయాత్ర, ప్రజాగళం సభల్లో స్పష్టమైన హామీ ఇచ్చారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలివే..

2024 అక్టోబరు 1న పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మీ గ్రామానికి ఏం కావాలి..? సీఎం అడిన ప్రశ్నకు గ్రామస్తులంతా ముక్తకంఠంతో.. మా ఊరు మీదుగా హంద్రీనీవా కాలువ వెళ్తుంది. కృష్ణా జలాలు ఎత్తిపోస్తే 800 ఎకరాలకు సాగునీరు అందుతుంది.. ఆ ఒక్క పని చేయండి అంటూ రైతులు విన్నవించారు. తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఇంజనీర్లను ఆదేశించారు. జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఇంజనీర్లు రూ.6.50 కోట్లలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఫైలుకు మోక్షం లభించలేదు. నిధులు మంజూరు కాలేదు.

హంద్రీనీవా కాలువ పొడవున ఎమిది తూములు ఏర్పాటు చేసి మెట్ట పొలాలకు సాగునీరు ఇవ్వాలిన నియోజకవర్గాల సమీక్షలో భాగంగా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, రైతులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు. తక్షణమే చేపడుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్‌ ఇంజనీర్లు రూ.8 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఏడాది గడిచినా ఆ ఫైలు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లు మారింది.

వీటిపై దృష్టి సారించాలి

ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల జనాభాకు సాగునీటి అందించాలని వేదవతి ఎత్తిపోతల పథకం రూ.1,94.80 కోట్లతో చేపట్టి పనులకు మొదలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లకు ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి పర్యావరణ అనుమతుల డీపీఆర్‌కు జీవో ఇచ్చారు. ప్రాజెక్టు పనులు చేపట్టాలి. భూ సేకరణకు నిధులు ఇవ్వాలి.

మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, 1.20 లక్షల జనాభాకు తాగునీరు అందించాలనే లక్ష్యంగా ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణానికి 2019 జనవరిలో రూ.1,985.42 కోట్లు కేటాయించారు. 0.4 శాతం పనులు జరిగాయి. ఈ ప్రాజెక్టు పనులకు మోక్షం ఎప్పుడో..?

జిల్లా ప్రాజెక్టుల్లో గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ఒకటి. నిర్వహణ, మరమ్మతులు లేక జీఆర్‌పీ సూగూరు రిజర్వాయర్‌కు గండి పడింది. రక్షణ లేక పంప్‌హౌస్‌ కేంద్రాల్లో దోపిడీ దొంగలు పడి కాపర్‌ వైర్‌ దోచుకెళ్లారు. మరమ్మతులకు రూ.11 కోట్లు కావాలని పంపిన ప్రతిపాదనలకు అతీగతిలేదు.

కర్నూలు సర్వజన వైద్యశాల, మెడికల్‌ కాలేజీ భనవాలు నిర్మాణాలు రూ.450 కోట్లతో, ఆదోని మెడికల్‌ కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాలు రూ.480 కోట్లతో చేపట్టారు. వివిధ దశల్లో నిర్మాణాలు ఆపేశారు. వీటిని పూర్తి చేసి పేదలకు వైద్య సేవలు మెరుగుపరచాలి.

Updated Date - Jun 23 , 2026 | 11:51 PM