Share News

సారా తయారీ మాకూ ఇష్టం లేదు

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:31 PM

సారా తయారు చేయడం తమకు కూడా ఇష్టం లేదని నీలి షికారీలు కలెక్టర్‌ రాజకుమారికి ఫోన్‌లో తెలియజేశారు.

సారా తయారీ మాకూ ఇష్టం లేదు
వివరాలు సేకరిస్తున్న ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది

వేరే పనులు ఎవరూ ఇవ్వడం లేదు..

చదువుకున్న వారికి ఉపాధి కల్పించండి

కలెక్టర్‌కు ఫోన్‌లో నీలి శికారి కాలనీవాసుల వినతి

నందికొట్కూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): సారా తయారు చేయడం తమకు కూడా ఇష్టం లేదని నీలి షికారీలు కలెక్టర్‌ రాజకుమారికి ఫోన్‌లో తెలియజేశారు. సారా నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన నవోదయం2.0 కార్యక్రమంలో భాగంగా సారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలను వివరిస్తూ మంగళవారం పట్టణంలోని నీలి షికారి కాలనీ వాసులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ ఎస్‌.ఐలు జఫ్రుల్లా, భాష్యం శ్రీనివాసులు, సిబ్బంది కృపవర కుమారి, మధుప్రసాద్‌, సుధీర్‌ కుమార్‌, రామీజాబి ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా నీలి షికారి కాలనీకి చెందిన వెంకటేష్‌, దిబ్బలమ్మ మాట్లాడుతూ సారా తయారు చేయడం తమకు కూడా ఇష్టం లేదని, ఎవ్వరూ వేరే పనులు ఇవ్వడం లేదని అన్నారు. సమాజంలో తమను నమ్మి ఎవరూ పని కల్పించడం లేదన్నారు. అక్కడి నుంచి అధికారుల ద్వారా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ సమాజంలో వివక్షతకు గురవుతున్నామని, ఎలాంటి గత్యంతరం లేక సారా తయారు చేస్తున్నామని కలెక్టర్‌ రాజకుమారికి తెలియజేశారు. తమ కాలనీలో 350 కుటుంబాలు ఉన్నాయని, వీరిలో 9 మంది డిగ్రీ, చాలా మంది ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నారని, వారికి ఉపాధి కల్పించాలని కోరారు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ నీలి షికారి కాలనీలో కుటుంబాల వారీగా సర్వే చేసి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. వారిలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. నాటుసారా ప్రభావిత కాలనీలో పాఠశాలలను సందర్శించి, ఆ పాఠశాలకు కావాల్సిన వసతులు గురించి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. పిల్లలను వయస్సుల వారీగా గుర్తించి వారిని అంగన్‌వాడీ సెంటర్‌, పాఠశాలలో చేర్పించి వారికి వసతులు కల్పించాలని ఆదేశించారు.

Updated Date - Mar 03 , 2026 | 11:31 PM