Share News

ఎండమావిగా ‘జలధార‘

ABN , Publish Date - May 03 , 2026 | 11:05 PM

భూగర్భ జల సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘జలధార.. జల హారతి’ పనులు చేపట్టింది.

ఎండమావిగా ‘జలధార‘
కర్నూలు మండలం బసవవరం గ్రామ పంచాయతీలో ఎంఐ చెరువులో పూడికతీత పనులు

పురోగతి లేని జలధార.. జలహారతి

కలెక్టర్‌ మంజూరు చేసిన పనులు 1,336

క్షేత్రస్థాయిలో 250 పనులే ప్రారంభం

ఉపాధి కూలీలతోనే పట్టి పనులు

మండుతున్న ఎండలు.. పనులపై ఆసక్తి చూపని కూలీలు

భూగర్భ జల సంరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘జలధార.. జల హారతి’ పనులు చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకొని చెరువుల్లో పూడికతీత వంటి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో సాగునీటి సంఘాలను భాగస్వాములను చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలో 1,336 పనులను కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి మంజూరు చేశారు. ఇప్పటికీ 250 లోపు పనులే ప్రారంభమయ్యాయి. అందులో సగం పనుల పురోగతి అడుగుల్లో అడుగులు వేస్తున్నాయి. జూన్‌ 15 తరువాత ఖరీఫ్‌ మొదలవుతుంది. మిగిలిన సమయంలో 40 రోజులే. ప్రత్యేక నిధులు లేకపోవడంతో చిన్ననీటి పారుదల ఇంజనీర్లు ఆటువైపు అడుగు కూడా పెట్టడం లేదు. ఎక్స్‌కవేటర్లు పెట్టడానికి సాగునీటి సంఘాల అధ్యక్షులు ముందుకు రావడం లేదు. నిధులు లేకపోవడంతో ప్రజాప్రతినిధులు కూడా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం ‘ఎండమావి’గా మారనుందా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. జిల్లాలో ‘జలధార.. జల హారతి’ పురోగతి తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, మే 3 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, డోన్‌, పత్తికొండ, ఆదోని సబ్‌ డివిజన్లలో చిన్నతరహా నీటిపారుదల శాఖ (మైనర్‌ ఇరిగేషన్‌) పర్యవేక్షణలో 100 ఎకరాల ఆయకట్టు పైబడిన చెరువులు 60, వంద ఎకరాలులోపు ఆయకట్టు ఉన్న చెరువులు 250, పీఆర్‌ చెరువులు కలిపి 310 చెరువులు ఉన్నాయి. వాటిలో నీటి నిల్వ సామర్థ్యం 4.411 టీఎంసీలు (4411 ఎంసీఎఫ్‌టీ). 33,113 ఎకరాల ఆయకట్టు ఉంది. అత్యధిక చెరువులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించినవే. మరమ్మతులు, పూడిక తీత చేపట్టకపోవడం వల్ల పూడిక, పిచ్చిమొక్కలు, ముళ్లకంపలతో చెరువులు నిండిపోయాయి. చెరువులోకి వర్షపు నీరు చేరే వాగులు (ఫీడర్‌ ఛానల్స్‌), పంట కాలువలు (ఫీల్డ్‌ ఛానల్స్‌) పూడిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడుతుంది. అంతేకాదు.. తూములు మరమ్మతులకు నోచుకోవడం లేదు. డ్వామా ఆధ్వర్యంలో నిర్మించిన చెక్‌ డ్యాంల పరిస్థితి దాదాపు ఇదే. భూగర్భ జలాలు (గ్రౌండ్‌ వాటర్‌) విభాగం అధికారులు ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే కోసిగి మండలంలో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ఏడాది మార్చి భూగర్భ జలాలు పరిశీలిస్తే, కోసిగి మండలంలో భూ మట్టం నుంచి 20 మీటర్లు కంటే దిగువ (లోతు)కు పడిపోవడం, రాష్ట్రంలోనే ప్రమాదకర పరస్థితి అని నిపుణులు అంటున్నారు. పశ్చిమ ప్రాంతంలో మెజార్టీ గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో భూగర్భ జలాల సంరక్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ‘జలధార.. జల సంరక్షణ పథకం’ అమలుకు శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని కూలీలు ద్వారా చెరువుల్లో పూడిక తీత వంటి మట్టి పనులకు ప్రాధాన్యత ఇస్తూ వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు.

పురోగతి అంతంతే..

డ్వామా సిబ్బంది, మైనర్‌ ఇరిగేషన్‌ (ఎంఐ) ఇంజనీర్లు గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు (ఫీడర్‌ ఛానల్స్‌), పంట కాలువలు (ఫీల్డ్‌ ఛానల్స్‌) గుర్తించి పూడికతీత, మరమ్మతుల పనులకు అంచనాలు తయారు చేశారు. జిల్లాలోని 27 మండలాల్లో శనివారం నాటికి క్షేత్రస్థాయిలో 3,436 పనులు గుర్తించారు. 2,823 పనులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయగా, 1,611 పనులకు మండల కమిటీలు ఆమోదం తెలిపాయి. కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి 1,611 పనులను మంజూరు చేశారు. డ్వామా, ఎంఐ ఇంజనీర్లు సమన్వయంతో కూలీలు, సాగునీటి సంఘాల సభ్యుల్లో అవగాహన కల్పించి వంద శాతం పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే.. ఉపాధి కూలీలకు ఇచ్చే వేతనాల నిధులతో మట్టి పనులు చేయించాలి. ప్రత్యేకమైన నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఎంఐ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని తెలుస్తోంది. నిధులు ఇవ్వనప్పుడు చెరువుల వద్దకు వెళ్లి మేమేం చేయాలని ఓ ఇంజనీరు ప్రశ్నించారు. ఇప్పటి వరకు డ్వామా సిబ్బంది క్షేత్రస్థాయిలో కేవలం 250 పనులు మాత్రమే ప్రారంభించారు. ఇంకా 1,086 పనులు మొదలే కాలేదని తెలుస్తోంది.

ఆసక్తి చూపని ప్రజా ప్రతినిధులు

ప్రత్యేక నిధులు వచ్చాయి.. పనులు చేయండి..! అంటే పోటా పోటీగా అధికారులపై ఒత్తిడి తెచ్చే గ్రామం నుంచి నియోజకవర్గం స్థాయి ప్రజా ప్రతినిధులు వరకు సీఎం చంద్రబాబు ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ‘జలధార.. జలహారతి’ పనులపై ఆసక్తి చూపడం లేదు. ఉపాధి కూలీలతో మాత్రమే పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి మట్టి పనులు చేయించాలి. జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), కేసీ కెనాల్‌, ఆలూరు బ్రాంచి కెనాల్‌, హంద్రీనీవా ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్ట్‌ సహా మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల పరిధిలో 2,20,499 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు ప్రాజెక్టు కమిటీలు, పది డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 123 సాగునీటి వినియోగ దారుల సంఘాలు (డబ్ల్యూయూఏ) ఉన్నాయి. 1,212 మంది టీఏలు ఉన్నారు. ప్రతి సాగునీటి సంఘానికి (డబ్ల్యూయూఏ) అధ్యక్షుడు, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. సాగునీటి సంఘాల పాలకవర్గం స్వచ్ఛందంగా ఎక్స్‌కవేటర్లు ఏర్పాటు చేసుకుంటే కలెక్టర్‌ డీజిల్‌కు సరిపడ నిధులు మాత్రమే ఇస్తారు. సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో ఒక్కరు కూడా ఇప్పటి వరకు ముందుకు రాలేదని తెలుస్తోంది. అదే క్రమంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇతర పనులపై ప్రత్యేక దృష్టిని సారించే ప్రజా ప్రతినిధులు సైతం మెటీరియల్‌ కాంపొనెట్‌ నిధులు లేకపోవడంతో జలధార.. జలహారతి పనులపై ఆసక్తి చూడపం లేదు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు సీఎం చంద్రబాబు ఆశయంలో పాలుపంచుకొని భూగర్భ జల సంరక్షణపై ప్రత్యేక దృష్టికి సారించాలని పలువురు కోరుతున్నారు.

క్షేత్రస్థాయిలో సమస్యలు

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం 43.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. తీవ్ర మైన ఎండల్లో పనులు చేయడానికి కూలీలు ముందుకు రావడం లేదు.

ఉదయం 6 నుంచి 10 గంటలు వరకు అంటే నాలుగు గంటలు మాత్రమే పనులు చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయలేకపోతున్నారు. దీంతో కనీస వేతనం రూ.250-270కు మించడం లేదు. చేసిన పని పరిమాణంతో సంబంధం లేకుండా కనీస వేతనం రూ.307 చెల్లించాలి.. ప్రతి వారం కూలీ డబ్బులు ఇవ్వాలి. ఫిబ్రవరి మూడో వారం నుంచి బకాయిలు ఉన్నాయి.

పని ప్రదేశంలో నీడ కోసం తాత్కాలిక షెడ్లు, మెడికల్‌ కిట్లు, తాగునీరు ఏర్పాటు చేయడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తీసుకు వెళ్లమని చెబుతున్నారు.

జలధార.. జల హారతి పనులు వివరాలు:

మండలాలు : 27

గ్రామాలు : 487

ఎంఐ చెరువులు : 239

అటవీ శాఖ చెరువులు : 7

గుర్తించిన పనులు : 3,436

ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేసినవి : 2,823

మండల కమిటీ ఆమోదం : 1,611

కలెక్టర్‌ మంజూరు : 1,336

ప్రారంభమైన పనులు : 250

మొదలు పెట్టాల్సిన పనులు : 1,086

పనుల పురోగతి పెంచుతాం

జలధార.. జల హారతి పథకం కింద కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి 1,336 పనులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 250 పనులు మొదలు పెట్టాం. రోజూ 1.20 లక్షల మంది కూలీలకు పని కల్పించాలని లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 60 వేల మంది కూలీలు పనికి వస్తున్నారు. సాగునీటి సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎవరైనా స్వచ్ఛందంగా ఎక్స్‌కవేటరు పెట్టేందుకు ముందుకు వస్తే డీజిల్‌కు మాత్రమే డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. పని ప్రదేశంతో నీడ, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తున్నాం.

- నరసింహారెడ్డి, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, కర్నూలు

Updated Date - May 03 , 2026 | 11:05 PM