కేసీకి నీటిని విడుదల చేయాలి
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:44 PM
: హంద్రీనీవా ఎత్తిపోతల నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు.
సాగునీటి కోసం రైతన్న ఆందోళన
నందికొట్కూరు రూరల్, జనవరి 23(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా ఎత్తిపోతల నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం శాతనకోట, మల్యాల కేసీ ఆయకట్టు రైతులు హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వద్ద అలాగే కేసీ కెనాల్‌లోకి దిగి నీరులేక ఎండిపోయిన కేసీ కెనాల్‌ను చూపుతూ ఆందోళన చేపట్టారు. ఎత్తిపోతల పథకం గేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఖరీ్‌ఫలో అధిక వర్షాలకు, తుఫానులకు పంటల దిగుబడి రాలేదని కనీసం రబీలో నైనా పంటలు పండించుకుందామంటే కేసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంలేదని రైతులు వాపోతున్నారు. రైతుల చేపట్టిన ధర్నాకు, ఆందోళనకు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం నాగేశ్వరారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపాల క్రిష్ణ మద్దతు తెలిపారు. కేసీకి నీటిని విడుదల చేయకపోతే రైతుల తరపున పెద్దఎత్తున ఆందోళన ధర్నాలు చేపడతామన్నారు.