Share News

కోడుమూరుకు తీరనున్న నీటి కష్టాలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:05 AM

పట్టణ ప్రజలకు ఇకపై తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైను ద్వారా కోడుమూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా జల్‌జీవన్‌ మిషన్‌ పథకం నుంచి రూ.38.67కోట్లు నిధులు విడుదలయ్యాయి.

కోడుమూరుకు  తీరనున్న నీటి కష్టాలు
గాజులదిన్నె ప్రాజెక్టు

జీడీపీ నుంచి పైపులైనుకు గ్రీన్‌ సిగ్నల్‌

జల్‌ జీవన్‌ మిషన్‌లో రూ.38.67కోట్లు విడుదల

రామచంద్రాపురానికి మరో రూ.47.95 లక్షలు

కోడుమూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలకు ఇకపై తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైను ద్వారా కోడుమూరు పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా జల్‌జీవన్‌ మిషన్‌ పథకం నుంచి రూ.38.67కోట్లు నిధులు విడుదలయ్యాయి. అలాగే ప్యాలకుర్తి పరిధిలోని రామచంద్రాపురం గ్రామానికి మరో రూ.47.95లక్షలు కూడా విడుదల చేసింది. టెండర్‌ ప్రక్రియ అయిన వెంటనే పనులకు శంకుస్థాపన చేయిస్తామని, ఈ పనులు పూర్తి అయిన అనంతరం ప్రతి రోజు కొళాయిలకు నీళ్లు అందిస్తామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు. కోడుమూరు పట్టణంలో ప్రస్తుతం 45వేలకు పైగా జనాభా ఉంది. పట్టణ ప్రజలు 20 సంవత్సరాల నుంచి తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం మహిళలు రోడ్లపై బైఠాయించి ధర్నాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు రోజులకు ఓసారి వచ్చే నీటితోనే ప్రజలు నెట్టుకొచ్చేవారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే జీడీపీ నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా తాగునీటి తీసుకొచ్చి ప్రజల కష్టాలను తీరుస్తామని కేడీసీసీ చైర్మన్‌ డి.విష్ణువర్థన్‌రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిలో ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. ఒకవేళ జీడీపీ నీరు కోడుమూరు రాకపోతే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడగమని కూడా వారు అప్పట్లో వాగ్ధానం చేశారు. విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్యే దస్తగిరిలు పలుమార్లు సీఎం చంద్రబాబు, ప్రభుత్వ అధికారుల దృష్టికి కోడుమూరు దాహార్తి కష్టాలను తీసుకెళ్లి సమస్యను పరిష్కరించగలిగారు.

జీడీపీ నుంచి రోజుకు 20 లక్షల లీటర్లు పంపింగ్‌

జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఈ పనులు పూర్తయిన అనంతరం కోడుమూరు పట్టణ ప్రజలకు ప్రతి రోజు 20లక్షల లీటర్ల నీటిని చేయవచ్చు. జీడీపీ నుంచి సుమారు 12 ఇంచుల పైపు లైను ద్వారా నీటిని తీసుకొచ్చి, కోడుమూరు పట్టణంలోని కొండ ప్రాంతంలో 7 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల సంపును నిర్మించనున్నారు. అలాగే నీటి శుద్ధి ప్లాంట్‌ కోసం మరో 6లక్షల లీటర్ల సంపును ఏర్పాటు చేస్తారు. ప్రతి రోజు నీటిని విడుదల చేసేందుకు పట్టణంలో 2.50 లక్షల లీటర్ల సామర్థ్యం గల నాలుగు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మిస్తారు. ఈ పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు శాశ్వత నీటి పరిష్కారంలో భాగంగా ప్రతి రోజు 20 లక్షల లీటర్ల వరకు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వెల్లడించారు.

మరింత అభివృద్ధి చేస్తా

ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాము. జల్‌జీవన్‌ మిషన్‌ కింద గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపు లైను కోసం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రజలకు ఇక నుంచి తాగునీటి సమస్య ఉండదు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి సహకరిస్తే మరింత అభివృద్ధి చేస్తాం. నిధులు మంజూరు సహకరించిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాన్‌, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు. - డి.విష్ణువర్థన్‌రెడ్డి, కేడీసీసీబీ చైర్మన్‌, కర్నూలు

ఎంతో కష్టపడ్డాం

నిధుల కోసం ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దృష్టికి పదేపదే తీసుకెళ్లాం. మా అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయించారు. ఇందుకు పడిన కష్టం మాటల్లో చెప్పలేము. ప్రజల తాగునీటిని అందిస్తామనే సంతోషం ఎదుట మా కష్టాలేవీ కనడపలేదు. - బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్యే, కోడుమూరు.

టెండర్‌ పూర్తయిన వెంటనే పనులు

నిధులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టెంటర్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులకు శంకుస్థాపన చేయిస్తాం. ఈ పనులను ఏడాదిలోపు పూర్తి చేయించి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని ప్రతి రోజు అందిస్తాం. - ప్రసాద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, కోడుమూరు

Updated Date - Mar 29 , 2026 | 12:05 AM