Share News

నీటి గండం

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:00 AM

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కోడుమూరు పట్టణానికి తాగునీటి గండం ముంచుకు వస్తోంది. హంద్రీ నదిలో నీరు ఇంకిపోతోంది. హంద్రీ నదిలో నీరు ఉంటే కూడా 5 రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నది ఎండిపోతే 10రోజులకోసారి కూడా నీటిని విడుదల చేయడం కష్టతరంగా మారుతోంది. ప్రజలకు హంద్రీనదినే తాగునీటికి ప్రధాన ఆధారం. యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఇసుక దోపిడీని అరికట్టి ప్రజలకు తాగునీటి కష్టాలు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

నీటి గండం
హంద్రీనదిలో ఇంకిపోతున్న నీరు

హంద్రీ నదిలో ఇంకిపోతున్న నీరు

మొరాయిస్తున్న మంచినీటి పథకాలు

గాజులదిన్నె ప్రాజెక్టు నీటిపైనే ఆశలు

నేటికీ ఆగని ఇసుక దోపిడీ

కోడుమూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలకు నీటి గండం ముంచుకు వస్తోంది. మంచినీటి పథకాల మోటార్లు మొరాయిస్తున్నాయి. ప్రజలకు తాగునీటి అందించేందుకు సంబంధిత అధికారులు కష్టతరంగా మారుతోంది. గాజులదిన్నె ప్రాజెక్టులోని నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టులో 2టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్‌ డి.విష్ణువర్థన్‌రెడ్డి ముం దస్తు చర్యలో భాగంగా కలెక్టర్‌, ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి హంద్రీ నదికి జీడీపీ నీటిని విడుదల చేయించేలా ప్రణాళిక రచించాలి. లేకపోతే రాబోయే వారం లేక 10రోజుల్లో ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి

పది రోజులకోసారి కూడా కష్టమే..

కోడుమూరు పట్టణంలో దాదాపు 45వేల మంది జనాభా ఉంది. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినప్పటికీ ప్రజల తాగునీటి కష్టాలు మాత్రం మారడం లేదు. హంద్రీ నదిలో నీరు ఉంటే కూడా ఐదు రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నారు. నది ఎండిపోతే 10 రోజులకోసారి కూడా నీటిని విడుదల చేయడం కష్టతరంగా మారుతోంది. ప్రజలకు హంద్రీనదినే తాగునీటికి ప్రధాన ఆధారం. వేసవి కాలం వచ్చిందంటే భూగర్భజలాలు ఇంకిపోయి చుక్కనీరు దొరకదు. జీడీపీ, ఎల్లెల్సీ నీటిని హంద్రీనదికి విడుదల చేయించి ప్రజలకు నీరు అందించాలి. వర్షాభావ పరిస్థితులతో వర్షాకాలంలో కూడా హంద్రీనది ఎండిపోతుండటంతో ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు స్పందించి హంద్రీనదికి జీడీపీ నీటిని విడుదల చేయించి తాగునీటి కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

ఇసుకను దోచుకెళ్తున్నారు..

హంద్రీ నదిలో ఇరవై ఏళ్ల నుంచి ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇసుక మేటలు కనుచూపు మేర కనిపించడం లేదు. పంచాయతీ అధికారులు ప్రజల తాగునీటి అవసరాల కోసం వేసిన బోర్ల దగ్గర కూడా ఇసుకను దోచుకెళ్తున్నారు. ఇసుక మేటలు లేకపోవడంతో వచ్చిన నీరంతా వృఽథాగా ముందుకు వెళ్లిపోతున్నారు. ఈవిషయం తెలిసి కూడా ఇసుక దోపిడీ జరుగుతున్నా ఇటు పంచాయతీ పాలకవర్గం, పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోయారు. నేటికీ కోడుమూరు, గోరంట్ల, ముడుమలగుర్తి, క్రిష్ణాపురంలోని హంద్రీనదిలోంచి ట్రాక్టర్లు, ఎండ్ల బండ్లలో ఇసుకను తరలించుకెళ్తున్నారు.

ప్రకటనలకే పరిమితం

కూటమిఅధికారంలోకి వచ్చిన వెంటనే జీడీపీ నుంచి కోడుమూరుకు పైపులైను ద్వారా నీటిని తీసుకొచ్చేందుకు నిధులు ఇవ్వాలని విష్ణువర్థన్‌రెడ్డి, బొగ్గుల దస్తగిరి కలిసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, పట్టుబట్టి చివరకు ‘జల్‌జీవన్‌ మిషన్‌’ కింద సుమా రు రూ.39కోట్లు విడుదల చేయించారు. ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందే కానీ ఇంత వరకు టెండర్‌ ప్రక్రియ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా పూర్తిచేసి తాగునీటికి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

ఇసుక దోపిడీని అరికట్టాలి

నదిలో ఇసుక లేకపోతే ఎన్ని నీళ్లు విడుదల చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పంచాయతీ, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి ఇసుక దోపిడీని అరికట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నదిలోని ఉన్న ఇసుకను కాపాడుకోలేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు. - మునిస్వామి, మాలమహానాడు, కోడుమూరు

Updated Date - Jul 09 , 2026 | 12:00 AM