ప్రాణాంతకంగా గుర్రపు డెక్క
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:14 AM
దేవనగర్‌కు చెందిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి అభిజయ్(12) ఆదివారం మిత్రులతో కేసీ కెనాల్ వద్దకు వెళ్లాడు. కాలుజారి నీటిలో పడ్డాడు. క్షణాల్లో కాలువలో ఉన్న గుర్రపుడెక్కలో ఇరుక్కుపోయి గల్లంతయ్యాడు. సోమవారం శవమై బయటపడ్డాడు. ఈ ఘోరానికి కారణం ఎవరు? ఉజ్వల భవిత ఉన్న విద్యార్థి మరణానికి ఏ అధికారి బాధ్యత పడతారు? కేసీ మురికి గుంటగా మారిన వైనంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
పసివాడి మరణానికి బాధ్యులెవరు?
మురుగుకాల్వలా గుర్రపు డెక్క
నిరుపయోగంగా మారిన వందలాది లస్కర్లు.. ఇంజనీర్ల పర్యవేక్షణ
ఇప్పటికైనా కేసీని శుద్ధి చేసి.. రక్షణ చర్యలు చేపడతారా..?
కర్నూలు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): దేవనగర్‌కు చెందిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి అభిజయ్(12) ఆదివారం మిత్రులతో కేసీ కెనాల్ వద్దకు వెళ్లాడు. కాలుజారి నీటిలో పడ్డాడు. క్షణాల్లో కాలువలో ఉన్న గుర్రపుడెక్కలో ఇరుక్కుపోయి గల్లంతయ్యాడు. సోమవారం శవమై బయటపడ్డాడు. ఈ ఘోరానికి కారణం ఎవరు? ఉజ్వల భవిత ఉన్న విద్యార్థి మరణానికి ఏ అధికారి బాధ్యత పడతారు? కేసీ మురికి గుంటగా మారిన వైనంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
1863లో ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం కర్నూలు-కడప కాలువ (కేసీ కెనాల్)ను నిర్మించింది. 163 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన మంచినీటి ప్రవాహ కాలువ ఇది. తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీ నుంచి కడప వరకు 306 కిలోమీటర్లు కాలువ నిర్మించారు. కర్నూలు జిల్లాలో 55 కిలోమీటర్లు, నంద్యాల జిల్లాలో 178 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కర్నూలు నగరంలో మునగాలపాడు నుంచి జొహరాపురం వరకు 8.5 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కేసీ కాలువ పరిరక్షణ, పర్యవేక్షణ కోసం ఒక సర్కిల్ కార్యాలయం, డివిజన్, నాలుగు సబ్ డివిజన్లు ఉన్నాయి. ఎస్‌ఈ, ఈఈలు సహా నలుగురు డీఈఈలు, 16 మంది ఏఈఈ/ఏఈలు, 278 మంది లస్కర్లు పని చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 55 కిలోమీటర్లు కాలువ ఉంటే.. 78 మంద లస్కర్లు ఉన్నారు. అంటే.. కాలువ నిత్య పర్యవేక్షణకు 3-5 కిలోమీటర్లకు ఒక లస్కరు పని చేయాల్సి ఉంటే.. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 700 మీటర్లకు ఒక లస్కరు ఉన్నారు.
బాధ్యత లేని లస్కర్లు
లస్కర్ల ప్రధాన బాధ్యత కాలువలో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ప్రవహించేలా చూడాలి. గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. కాలువ గట్లను కాపాడాలి. ఇందుకోసమే ప్రభుత్వం నెలనెల జీతాల రూపంలో రూ.కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తూ.. లస్కర్ల వ్యవస్థ, అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. రెగ్యులర్ లస్కర్లకు నెలకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు, కాంట్రాక్ట్ లస్కర్లకు రూ.25 వేల వరకు జీతాలు చెల్లిస్తుంది. రికార్డుల్లో వందల సంఖ్యలో లస్కర్లు పని చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో వారు కనిపించడం లేదనే ఆరోపణులు ఉన్నాయి. కొందరైతే వ్యాపారాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారితో పని చేయించాల్సిన పర్యవేక్షణ ఇంజనీర్లు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా కేసీ కాలువు గుర్రపుడెక్కతో నిండిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి.
నిర్లక్ష్యం వెనుక..
కాలువలో గుర్రపుడెక్క పేరుకుపోకుండా చూడడంలో జలవనరుల శాఖ నిర్లక్ష్యం ఉంది. అందులో గుర్రపుడెక్క పెరగడానికి మురునీరు కేసీ కాలువలో వదిలేస్తున్న నగరపాలక సంస్థ అధికారులూ నిర్లక్ష్యంగానే ఉన్నారు. కాల్వ పక్కనున్న కాలనీల నుంచి మురునీటిని వదిలేయడం వల్లనే గుర్రపుడెక్క.. వంటి నీటిమొక్కలు పెరుగుతున్నాయి. స్వచ్ఛమైన తాగునీరు అందించే కాల్వలోకి మురుగునీటిని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. తాగునీటి కాలువలు, నదుల్లోకి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మురుగునీటి వదలకూడదని, నిర్లక్ష్యంగా వదిలేస్తే కఠిన చర్యలు తప్పవంటూ 2018లోనే జాతీయ హరిత ట్రిబ్యునల్ (గ్రీన్ ట్రిబ్యునల్) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే వదిలేస్తే ఒక్కో ఎస్టీపీకి నెలకు రూ.10 లక్షల వరకు పెనాల్టీ వేయాల్సి వస్తుందని ఆదేశాలు జారీ చేసినా కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేసీ కాలువతో పాటు తుంగభద్ర, హంద్రీ నదుల్లోకి విచ్చలవిడిగా మురునీరు వదిలేస్తున్నారు. అదే క్రమంలో కేసీ కెనాల్‌లోకి మురుగు వదలవద్దని ఇరిగేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారులకు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా గుర్రపుడెక్క కాలువను కప్పేయడంతో ఓ విద్యార్థి మృత్యుఒడి చేరాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం స్నానానికి వెళ్లిన భార్య, ఆమెను కాపాడానికి వెళ్లిన భర్త ఇద్దరు కూడా కేసీలో కొట్టుకుపోయి మృత్యుఒడి చేరారు.
ఇప్పటికైనా మేల్కొంటారా..?
కేసీ కాలువ నిర్వహణ, నగరంలో భద్రతపై జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలి. లస్కర్లు, పర్యవేక్షణ అధికారులను అప్రమత్తం చేసి కాలువలో గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు సహా వ్యర్థాలు చేరకుండా ఇరిగేషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. నిత్యం కాలువను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలి. నరగంలో 8.50 కిలోమీటర్లు పొడవున కాల్వలోకి పిల్లలు, మహిళలు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. మునగాలపాడు నుంచి గీతాముఖర్జీనగర్, మామిదాలపాడు, మాసామసీద్, స్టాంటన్‌పురం, కొండారెడ్డి, మమతానగర్, భగత్ సింగ్‌నగర్, శ్రీనగర్ కాలనీ, ఽధర్మపేట, బంగారుపేట, కారల్‌మార్క్స్ నగర్, వినాయకఘాట్, లక్ష్మినగర్, జొహరాపురం కాలనీల నుంచి కేసీలోకి అక్రమంగా కలిపిన డ్రెయినేజీ ఔట్‌లెట్లను గుర్తించి వాటిని మూసివేయాలి. ఆ మురుగునీటిని సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్‌టీపీ)ల ద్వారా శుద్ధిచేసి, మొక్కలు పెంపకం.. వంటి ఇతర అవసరాలకు వినియోగించాలి. లేకుంటే గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోతుంది. కేసీలో మరో చిన్నారి బలికాక ముందే మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మేల్కొనాలి.
బాలుడి మృతదేహం లభ్యం
కర్నూలు క్రైం: కేసీ కెనాల్‌లో గల్లంతైన అభిజయ్(12) అచూకి లభ్యమైంది. స్థానిక సోమిశెట్టినగర్‌కు చెందిన అభిజయ్ తోటి స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి కేసీలో గల్లంతైన విసయం తెలిసిందే. అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు గజ ఈతగాళ్లు ఆదివారం సాయంత్రం నుంచే గాలించారు. సోమవారం ఉదయం కేసీ కెనాల్‌లో బాలుడి ఆచూకి లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి మార్చురికి తరలించారు. బాలుడి ఆచూకి లభ్యమైనప్పుడు పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్రపుడెక్క తొలగించేందుకు చర్యలు
కేసీ కాలువలో గతంలో గుర్రపుడెక్క కనిపించేది కాదు. ఇటీవల కాలంలో నగరపాలక సంస్థ వారు మురుగు వదలేస్తున్నారు. ఆ నీటిని ఎస్‌టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి ఇతర అవసరాలకు వాడుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి కేసీలోకి మురునీరు రాకుండా చర్యలు తీసుకుంటాం. లస్కర్లను అప్రమత్తం చేసి కాలువ పరిశుభ్రంగా నిర్వహించేలా చూస్తాం. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. - కబీర్‌బాషా, సీఈ, జలనవరుల శాఖ ప్రాజెక్ట్స్, కర్నూలు