నిధులిస్తేనే నీళ్లు..!
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:41 PM
కరువు సీమ మెట్ట చేలకు సాగునీరు అందాలి.. వలసలు ఆగిపోవాలి..
వేదవతి ప్రాజెక్టు పట్టాలు ఎక్కాలంటే భూ సేకరణ చేయాలి
రూ.124 కోట్లు తక్షణం ఇవ్వాలి
ఎస్‌ఆర్‌ఎంసీ, గాలేరు-నగరి కాలువల ఆధునికీకరణ ప్రారంభించాలి
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నీలినీడలు
పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులకు మోక్షం లభించేనా?
గుండ్రేవులు జలాశయంపై చర్చ జరగాలి
నేడు సాగునీటి ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష
కరువు సీమ మెట్ట చేలకు సాగునీరు అందాలి.. వలసలు ఆగిపోవాలి.. ఈ చిరకాల స్వప్నం సాకారం కావాలంటే, వృథాగా కడలి పాలు అవుతున్న తుంగభద్ర జలాలు సద్వినియోగం చేసుకోవాలంటే గుండ్రేవులు జలాశయాన్ని నిర్మించాలి. దీనికి అవసరమైన నిధులను ఇవ్వాలి. సీమ కరువు రైతుల విన్నపం ఇది. సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న పోలవరం సహా 36 ప్రాజెక్టుల పురోగతి, వివిధ సాగునీటి ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై సమీక్షించనున్నారు. నేటి ఈ సమీక్షా సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జలవనరుల ప్రాజెక్టుల సీఈ కబీర్‌బాషా అమరావతికి చేరుకున్నారు. వేదవతి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గోరుకల్లు జలాశయం వరకు ఎస్‌ఆర్‌ఎంసీ, గాలేరు-నగరి కాలువల ఆధునికీకరణపై సమీక్షిస్తారు. శ్రీశైలం జలాశయం, భద్రత, రాతిపరుపు కుంగిపోతున్న గోరుకల్లు జలాశయం, అసంపూర్తిగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువలు సహా వివిధ ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాబోయే రెండురేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలోకి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో కర్నూలు జిల్లాలో వేదవతి ఎత్తిపోతల పథకం ఉంది. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల మీదుగా ప్రవహించే వేదవతి నుంచి ఎనిమిది టీఎంసీలు ఎత్తిపోసి ఆలూరు, ఆదోని, మంత్రాయలం నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంగా 2019 జనవరిలో ఆనాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు రూ.1,942.38 కోట్లు మంజూరు చేస్తూ జీవో.ఆర్‌టీ.నెం.77 జారీ చేసింది. టెండర్లు పూర్తి చేసి పనులు కూడా మొదలు పెట్టింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళు నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే ఆదిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో వేదవతిని కూడా చేర్చి 2028 జూన్ ఆఖరులోగా పూర్తి చేసి రైతులకు అంకితం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 3న రూ.1,942.80 కోట్లు మంజూరు, పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో ఆర్‌టీ నం.497 జారీ చేశారు. ప్రాజెక్టులో భాగంగా 1.27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే మొలగవెళ్లి జలాశయం నిర్మాణానికి భూమి ఎంత వరకు అనుకూలంగా ఉందో..? నిర్ధారించడానికి భూ పటిష్ట పరీక్షల కోసం కోర్ కటింగ్ పనులకు ప్రాజెక్టు సీఎం కబీర్ బాషా ఇటీవలే ప్రారంభించారు. అయితే.. ఈ పనులు గడువులోగా పూర్తి చేయాలంటే.. 4,781 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాలి. అందుకు రూ.124 కోట్లు తక్షణం విడుదల చేయాలని జలవనరుల శాఖ అధికారులు నివేదిక పంపారు. ఈ ఫైల్ ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉంది. సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల జోక్యం చేసుకొని భూ సేకరణ నిధులు మంజూరు చేయించాలి. అదే క్రమంలో వేగంగా పనులు జరిగేలా చర్యలు చేపట్టాలి.
గాలేరు-నగరి కాలువ లైనింగ్ చేయాలి
కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో శ్రీశైలం కుడిగట్టు మెయిన్ కెనాల్ (ఎస్‌ఆర్‌ఎంసీ), గాలేరు-నగరి (జీఎన్‌ఎ్‌సఎ్‌స) కాలువలు సామర్థ్యం పెంపు ఒకటి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) శ్రీశైలం కడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ) 16.8 కి.మీలు, బీసీఆర్ నుంచి గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఎస్‌ఆర్‌బీసీ/గాలేరు-నగరి(జీఎన్‌ఎ్‌సఎ్‌స) కాలువల సామర్థ్యం పంపు, ఆధునికీకరణ పనులు రూ.1,500 కోట్లతో చేపట్టారు. ఎస్‌ఆర్‌ఎంసీ పనులు 90 శాతం పూర్తి చేశారు. గాలేరు-నగరి కాలువ 55 కిలోమీటర్లు సీసీ లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 615 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అందులో రూ.450 కోట్లు కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించారు. మరో 165 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ.900 కోట్లు పనులు చేయాల్సి ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్ల శ్రీశైలం డ్యాంకు ఆశాజనకంగా వరద చేరలేదు. రేపోమాపో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల ఆగిపోతుంది. దీంతో తక్షణం కాంట్రాక్ట్ సంస్థ సామర్థ్యం పెంపు లైనింగ్ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. అయితే.. బకాయిలు చెల్లిచాలని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. నిధులు ఇస్తేనే సీమ జీనవాడి అయిన గాలేరు-నగరి కాలువ లైనింగ్ పనులు ఈ సీజన్‌లో పూర్తి చేయడానికి అవకాశం ఉంది.
శ్రీశైలం భద్రతపై దృష్టి సారించాలి
పొలావరం ప్రాజెక్టు, ప్రాధాన్యత ప్రాజెక్టుల సమీక్షతోనే సీఎం చంద్రబాబు సరిపుచ్చకుండా తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం డ్యాం భద్రత, అసంపూర్తి సీమ ప్రాజెక్టులపై కూడా సమీక్షించాల్సి ఉంది. కరువు సీమ పల్లెలకు జీవజలం అందించే శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారిందని పలు నిపుణుల కమిటీలు తేల్చి చెబుతున్నాయి. 2009 అక్టోబరులో 25.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో ప్రాజెక్టు దెబ్బతింది. డ్యాం పర్యవేక్షణ, మరమ్మతులకు కీలకమైన అప్రోచ్ రోడ్డు వరదకు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు గేట్లు దిగువన ఆప్రాన్ ముందు భాగంగాలో పంజ్‌పూల్ భారీ గొయ్యి ఏర్పడింది. పంజ్‌పూల్ గొయ్యి విస్తరించకుండా డ్యాం పునాదులకు రక్షణగా ఏర్పాటు చేసిన ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు పూర్తిగా శిథిలావస్థవకు చేరాయి. రాష్ట్ర విభజన తరువాత సీఎం చంద్రబాబు డ్యాం భద్రతపై దృష్టి పెట్టారు. డ్యాం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నియమించిన పలు నిపుణుల కమిటీలు నివేదికలు ఇచ్చాయి. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.203.95 కోట్లు మంజూరు చేసింది. డ్యాం ఇరువైపు కొండ రాళ్లు ఊడిపోకుండా రూ.5.90 కోట్లతో షాట్‌క్రీటింగ్, రూ.25.50 కోట్లతో కీలకమైన అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టారు. డ్యాం భద్రత కోసం ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ నీళ్లలో సిలిండర్లు ఎలా ఏర్పాటు చేయాలి..? పంజ్‌పూల్ గుంతను శాశ్వతంగా పూడ్చివేసేందుకు ఉన్న అవకావాలు ఏమిటి..? అధ్యయనం కోసం సీడబ్ల్యూసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయలేదు. ఎల్‌నినో ప్రభావం వల్ల వచ్చే జూన్ వరకు డ్యాంలో వరద చేరే అవకాశాలు కనిపించడం లేదు. అంటే.. దాదాపు పది నెలలు సమయం ఉంది. నిధులు కూడా ఉన్నాయి. సీఎం చంద్రబాబు, జలవనరలు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డ్యాం ప్రొటెక్టివ్ స్టీల్ సిలిండర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ఆ విషయంపై నేటి సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేయాలి.
ఒక సమీక్షా.. ఎన్నో ఆశలు
హంద్రీనీవా సులజ స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా పత్తికొండ (పందికోన) జలాశయం కుడి కాలువ (ఆర్‌బీసీ) పరిధిలో 50,620 ఎకరాలు, ఎడమ కాలువ (ఎల్‌బీసీ) పరిధిలో 10,774 ఎకరాలు కలిపి 61,394 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పత్తికొండ రిజర్వాయర్ రివెట్మెంట్, కుడి, ఎడమ కాలువ పరిధిలో సింగిల్ లైన్ బిడ్జి (ఎస్‌ఎల్‌బీ), ఆర్‌బీసీ, ఫీల్డ్ చానల్స్, డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ చానల్స్, ఆర్‌అండ్‌బీ క్రాసింగ్ బిడ్జిలు, ఎల్‌బీసీ వంటి నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వీటిని పూర్తి చేస్తే 61,394 ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. అందుకు రూ.255 కోట్లు నిధులు కావాలి. దీనిపై కూడా చర్చ జరగాలి.
సీమ కరువు రైతుల జీవితాలు స్వర్గధామం కావాలంటే ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మాణం చేయాలంటూ సీమ రైతుల దశాబ్దాల స్వప్నం. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ కాలువ కింద 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, కర్నూలు నగరానికి తాగునీరు, పశ్చిమ పల్లెసీమల్లో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత చెక్ పెట్టాలంటే ఈ ప్రాజెక్టుకు ఎంతో కీలకం. జూలై 35న హోస్పెట్‌లో తుంగభద్ర డ్యాం గేట్లు ప్రారంభోత్సవం సందర్భంగా తుంగభద్ర జలాలు వినియోగంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. కేంద్రం నిపుణుల కమిటీని కూడా వేసింది. తెలంగాణతో చర్చించి ఈ ఏడాదిలో ఈ ప్రాజెక్టుకు పునాది రాయి వేసేలా ఇంజనీర్లకు దిశానిర్దేశం చేసేలా చర్చించాలని నిపుణులు కోరుతున్నారు.
గోరుకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 12.44 టీఎంసీలు. ఆనకట్ట గరిష్టంగా ఎత్తు 45 మీటర్లు కాగా.. 4.6 మీటర్లు ఎత్తులో మట్టి ఆనకట్ట నిర్మాణం, రాతి పరుపు ఏర్పాటు, ఆప్‌టెక్ స్లూయిస్, చ్యూట్ డ్రైన్.. వంటి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గత వైసీపీ హయాంలో ఐదేళ్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో నిర్వహణ లేక ఆనకట్ట రాతిపరుపు కుంగిపోతుంది. మరమ్మతులు, అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం రూ.53 కోట్లు మంజూరు, టెండర్లు పూర్తి చేసి నివేదికను కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)కి పంపించి అప్రూవల్ తీసుకున్నారు. అయితే.. ఎల్-1 సంస్థ సమర్పించిన రికార్డులు సక్రమంగా లేవంటూ ఎల్-3గా ఉన్న సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో అసంపూర్తి పనులకు మళ్లీ బ్రేక్ పడింది. కోర్టు వివాదం ఎట్టకేలకు ముగిసింది. కాంట్రాక్ట్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకొని తక్షణమే పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్టు అసంపూర్తి పనులు, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ, పులికనుమ జలాశయం సామర్థ్యం పెంపు, ఆవుకు జలాశయం మరమ్మతులు.. వంటి వాటిపై కూడా చర్చించి సీమ ప్రాజెక్టుల సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ విడుదల చేయాలని సీమ నిపుణులు ప్రధాన డిమాండ్.