కేసీ రైతులకు నీటి కబురు
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:40 PM
కేసీ కాలువ ఆయకట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సాగులో ఉన్న పంటలు చేతికొచ్చేవరకు సాగునీరు అందించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సాగులో ఉన్న పంటలకు కృష్ణాజలాలు
ముచ్చుమర్రి-మల్యాలల నుంచి విడుదల
నందికొట్కూరు జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కేసీ కాలువ ఆయకట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సాగులో ఉన్న పంటలు చేతికొచ్చేవరకు సాగునీరు అందించేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శ్రీశైలం జలాశయం ఎగువన మాల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి కేసీ కాలువకు కృష్ణాజలాలు ఎత్తిపోయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు హుటాహుటిన నీటిని విడుదల చేశారు. ముచ్చుమర్రి నుంచి 4 పంపులు ఆన్ చేసి 950 క్యూసెక్కులు విడుదల చేశారు. అదేవిధంగా మాల్యాల నుంచి రెండు పంపులు ఆన్ చేసి 670 క్యూసెక్కులు మొత్తం 1,625 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు.
తుంగభద్ర డ్యాంకు కొత్తగా గేట్లు అమర్చేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్లూసీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది నీటి నిల్వను 80 టీఎంసీలకు కుదించారు. దీంతో రెండో పంటకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని, గత ఏడాది డిసెంబరు 2న జరిగిన నంద్యాల జిల్లా ఐఏబీ సమావేశంలో తెలియజేస్తూ కేసీ కింద 0/0 నుంచి 150 కిలో మీటరు వరకు రెండో పంటకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని ఇంజనీర్లు స్పష్టం చేశారు. అయితే.. శ్రీశైలం జలాశయంలో పుష్కలంగా నీరు ఉండటంతో నందికొట్కూరు, పాణ్యం, శ్రీశైలం నియోజకవర్గాలకు చెందిన ఆయా గ్రామాల రైతులు దాదాపు 40వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేశారు. రూ.కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఐఏబీ తీర్మానం మేరకు ఈ నెల 15న సుంకేసుల బ్యారేజీ నుంచి నీటి విడుదలను ఇరిగేషన్ అధికారులు ఆపేశారు. అదే క్రమంలో మాల్యాల, ముచ్చుమర్రిల ద్వారా నీరు ఇస్తారనుకుంటే.. కేఆర్‌ఎంబీ అనుమతులు లేవంటూ పంపులు ఆన్‌చేయలేదు. వాడిపోతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెట్టారు. ప్రభుత్వం కనికరించి నీరు ఇవ్వకపోతే రూ.800 కోట్లకు పైగా పెట్టుబడి దిగుబడులు నష్టపోతామనీ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. కేసీ రైతుల కన్నీటి వేధనను ఆంధ్రజ్యోతి.. ‘రైతు కేసీ చూడండి’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. అదే క్రమంలో పాణ్యం, నందికొట్కూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు గౌరు చరిత, గిత్తా జయసూర్య, బుడ్డా రాజశేఖర్ రెడ్డిలు సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, సలహాదారుడు వెంకటేశ్వరరావు, కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సీఈ కబీర్ బాషాలతో చర్చించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకుని కృష్ణాబోర్డు కేటాయించిన కోటాకు లోబడి సాగులో ఉన్న పంటలను రైతులను కాపాడేందుకు నీటిని విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కేసీ ఆయకట్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖ అధికారులు సమన్వయంతో నీటి వృథా జరగకుండా కాలువపై పర్యవేక్షణ చేపట్టాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. రైతులు నీటి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సీఈ కబీర్ బాషా సూచించారు.