తుంగభద్రలో తగ్గిన నీటి నిల్వలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:46 PM
కన్నడనాట కస్తూరి తుంగభద్ర జలాశయం కర్నూలు జిల్లా రైతులకు జీవనాడి. 1.5లక్షల ఎకరాలకు సాగునీరు 110 గ్రామాలకు తాగునీరు అందించే జలాశయం ఈ ఏడాది రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది.
ఆందోళనలో అన్నదాతలు
హాలహర్వి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కన్నడనాట కస్తూరి తుంగభద్ర జలాశయం కర్నూలు జిల్లా రైతులకు జీవనాడి. 1.5లక్షల ఎకరాలకు సాగునీరు 110 గ్రామాలకు తాగునీరు అందించే జలాశయం ఈ ఏడాది రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడంతో జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు, తాగునీటి అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగించాలని టీబీ బోర్డు అధికారులు, కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 61 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. రోజుకో ఒక టీఎంసీ నీరు ఆవిరై తగ్గిపోవడంతో రైతుల్లో కలవరం నెలకొంది. అధికారులు తాగునీటికే ప్రాధాన్యమని చెప్పినా ముందు నీటిని చూసి ఆశాజీవులైన రైతులు వరి, మిరప, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేశారు. ఈ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలంటే కనీసం డిసెంబరు వరకు నీరు ఉండాలి. ప్రస్తుతం జలాశయంలో ఉండే నీరు 30 రోజుల కన్నా ఎక్కువ రోజులు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు లబోదిబోమంటున్నారు. అయితే ఎగువన వర్షాలు కురవకపోతాయా? అనే ఆశలతో అన్నదాతలు వేయి కళ్లతో ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది.