Share News

కేసీలో గుర్రపు డెక్క

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:23 AM

కేసీ కెనాల్‌.. 163 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నీటి వనరు. తుంగభద్ర - పెన్నా నదులను అనుసంధానం చేస్తూ కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు తాగు, సాగునీరు అందించే కాలువ అది

కేసీలో గుర్రపు డెక్క
కర్నూలు నగరం ధర్మాపేట వద్ద కేసీ కెనాల్‌ను కప్పేసిన గుర్రపుడెక్క. ఈ గుర్రపుడెక్క అడుగుల 2,250 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉంది

తొలగించడానికి ఎన్నో అవస్థలు

నిర్లక్ష్యం చేస్తే దోమల బెడద

జనం రోగాల బారినపడే ప్రమాదం

సుంకేసుల డ్యాంకు తగ్గిన వరద

కర్నూలు నగరవాసులకు తీరనున్న నీటి కష్టాలు

కేసీ కెనాల్‌.. 163 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నీటి వనరు. తుంగభద్ర - పెన్నా నదులను అనుసంధానం చేస్తూ కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు తాగు, సాగునీరు అందించే కాలువ అది. కర్నూలు నగరంలో 8.50 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇంతో ప్రాధాన్యత కలిగిన కాలువ మురికి కూపంలా మారింది. మురుగు నీరు, వ్యర్థాలతో నిండిపోవడంతో గుర్రపుడెక్క కాల్వను కప్పేసింది. ఈ గుర్రపుడెక్క అడుగున 2,445 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందంటే నమ్మగలరా..? ఇది నమ్మలేని నిజం. ఐదారేళ్ల వెనక్కి వెళితే కాలువలో నీటి ప్రవాహం నగర ప్రజలకు ఎంతో కనువిందు చేసేది. గతంలో కేసీ నీటిని తాగునీటిగా వాడేవాళ్లమని పరిసర కాలనీవాసులు గుర్తు చేసుకుంటారు. అలాంటి కాలువ ప్రస్తుతం దుర్గంధం వెదజల్లుతోంది. కాలువలో కాలు పెడితే ఎలాంటి రోగాల బారిన పడాల్సి వస్తుందో అని పరిసర కాలనీవాసులు భయపడుతున్నారు.

కర్నూలు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో కేసీ కాలువ మునగాలపాడు నుంచి గీతాముఖర్జీనగర్‌, మామిదాలపాడు, మాసామసీద్‌, స్టాంటన్‌పురం, కొండారెడ్డి, మమతానగర్‌, భగత్‌ సింగ్‌నగర్‌, శ్రీనగర్‌ కాలనీ, ఽధర్మపేట, బంగారుపేట, కారల్‌మార్క్స్‌ నగర్‌, వినాయకఘాట్‌, లక్ష్మీనగర్‌, జొహరాపురం కాలనీల మీదుగా 8.50 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. మురుగునీరు, వ్యర్థాలు కేసీలో కలవడం వల్ల కాలువ మురికి కూపంగా మారింది. రెండు మూడేళ్ల నుంచి గుర్రపుడెక్క తీవ్రత పెరిగింది. ఈ ఏడాది మరీఎక్కువై కాలువంతా పేరుకుపోయింది. సుంకేసుల జలాశయానికి వరద చేరడంతో శుక్రవారం సాయంత్రం నుంచి కేసీ కాలువకు 2,445 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆ నీటి ప్రవాహాన్ని గుర్రపుడెక్క కప్పేసింది. తక్షణమే పూర్తిస్థాయిలో దీన్ని తలగించకపోతే.. గుర్రపుడెక్క ఆకుల్లో రోగ కారకాలైన దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. అదే జరిగితే నగర ప్రజలు రోగాల బారిన పడాల్సి వస్తుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేలా ఎక్స్‌కవేటర్లతో నగరపాలక సంస్థ సిబ్బంది దిగువకు తోసేస్తున్నారు.

సుంకేసుల నిండింది.. దాహం తీరింది

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల మూడు రోజుల క్రితం జిల్లాలోనూ, తుంగభద్ర, హగరి నదితీర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తుంగభద్రకు వరద మొదలైంది. కర్నూలు నగర ప్రజల దాహం తీర్చే ప్రాణనాడి అయిన సుంకేసుల జలాశయానికి శనివారం 11 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో మొదలైంది. ఆదివారం ఉదయానికి ఏడు వేల క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, 1.194 టీఎంసీలు నిల్వ చేసి నదికి 2,248 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరానికి తాగునీటి కోసం 159 క్యూసెక్కులతో పాటు కేసీ కాలువకు 2,445 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కేసీ కెనాల్‌ నగరంలో జల ప్రవాహంతో కనువిందు చేస్తుందని భావిస్తే.. గుర్రపుడెక్క కాల్వను కప్పేయడంతో పలు కాలనీలో బయటకు నీటి ప్రవాహం కనిపించడమే లేదు. సాయంత్రానికి సుంకేసుల డ్యాంకు వచ్చే వరద నాలుగు వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఆర్డీఎస్‌ ఆనకట్ట దాటి దిగువకు వరద ప్రవాహం లేదు. దీంతో సోమవారం సాయంత్రంలో రెండు వేల క్యూసెక్కులకు పడిపోతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏ క్షణమైనా కేసీకి నీరు ఆపేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే గుర్రపుడెక్కను దిగువకు తోసేయాలని జలవనరుల శాఖ ఇంజనీర్లు సూచిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోయిన సుంకేసుల డ్యాం.. వాయుగుండం ప్రభావంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరి, జలాశయం నిండడంతో నగర ప్రజలకు నీటి గండం తప్పింది.

గుర్రపుడెక్కను తొలగిస్తున్నాం

కేసీ కాలువలోని గుర్రపుడెక్కను నీటి ప్రవాహ వేగానికి దిగువకు తోసేస్తున్నాం. బంగారుపేట, వినాయక ఘాట్‌, జొహరాపురం ప్రాంతాల్లో ఎక్స్‌కవేటర్లు ద్వారా తొలగిస్తున్నాం. ధర్మపేట, స్టాంటన్‌పురం ప్రాంతాల్లో కూడా తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

- చల్లా ఓబులేశ్‌, కమిషనర్‌, నగరపాలక సంస్థ, కర్నూలు

Updated Date - Sep 28 , 2026 | 12:23 AM