Share News

సాగు, తాగు నీరు ఇవ్వాలి

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:07 PM

కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతాంగానికి తాగు, సాగు నీరివ్వాలని నందికొట్కూరు కేసీ కెనాల్‌ రైతు సంఘం, సీపీఐ ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి.

సాగు, తాగు నీరు ఇవ్వాలి
కేసీ కెనాలులో దిగి ఉరితాళ్లతో నిరసనలు తెలుపుతున్న రైతులు

కేసీ ఆయకట్టు ఎండుతోంటే ఇతర జిల్లాలకు నీరెట్లా ఇస్తారు..?

ఉరితాళ్లు బిగించుకొని రైతుల నిరసన

నందికొట్కూరు రూరల్‌, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): కేసీ కెనాల్‌ ఆయకట్టు రైతాంగానికి తాగు, సాగు నీరివ్వాలని నందికొట్కూరు కేసీ కెనాల్‌ రైతు సంఘం, సీపీఐ ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. సోమవారం ఈ సంస్థల ఆధ్వర్యంలో మల్యాల, శాతనకోట, అల్లూరు, చుట్టు పక్కల గ్రామాల రైతులు కేసీ కెనాల్‌లో దిగి ఉరి తాళ్లు బిగించుకొని నిరసన తెలిపారు. అనంతరం హంద్రీ నీవా ఎత్తిపోతల పంప్‌ హౌస్‌ ఎదురుగా ధర్నా నిర్వహించారు. హంద్రీ నీవా ఏఈ రత్నమోహన్‌కు వినతి పత్రం అందజేశారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు రఘురాం మూర్తి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ఆస్తులు పోగొట్టుకొని, మిగిలిన భూమిలోనైనా పంటలు పండించుకొని బతుకుదామంటే ఇక్కడి నీరు ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంటితుడుపు చర్యగా వారం రోజులు ఒక్క పంపు ద్వారా నీరందిస్తే సమస్య తీరుతుందా? అని ప్రశ్నించారు. స్థానిక రైతాంగాన్ని దృష్టిలో వుంచుకొని మల్యాల ఎత్తిపోతల నుంచి రెండు పంపుల ద్వారా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి రెండు పంపు ద్వారా కేసీ కెనాల్‌కు నీరందించి ఈ ప్రాంత వాసులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకుడు శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులువెంకటరమణ, మౌలాలి, రైతులు లోకేశ్‌, ఖాజాహుశేన్‌, సుదర్శనం, శివన్నగౌడు, హుశ్శేన్‌సాహెబ్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 11:07 PM