Share News

సద్దుమణిగిన నీటి వివాదం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:14 PM

మండలంలోని రెండు గ్రామాల మధ్య తెలుగుగంగ నీటి విషయంపై రగడ నెలకొంది. చివరికి పోలీసుల జోక్యంతో ఇరు గ్రామాల రైతులకు సమ న్యాయం జరగడంతో వివాదానికి తెరపడింది.

సద్దుమణిగిన నీటి వివాదం
మహానంది పోలీస్‌స్టేషన్‌లో ఇరు గ్రామాల రైతులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి

తమ్మడపల్లి, నందిపల్లి రైతులతో మాట్లాడిన పోలీసులు

నీటిని సమంగా సరఫరా చేసుకోవడానికి అంగీకారం

మహానంది, సెప్టెంబరు 12(ఆంరఽధజ్యోతి): మండలంలోని రెండు గ్రామాల మధ్య తెలుగుగంగ నీటి విషయంపై రగడ నెలకొంది. చివరికి పోలీసుల జోక్యంతో ఇరు గ్రామాల రైతులకు సమ న్యాయం జరగడంతో వివాదానికి తెరపడింది. మండలంలోని తమ్మడపల్లి ఇంజవాణి చెరువుకు తెలుగుగంగ ప్రధాన కాలువ నుంచి 11వ సబ్‌ చానల్‌ ద్వారా పూర్తి స్ధాయిలో నీరు నింపుకోవాలని ఆ గ్రామ రైతులు పట్టుపట్టారు. అయితే ఇదే సబ్‌ చానల్‌ నుంచి నందిపల్లి గ్రామానికి నీరు తీసుకోవడం కోసం శనివారం తెల్లవారుజామున ఈ గ్రామ రైతులు మహానంది సమీపంలోని తెలుగుగంగ 11వ బ్లాక్‌ సబ్‌ చానల్‌ ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నారు. తమ్మడపల్లి ఇంజవాణి చెరువుకు సాఫీగా నీరు ప్రవహించేందుకు ఆ గ్రామ రైతులు ఏర్పాటు చేసుకున్న అడ్డుకట్టను తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకొన్న తమ్మడపల్లి రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ప్రకటించిన ఆదేశాల ప్రకారం కేవలం చెరువులను నింపుకొనేందుకే అనుమతి ఉందని, ఇందులో భాగంగానే ఇంజవాణి చెరువుకు సబ్‌ చానల్‌ ద్వారా నీటిని మళ్లించుకుంటున్నట్లు తెలిపారు. 11వ బ్లాక్‌ వద్ద తాము ఏర్పాటు చేసుకున్న అడ్డుకట్టను తొలగించేది లేదని తమ్మడపల్లి రైతులు భీస్మించుకొని కూర్చున్నారు. దీంతో పోలీసులు రెండు గ్రామాల రైతులను పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ఇరు గ్రామాల రైతులతో మా ట్లాడారు. తెలుగుగంగ నీటిని ఇరు గ్రామాల రైతులు సమంగా సరఫరా చేసుకోవాలని సర్ది చెప్పారు. దీనికి రెండు గ్రామాల రైతులు అంగీకరించారు. సబ్‌ చానల్‌ వద్ద ఏర్పాటు చేసిన అడ్డుకట్టను తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సబ్‌ చానల్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో రెండు గ్రామాల రైతుల మధ్య నీటి మళ్లింపు సమస్యకు పరిష్కారం అయ్యింది.

Updated Date - Sep 12 , 2026 | 11:14 PM