ఉపాధి నిధులతో జలహారతి
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:02 AM
నీటి వనరులను అభివృద్ధి చేసే జలధార - జలహారతి పనులకు ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
రోజుకు 1.37 లక్షల మంది కూలీలకు పని
త్వరితగతిన పూర్తి చేయాలి
కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): నీటి వనరులను అభివృద్ధి చేసే జలధార - జలహారతి పనులకు ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంపీడీవోలు, ఇరిగేషన్ ఇంజనీర్లు, ఉపాధి హామీ అధి కారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి జలధార- జలహారతి ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జలధార- జలహారతి పథకానికి ఉద్యమ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే ఈ పథకం కింద నిర్దేశించిన పనులను పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా గత పది రోజులుగా గుర్తించిన నీటి సంరక్షణ, చెరువుల మరమ్మతులు తదితర పనులకు ఎస్టిమేషన్లు వేసి పంపించాలని నీటి పారుదల శాఖ ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో గతంలో పది, పదిహేను సంవత్సరాలుగా నీటి సంరక్షణ పనులను గ్రామస్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది వాటికి ఏమైనా మరమ్మతు పనులు చేయాల్సి ఉందా? ఏ మేర ఖర్చు అవుతుంది? తదితర అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. జిల్లాలో 48వేల పాత చె రువులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉందని, వెంటనే నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే మంజూరు చేసిన జలసంరక్షణ పనులు, చెరువుల మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జలధార- జలహారతి పథకం కింద చేపట్టే పనులు ఉపాధి హామీ నిధులతో చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, నీటి యాజమాన్య సంస్థ ప్రతి రోజు 1.37 లక్షల మంది కూలీలను ఈ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ విభాగం పీడీ నరసింహారెడ్డిని ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.