Share News

జల సుంకేసుల

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:15 PM

జల సుంకేసుల

జల సుంకేసుల
సుంకేసుల బ్యారేజ్‌ ఫోర్‌షోర్‌ ఏరియాలోకి చేరిన తుంగభద్ర జలాలు

ఎల్‌నినో వల్ల అడుగంటిన జలాశయం

అల్పపీడనం రూపంలో కరుణించిన వరుణుడు

ఎండిపోయిన పంటలకు ఊపిరి

తుంగభద్ర నది నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరిన వరద

కర్నూలు నగరానికి తప్పిన తాగునీటి ముప్పు

ఊపిరి పోసిన వర్షమే.. పత్తి రైతులను నష్టాల్లో ముంచేసింది

ఎల్‌నినో వల్ల వానలు లేక ఎండిపోయి, బీటలు వారి, రాళ్లు తేలిన సుంకేసుల.. జల సుంకేసులగా మారింది. వాన కోసం కళ్లు కాయలు కాచేలా రైతులు ఎదురుచూశారు. చివరికి అల్పపీడనం రూపం వానలు వచ్చాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని.. సాగు చేసిన పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు, బావులు ఒట్టిపోయాయి. తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పలేదు. ఇలాంటి కష్టకాలంలో అల్పపీడనం ప్రభావం కారణంగా జిల్లాలో కురిసిన వర్షాలు ఎండిని నేలకు ఊపిరి.. పశువులకు నీరు.. గ్రామీణ ప్రజల జీవనానికి కొంత ఊరట లభించింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో నదిలో వరద చేరి.. సుంకేసుల జలాశయం వైపు అడుగులు వేసింది. ఒట్టిపోయిన సుంకేసులకు శుక్రవారం రాత్రి వరద మొదలైంది. కర్నూలు నగర వాసులను తాగునీటి ముప్పు నుంచి కొంత వరకు గట్టెక్కించినట్లే.

కర్నూలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2026-27 ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్‌ మినహా మూడు నెలలు లోటు వర్షపాతం నమోదు అయ్యింది. వ్యవసాయ శాఖ అధికారుల రికార్డులను పరిశీలిస్తే.. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 77.7 మి.మీలు కాగా 98.4 మి.మీలు కురిసింది. అది కూడా నాలుగైదు రోజుల్లో పడిన వర్షమే. జూలైలో సాధారణం 90.5 మి.మీ కాగా 34.6 మి.మీ (61.76 శాతం లోటు), ఆగస్టులో సాధారణ వర్షపాతం 117 మి.మీ కాగా పడిన వర్షం 49.8 మి.మీ (46.29 శాతం లోటు), సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 116.2 మిల్లిమీటర్లకు గాను 47.6 మి.మీ వర్షం (59.03 శాతం లోటు) కుసింది. అంటే.. మూడు నెలలు లోటు వర్షాలు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే క్రమంలో తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా జిల్లాలో మూడు రోజుల్లో జిల్లాలో సగటన 16.5 మిల్లిమీటర్ల వర్షం కురవడంతో గ్రామీణ రైతులకు ఊరిపి పోసింది. అదే క్రమంలో తాగునీటి ఇబ్బందుల నుంచి కొంత ఊరట లభించినట్లైంది.

తుంగభద్రకు వరద.. సుంకేసుల జీవజలం

జిల్లాకు జీవనాడి తుంగభద్ర. చినుకు జాడ లేక.. వరద ప్రవాహం లేక పాతికేళ్ల చరిత్రలో ఎన్నడు లేనంతగా తుంగభద్ర నది ఒట్టిపోయింది. నీళ్లులేక నోళ్లు తెరిచింది. దీంతో సుంకేసుల జలాశయంపై ఆధారపడిన 6.50 లక్షలకు పైగా జనాభా కలిగిన కర్నూలు నగరం, గూడూరు పట్టణంతో పాటు వివిధ గ్రామాల ప్రజలకు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. డ్యాం సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, 0.15 టీఎంసీలకు పడిపోయింది. ఇసుక దిబ్బలు, రాళ్లు తేలాయి. కర్నూలు నగర వాసులకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. గాజులదిన్నె జలాశయం నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి కష్టకాలంలో తుంగభద్ర నది పరివాహక ప్రాంతం, హగరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు తుంగభద్రలో వరద అడుగులు వేసింది. ఆర్డీఎస్‌ ఆనకట్ట దాటి మంత్రాలయం వద్ద శుక్రవారం ఉదయం 17,657 క్యూసెక్కులు వరద నమోదు అయ్యింది. మధ్యాహ్నం 2.30 గంటలకు సుంకేసుల బ్యారేజీ ఫోర్‌షోర్‌ ఏరియా కొండాపురం గ్రామ సమీపంలో వరద చేరడంతో ఆ గ్రామస్తులు నదిలోకి వెళ్లి వరద అడుగులు చూసి సంతోషాలు పంచుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సుంకేసులకు వరద మొదలైంది. రాత్ర 8 గంటల సమయంలో బ్యారేజీకి 12 వేల క్యూసెక్కులు వరద నమోదు అయ్యింది. సుంకేసుల బ్యారేజీ లెవల్‌ 289.40 మీటర్ల వద్ద 0.418 టీఎంసీలకు చేరిందని ఇంజనీర్లు తెలిపారు. నేటి సాయంత్రంలోగా జలాశయం పూర్తిస్థాయిలో నీటి మట్టానికి చేరితే, కేసీ కాలువకు నీటి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చేతికొచ్చిన పంట నీటిపాలు

కష్టకాలంలో వర్షాలు పడి ఊపిరి పోసిందనే ఆనందం రైతుల్లో ఎంతోసేపు నిలవలేదు. అరకొర వర్షాలకు సాగు చేసిన పత్తి పంట చేతికొస్తున్న కీలక సమయంలో వర్షాలకు పత్తికాయలు, పగిలిన పత్తి తడిసిపోయాయి. పొలంలో ధగధగా మెరిసే తెల్లబంగారం వర్షానికి నీటిపాలైంది. ఎకరాకు సగటున 6-8 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. వర్షాభావ పరిస్థితు వల్ల రెండు మూడు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. బోరుబావుల కింద కొంత వరకు ఫర్వాలేదు అనిపిస్తుంది. చెట్టుపై పత్తిని తీసుకునే సమయంలో వానలు రావడంతో చెట్టుపైన నీటిపాలైందని రైతులు అంటున్నారు. ఎకరాకు రెండు క్వింటాళ్లకు పైగా నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధర ప్రకారం పత్తి రైతులు ఎకరానికి రూ.20 వేలకు పైగా నష్టపోవాల్సి వచ్చింది. బోరుబావుల రైతులైతే అంతకుంటే ఎక్కువగానే నష్టపోక తప్పడం లేదు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4,34,996 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 3,48,390 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. అందులో పత్తి ఒక్కటే 2,21,801 హెక్టార్లలో సాగు చేశారని అంచనా. విపత్కర పరిస్థితుల్లో జీవం పోసిన వర్షాల వల్లే పత్తి, ఉల్లి వంటి పంటలకు నష్టం కలిగింది.

పత్తి తీసే సమయంలో ముంచేసింది - దస్తగిరి, పత్తి రైతు, వల్కూరు గ్రామం, కోడుమూరు మండలం:

నాకున్న 1.60 ఎకరాల పొలంలో పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్టుకు ఐదారు కాయలకు మించి రాలేదు. ఎండలకు కాయ పగిలిన తెల్లబంగారంలా మెరిసిపోతున్న పత్తిని తీసే సమయంలో వచ్చిన వర్షాలకు తడిసి నేలపాలైంది. ఎకరాకు రెండు క్వింటాళ్లకు నష్టపోయాను. కరువు నిలువునా ముంచేస్తే, వర్షాలు అరకొర పంటను కూడా నీటిపాలు చేసి కోలుకోని విధంగా దెబ్బతీసింది.

Updated Date - Sep 25 , 2026 | 11:15 PM