Share News

ఇన్‌చార్జిలతో జలమండలి..!

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:55 PM

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులు సాగే జలమండలి ఇన్‌చార్జిలతో నడుస్తోంది. పరిపాలన ఇబ్బందులు రాకుండా రెండు మూడు పోస్టుల్లో ఒకే అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇన్‌చార్జిలతో జలమండలి..!

శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ సహా ప్రధాన పోస్టుల్లో ఇన్‌చార్జిలే

ఉమ్మడి జిల్లాలో 200కు పైగా ఏఈఈ పోస్టులు ఖాళీ

శ్రీశైలం, వెలుగోడు ప్రాజెక్టుల్లో పని చేయడానికి ఇష్టపడని ఇంజనీర్లు పదోన్నతులు,

నియామకాలు లేకపోవడమే కారణం

‘జలధార-జలహారతి’ పనులపై ప్రభావం

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులు సాగే జలమండలి ఇన్‌చార్జిలతో నడుస్తోంది. పరిపాలన ఇబ్బందులు రాకుండా రెండు మూడు పోస్టుల్లో ఒకే అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా కరువు నేలకు సాగు జలాలు అందించే ప్రాజెక్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొత్త ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. జల వనరుల శాఖలో ఇన్‌చార్జ్జిల పాలనపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో శ్రీశైలం ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు, శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌బీసీ), కర్నూలు-కడప (కేసీ) కెనాల్‌, తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ), గాజులదిన్నె ప్రాజెక్టు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు, ఆలూరు బ్రాంచి కెనాల్‌.. వంటి ప్రధాన సాగునీటి వనరులు ఉన్నాయి. వీటితో పాటుగా 550కిపైగా చెరువులు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం మైనర్‌ ఇరిగేషన్‌ (ఎంఐ) కర్నూలు, నంద్యాల డివిజన్లు ఉన్నాయి. వివిధ సాగునీటి వనరులు ద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు 9.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రతి ఎకరాకు సాగునీరు అందాలంటే క్షేత్రస్థాయిలో నీటి నిర్వహణ కోసం లస్కరు నుంచి ఎస్‌ఈ స్థాయి ఇంజనీరు వరకు ఎంతో బాధ్యతగా పని చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇంజనీర్ల కొరత కారణంగా ఒకరికి రెండు మూడు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికి తోడు రోజులో రెండు మూడు సమీక్షలతో, సమావేశాలతో కాలం గడిచిపోతోంది. జలధార-జలహారతి వంటి పనులు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాజెక్టులు, కర్నూలు, నంద్యాల ఎంఐ పరిధిలో దాదాపు 399 మందికి పైగా ఏఈఈ పోస్టులు ఉంటే, అందులో రెండు వందల వరకు ఖాళీలు ఉన్నాయి. అంతేకాదు ఎస్‌ఈ స్థాయి అధికారి పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలతో సరిపుచ్చుతున్నారు. కీలకమైన సాగునీటి కాలువలు పర్యవేక్షించే డివిజన్లలో ఏఈఈ కొరత వేధిస్తోంది. ఇలాగైతే ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీటి నిర్వహణ ఎలా సాధ్యం..? అత్యవసర మరమ్మతులు చేయాల్సి వస్తే బాధ్యులు ఎవరు..? సమాధానం లేని ప్రశ్నలు ఇవి.

పని చేయని డివిజన్లలో ఫుల్‌.. కీలక డివిజన్లలో ఖాళీ

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కీలకమైన సాగు, విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు శ్రీశైలం. ఈ ప్రాజెక్టు పరిధిలోని శ్రీశైలం డ్యాం నిర్వహణ సర్కిల్‌, సీ అండ్‌ బీ డివిజన్‌, డ్యాం నిర్వహణ డివిజన్లు పరిధిలో ఎస్‌ఈ సహా ఈఈ పోస్టులు మూడు, డీఈఈ పోస్టులు పది, ఏఈఈ పోస్టులు 40 ఉన్నాయి. ఎస్‌ఈ, ఈఈ పోస్టుల్లో ఇన్‌చార్జిలతో సరిపుచ్చారు. ఇద్దరు డీఈఈలు, 13 మంది ఏఈఈలను రెగ్యులర్‌గా నియమించారు. 27 ఏఈఈ పోస్టులు, 8 డీఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం సగం మంది ఇంజనీరింగ్‌ అధికారులు లేకుండా రాయలసీమ జిల్లాకు జీవనాడి అయిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఎలా సాధ్యం..? శ్రీశైలం ఒక్కటే కాదు.. తెలుగుగంగ ప్రాజెక్టు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఉమ్మడి జిల్లాలో 399 ఏఈఈ పోస్టులు ఉంటే అందులో 200 వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. పనులు తక్కువగా ఉన్న క్వాలిటీ కంట్రోల్‌, గేజింగ్‌ డివిజన్లు సహా జిల్లా కేంద్రాల్లో ఉండే వివిజన్లలో మాత్రం పూర్తిస్థాయిలో డీఈఈలు, ఏఈఈలను నియమించడం కొసమెరుపు.

‘జలధార-జలహారతి’ పనులపై ప్రభావం

రాష్ట్ర ప్రభుత్వం జలధార-జలహారతి పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కర్నూలు మైనర్‌ ఇరిగేషన్‌ (ఎంఐ) డివిజన్‌ పరిధిలో 246 చెరువులు ఉన్నాయి. జలధార-జలహారతి కింద కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి 3,707 పనులు మంజూరు చేసింది. అందులో 415 పనులు మొదలు కాలేదు. 2,475 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 36 చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాల్సి ఉంటే, 28 చెరువుల్లోనే ప్రారంభించారు. ఆయా పనులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత డీఈఈ, ఏఈఈలపై ఎంతో ఉంది. అయితే.. ఈ డివిజన్‌లో ఐదు డీఈఈ పోస్టులకు గాను మూడు ఖాళీలు ఉన్నాయి. 18 ఏఈఈ పోస్టులకు 9 ఖాళీలు ఉన్నాయి. టీబీపీ ఎల్లెల్సీ, జీఆర్‌పీ డివిజన్లలో పని చేసి ఏఈఈలకు తాత్కాలికంగా ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. రెగ్యులర్‌ ఏఈఈలు లేకపోతే పనులు పర్యవేక్షణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నంద్యాల ఎంఐ డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు వరద నిర్వహణ ఎంతో కీలకం. 2009 వరదలకు డ్యాం భారీగా దెబ్బతింది. కూటమి ప్రభుత్వం వచ్చాక డ్యాం మరమ్మతు పనులు చేపట్టింది. అదే క్రమంలో డ్యాం భద్రతలో అత్యంత కీలకమైన డ్యాం ప్రొటెక్షన్‌ స్టీడ్‌ డ్రమ్స్‌ శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్లంజ్‌ పూల్‌ మరమ్మతులు సరేసరి. కీలకమైన ఈ ప్రాజెక్టును స్థానికంగా ఉంటూ పర్యవేక్షించేలా రెగ్యులర్‌ ఎస్‌ఈ, ఈఈలను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. కర్నూలు ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ బి. బాలచంద్రారెడ్డికి ఇన్‌చార్జి (ఎఫ్‌ఏసీ) బాధ్యతలు ఇచ్చారు. తెలుగుగంగ ప్రాజె క్టు, హంద్రీ నీవా ప్రాజెక్టు, ఎస్‌ఆర్‌బీసీ-1,2లకు సైతం ఇన్‌చార్జి ఎస్‌ఈలతో సరిపుచ్చుతున్నారు.

ఏఈఈ ఖాళీలను భర్తీ చేయాలి:

పదోన్నతులు ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఇంజనీర్లు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించి కీలకమైన పోస్టుల్లో రెగ్యులర్‌ అధికారులను నియమించాలని, నూతన ఏఈఈ నియామకం చేపట్టి ఖాళీలు భర్తి చేయాలని నిరుద్యోగ ఇంజనీర్లు డిమాండ్‌ చేస్తున్నారు. తద్వారా ప్రాజెక్టు నిర్వహణ, భద్రతతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తామని అంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం..!

కీలక ఇంజనీరింగ్‌ అధికారులు.. అదనపు బాధ్యతలు

అధికారి హోదా రెగ్యులర్‌ పోస్టు ఇన్‌చార్జి (ఎఫ్‌ఏసీ)

బాధ్యతలు

బి. బాలచంద్రారెడ్డి ఎస్‌ఈ కర్నూలు ఇరిగేషన్‌ శ్రీశైలం డ్యాం ఎస్‌ఈ,

సర్కిల్‌ ఎస్‌ఈ కడప ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ

శివశంకర్‌రెడ్డి ఈఈ వెలుగోడు తెలుగుగంగ

ప్రాజెక్ట్‌ ఈఈ ప్రాజెక్టు, నంద్యాల సర్కిల్‌ ఎస్‌ఈ

శుభకుమార్‌ ఈఈ గోరకల్లు ఎస్సాఆర్బీసీ-1,

రిజర్వాయర్‌ ఈఈ నంద్యాల సర్కిల్‌ ఎస్‌ఈ

భయ్యా సురేశ్‌ ఈఈ ఎస్సార్బీసీ ఎస్సార్బీసీ-2,

బనగానపల్లి ఈఈ నంద్యాల సర్కిల్‌ ఎస్‌ఈ

రాజన్‌బాబు ఈఈ హంద్రీనీవా-1 హంద్రీనీవా ప్రాజెక్టు-1

డివిజన్‌ ఈఈ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ

Updated Date - Jun 09 , 2026 | 11:55 PM