తుంగభద్రలో నీటి లభ్యత 98 టీఎంసీలు!
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:58 PM
తుంగభద్ర ఆయకట్టు రైతులను ఎల్‌నినో వెంటాడుతోంది. ఇప్పటి వరకు డ్యాంలో 82.599 టీఎంసీల మేర వరద చేరింది.
2026-27 నీటి చేరికపై అంచనా
ఏపీ కోటా 30.74 టీఎంసీలు కేటాయింపు
టీబీపీ ఎల్లెల్సీకి 11.094, కేసీ కాలువకు 4.623 టీఎంసీలు
అనంతపురం జిల్లాకు హెచ్చెల్సీ వాటా 15.024 టీఎంసీలు
టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ సమావేశం
కర్నూలు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ఆయకట్టు రైతులను ఎల్‌నినో వెంటాడుతోంది. ఇప్పటి వరకు డ్యాంలో 82.599 టీఎంసీల మేర వరద చేరింది. 2026-27 నీటి సంవత్సరంలో తుంగభద్ర డ్యాంలో వరద చేరికపై టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ అధ్యక్షతన వర్చువల్‌గా మంగళవారం బీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ సమావేశం జరిగింది. గత పాతికేళ్లుగా డ్యాంలో చేరిన వరద నీటి లెక్కలను పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ శాఖ హెచ్చకరిల నేపథ్యంలో 98 టీఎంసీలకు మించి చేరే అవకాశాలు లేవని తాత్కాలికంగా అంచనా వేశారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-1 (కేడబ్ల్యుడీటీ) కేటాయింపుల దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోటాగా రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీరు అందించే టీబీపీ ఎల్లెల్సీ, హెచ్చెల్సీ, కర్నూలు-కడప (కేసీ) కాలువలకు 30.74 టీఎంసీలు కేటాయించారు. ఉన్న నీటిని ఏడాదంతా తాగునీటి కోసం భద్రపరచాల్సి ఉంది. దీంతో సాగునీరు ఇచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే ఇంజనీర్లు తెలిపారు.
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ మూడు రాష్ట్రాల జలాశయం తుంగభద్ర. ఈ డ్యాం 132 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేశారు. అయితే ఏటేటా జలాశయంలో పూడిక చేరుతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంంది. దీంతో 1972, 1978, 1981, 1993, 2004, 2008, 2016లో సర్వే చేసి జలాశయం నీటినిల్వ సామర్థ్యంపై అంచనా వేశారు. చివరిగా 2022లో 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి తగ్గిపోయిందని తేల్చారు. జూన్ 1 నుంచి మే 31 వరకు ఒక నీటి సంవత్సరంలో డ్యాంలో 212 టీఎంసీలు వినియోగించుకునేలా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-1 (కేడబ్ల్యుడీటీ) అవార్డు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాలువలకు నిఖర జలాలు కేటాయింపులు చేశారు. అయితే.. ప్రతి ఏటా జూలై లేదా ఆగస్టు నెలలో టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ సమావేశమై ఆ ఏడాది నీటి సంవత్సరంలో వరద చేరికను అంచనా కేడబ్ల్యుడీటీ దామాషా ప్రకారం ఆయా రాష్ట్రాలకు పంపకాలు చేస్తారు. నవంబరు లేదా డిసెంబరులో మరో దఫా సమావేశమై తుది అంచనా చేస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల 98 టీఎంసీలకు మించి వరద చేరే అవకాశం లేదని నిగ్గు తేల్చారు. డ్యాంకు అనుకోని వరదలు వచ్చి అంచనాలకు మించి వరద చేరితే తుది సమావేశంలో కేటాయింపులు సమీక్షించి దామాషా ప్రకారం నీటి పంపకాలు చేస్తారు.
ఏపీ వాటా 30.74 టీఎంసీలే
తుంగభద్ర డ్యాంలో 212 టీఎంసీలు చేరితే.. బచావత్ అవార్డు ప్రకారం కర్ణాటకకు 138.990 టీఎంసీలు (65.56 శాతం), ఆంధ్రప్రదేశ్ వాటా 66.50 టీఎంసీలు (31.37 శాతం), తెలంగాణ వాటా 6.51 టీఎంసీలు (3.07 శాతం)లు కేటాయించాల్సి ఉంది. 98 టీఎంసీలకు మించి వరద చేరకపోవచ్చని బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది. అందులో కేడబ్ల్యూసీ-1 దామాషా ప్రకారం కర్ణాటక వాటాగా 64.25 టీఎంసీలు, ఏపీ వాటా 30.74 టీఎంసీలు, తెలంగాణ వాటా 3.009 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి కేటాయించిన నీటి వాటాలో కర్నూలు జిల్లాలో టీబీపీ ఎల్లెల్సీ కోటా 11.094 టీఎంసీలు, కేసీ వాటా 4.623 టీఎంసీలు, అనంతపురం జిల్లాలోని టీబీపీ హెచ్చెల్సీ కోటాగా 15.024 టీఎంసీలు కేటాయించారు.
టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టుకు ఈ ఏడాది సాగునీరు లేనట్లేనని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. డ్యాంలో ఆశాజనకంగా వరద చేరకపోవడం, చేరిన అరకొర నీటిని ఏడాది పొడవున తాగునీటి కోసం భద్రపరచాల్సి రావడంతో రైతులు త్యాగం చేయక తప్పని పరిస్థితి. ఎల్లెల్సీ వాటాగా 11.094 టీఎంసీలు కేటాయించారు. అందులో తాగు నీటి కోసం ఇప్పటికే 1.432 టీఎంసీలు వినియోగించుకున్నాం. డ్యాంలో మిగిలిన వాటా 9.68 టీఎంసీలే. జిల్లాలో 2027 జూన్ వరకు అంటే 11 నెలలు ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాలు సహా సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) పరిధిలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో దాదాపు 245 గ్రామాలకు తాగునీటి కోసం ఎనిమిది టీఎంసీలు అవసరం ఉంది. దీంతో మిగిలే నీటితో ఒక్క పంటకు కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రాల వారిగా నీటి కేటాయింపులు (టీఎంసీల్లో):
రాష్ట్రం వాటా కేటాయింపు
కర్ణాటక 138.990 64.25
ఆంధ్రప్రదేశ్ 66.500 30.74
తెలంగాణ 6.510 3.01
మొత్తం 212.00 98.00
ఏపీ వాటాలో ఆయా కాలువకు కేటాయింపులు (టీఎంసీల్లో):
కాలువ వాటా కేటాయింపు వాడుకున్నది మిగులు
ఎల్లెల్సీ 24.00 11.094 1.432 9.66
కేసీ కెనాల్ 10.00 4.623 -- 4.623
హెచ్చెల్సీ 32.50 15.024 -- 15.024