వార్డుల పునర్విభజన ముసాయిదా
ABN , Publish Date - May 18 , 2026 | 11:33 PM
కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించే ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రచురిం చారు.
ప్రచురించిన కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారులు
కర్నూలులో 42, పాణ్యంలో 22, కోడుమూరులో 4 వార్డులు
కర్నూలు న్యూసిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజించే ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రచురిం చారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవో నెంబరు 65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో 4,77,718 లక్షల జనాభా ఉందని, భౌగోళిక పరిస్థితులు, పరిపాలన సౌల భ్యం, స్థానిక అవసరాలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ముసాయిదాను రూపొందించినట్లు వివరించారు. ఇందులో కర్నూలు నియోజకవర్గంలో 42 వార్డులు, పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ పరిధిలో 22 వార్డులు, కోడుమూరు నియోజకవర్గంలో 4 వార్డులు ఉన్నట్లు తెలిపారు. ప్రతిపాది ముసాయిదాను నగర పాలక సంస్థ కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఈ ముసాయిదాపై ప్రజలు, ప్రతిపతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయలు, సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఈనెల 24 సాయంత్రం 5 గంటలలోపు నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగానికి రాతపూర్వకంగా సమర్పించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో తుది వార్డుల పునర్విభజన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, ఇన్‌చార్జి సిటీ ప్లానర్ వైవి. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.