Share News

తహసీల్దార్‌ కావలెను

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:02 AM

మండలానికి రెగ్యులర్‌ తహసీల్దారు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండునెలల క్రితం ఇక్కడి తహసీల్దార్‌ నారాయణరెడ్డి పదోన్నతిపై కర్నూలు జిల్లా హలహర్వికి బదిలీ అయ్యారు

తహసీల్దార్‌ కావలెను

ఏసీబీ దాడుల్లో పట్టుబడిన గత తహసీల్దార్‌ రాజీవ్‌ రెడ్డి

బనగానపల్లెకు వచ్చేందుకు ఇష్టపడని అధికారులు

పనులు కాక రైతులు, విద్యార్థుల ఇబ్బందులు

బనగానపల్లె, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మండలానికి రెగ్యులర్‌ తహసీల్దారు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండునెలల క్రితం ఇక్కడి తహసీల్దార్‌ నారాయణరెడ్డి పదోన్నతిపై కర్నూలు జిల్లా హలహర్వికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆళ్లగడ్డ నుంచి పదోన్నతిపై వచ్చిన రాజీవ్‌రెడ్డి మే 4న ఏసీబీకి పట్టుబడటంతో అప్పటి నుంచి రెగ్యులర్‌ తహసీలాద్ర్‌ లేరు. అవుకు తహసీల్దారు నాగేశ్వరరెడ్డిని ఇన్‌చార్జిగా అధికారులు బాధ్యతలు అప్పగిచారు, ఆయన కూడా కడప జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో అధికారులు నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న మంజూర్‌హుసేన్‌ను పదోన్నతిపై బనగనగానపల్లె తహసీల్దార్‌గా నియమించారు. అయితే ఆయన విధుల్లో చేరకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల అవస్థలు

విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం. మీసేవా కేంద్రాలు, సచివాలయాల్లో దరఖాస్తు చేసినా మంజూరు కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతుల భూ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, రెగ్యులర్‌ తహసీల్దార్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:03 AM