Share News

ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:18 AM

12 జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తామని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి అన్నారు.

ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న కుంచం

ఆర్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి

కర్నూలు న్యూసిటీ, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): 12 జిల్లాలతో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తామని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. చేశారు. నగరంలోని సమితి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టు సాధన, పెండింగ్‌ ప్రాజెక్టు పూర్తికి పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 1937 నవంబరు 16న మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత నాయకులు మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన గుర్తు చేశారు. అయితే 89 ఏళ్లు అయినా ఒప్పందంలోని హమీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం రాయలసీమకు జరిగిన అన్యాయానికి నిలువెత్తు నిదర్శమన్నారు. సీమలో పెండింగ్‌ ప్రాజెక్టులను సాధించుకోవడానికి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ హక్కులు, నీటి వాటాలు సాగునీటి ప్రాజెక్టులు, ప్రాంతీయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ నాయకుడు పి.సాధర్‌వల్లి, సుభాన్‌, ముస్కిన్‌, రాష్ట్ర ఆర్యవైశ్యనాయకుడు మిట్టా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులను పూర్తి చేయాలి

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే గుండ్రేవుల, వేదవతి, సిద్ధేశ్వరం అలుగులను తక్షణమే పూర్తి చేయాలని ప్రజా సంఘాల, రాయలసీమ విద్యావంతుల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. నగరంలోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో సోమవారం రాయలసీమ అభివృద్ధి, సంక్షేమంపై సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలోని అన్ని హమీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, శ్రీబాగ్‌ ఒడంబడికకు కట్టుబడి ఉండాలడిమాండ్‌ చేశారు. నగర మంచినీటి కొరత పరిష్కారానికి, గతంలో టీజీ వెంకటేశ్‌ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన తుంగభద్రపై బ్యారేజీని వెంటనే చేపట్టాలని, అదనపు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ అవశ్యకతను గుర్తించాలని వారు కోరారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, కూలీలను ఆదుకొని, రుణ సహయం చేయాలని, విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కడప ఉక్కు ప్యాక్టరీని సెయిల్‌ ఆధ్వర్యంలో నిర్మించాలని, పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. ఓర్వకల్లు మండలంలో ప్రజలకు నష్టం చేసే డేటా సెంటర్‌ను నిలిపివేయాలని వారు డిమాండు చేశారు. సదస్సు అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, విద్యావేత్త కేవీ సుబ్బారెడ్డి, ఆర్వీపీఎస్‌ రవి, పీవోపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, అడ్వకేట్‌ జనార్దన్‌, విశ్రాంత డీఎస్పీ పాపారావు, విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి రత్నం యేసేపు, ఎస్‌డీపీఐ ఆరిఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు మారినా

సీమ దుస్థితి మారడం లేదు

మహానంది, నవంబరు 16(ఆంరఽధజ్యోతి): ప్రభుత్వాలు మారినా రాయలసీమ దుస్ధితి మారలేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైఎన్‌ రెడ్డి అన్నారు. శ్రీ బాగ్‌ ఒప్పదం దినోత్సవం పురస్కరించుకొని సోమవారం నంద్యాల జిల్లా మహానంది సమీపంలోని రెడ్డి భవనంలో సమితి ఉపాధ్యక్షుడు యర్రం శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ బ్యాంక్‌ విశ్రాంత అసిస్టెంట్‌ మేనేజర్‌ శివనాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎన్‌రెడ్డి మాట్లాడుతూ 89 ఏళ్లు అయినా శ్రీబాగ్‌ ఒప్పందం అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం కూడా రాయలసీమకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు కాలేదన్నారు. ఏరువ వెంకటరెడ్డి, రాష్ట్ర ఆదర్శ రైతు వెంకట రమణ, శాస్త్రవేత్తలు నారపరెడ్డి, శివరామిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందం అమలు చేయాలి

కర్నూలు అర్బన్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): శ్రీబాగ్‌ ఒప్పందం అమలు చేయాలని రాయలసీమ ఉద్యమ నాయకుడు సీమ కృష్ణ రాథోడ్‌ అన్నారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీలో 1937 నవంబరు 16న శ్రీబాగ్‌ ఒప్పందం జరిగిన రోజును స్మరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆంధ్ర, రాయలసీమ పెద్దల మధ్య శ్రీబాగ్‌ ఒప్పందం జరిగిందన్నారు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, అయితే మరల 1956 నవంబరు 1న విశాలాంధ్ర ఏర్పడడంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. శ్రీబాగ్‌ ఒప్పదం ప్రకారం రాయలసీమకు నీళ్లు, నిధు లు నియామకాల్లో వాటా ఇవ్వాలని, రాయసీమకు రాజధాని లేదా హైకోర్టు ఇవ్వాలని, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో ఉంద న్నారు. గణేష్‌, మహేష్‌, ప్రేమ్‌, సన్ని, మహి పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 12:18 AM