Share News

హైకోర్టు శాశ్వత బెంచ్‌ కావాలి

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:18 AM

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కర్నూలులో పూర్తిస్థాయి హైకోర్టు బెంచ్‌ బదులు కేవలం క్యాంప్‌ బెంచ్‌ లేదా సర్క్యూట్‌ బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని సమాచారం రావడంతో పలువురు న్యాయవాదులు బార్‌ అసోసియేషన్‌ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు

హైకోర్టు శాశ్వత బెంచ్‌ కావాలి
కర్నూలులో నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు

కర్నూలు లీగల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కర్నూలులో పూర్తిస్థాయి హైకోర్టు బెంచ్‌ బదులు కేవలం క్యాంప్‌ బెంచ్‌ లేదా సర్క్యూట్‌ బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని సమాచారం రావడంతో పలువురు న్యాయవాదులు బార్‌ అసోసియేషన్‌ ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సీనియర్‌ న్యాయవాది, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు వై.జయరాజు మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదోనిలో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్‌ 90 రోజుల్లో ఏర్పాటు అవుతుందని ప్రకటించారన్నారు. 15 రోజులు గడవకముందే తిరిగి కర్నూలులో సర్క్యూట్‌ బెంచ్‌ మాత్రమేనని వార్తలు వస్తున్నాయన్నారు. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం సీమ వాసుల హక్కులను కాపాడాలని కర్నూలులోనే పూర్తి స్థాయి హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసే విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిందని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.చంద్రుడు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారికంగా స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కపిలేశ్వరయ్య, న్యాయవాదులు ఓంకార్‌, ఎంఆర్‌ కృష్ణ, బార్‌ అసోసియేషన్‌ ప్రదాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, మాసపోగు సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 12:18 AM