Share News

సాగునీటి కోసం ఎదురుచూపులు..

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:50 AM

మండలంలో సాగుచేసిన పంటలకు సాగునీరందక అవి ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో 1200 ఎకరాల్లో జొన్న, 4,500ఎకరాల్లో మిరప, 1,500ఎకరాల్లో మినుము, 3,500 ఎకరాల్లో మొక్కజొన్న, 2వేల ఎకరాల్లో కంది సాగు చేశారు.

సాగునీటి కోసం ఎదురుచూపులు..
సంజామల మండలం కొత్తపేట సమీపంలో వాడిపోతున్న జొన్న పంట

ఆరుతడి పంటలకైనా నీరు ఇవ్వాలని రైతుల వినతి..

సంజామల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలో సాగుచేసిన పంటలకు సాగునీరందక అవి ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో 1200 ఎకరాల్లో జొన్న, 4,500ఎకరాల్లో మిరప, 1,500ఎకరాల్లో మినుము, 3,500 ఎకరాల్లో మొక్కజొన్న, 2వేల ఎకరాల్లో కంది సాగు చేశారు.

అక్టోబరులో కురిసిన వర్షాలు..

గత అక్టోబరు నెలలో అడపా దడపా వర్షాలు కురవడంతో మొక్కలు ఊపిరిపోసుకున్నాయి. అనంతరం వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎస్సార్బీసీ కాలువలో తగినంత నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయేలా ఉన్నాయని వాపోతున్నారు.

కాలువ నీరు తాగునీటికే..

ఇటీవల ఎస్సార్బీసీ కాలువకు నీరు విడుదల చేయడంతో రైతులు సంతోషించారు. అయితే అది కేవలం తాగునీటి అవసరాలకే ఉపయోగించాలని అధికారులు సూచించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా పైతట్టు ప్రాంతాల్లోని రైతులు ఈ నీటినే మళ్లించుకుంటుండటంతో దిగువకు నీరు రావడం లేదు. ఓ పక్క తాగునీటి అవసరాలకే అని అధికారులు చెబుతుండగా, మరోపక్క కొందరు పొలాలకు మళ్లించుకుంటున్నా చర్యలు లేవని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని మండల రైతులు కోరుతున్నారు.

నాలుగు ఎకరాల్లో జొన్న సాగుచేశాను

నాకున్న నాలుగు ఎకరాల్లో జొన్నసాగు చేశాను. జూలై, ఆగస్టు మాసాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తీరా పంట ఎదుగుదల సమయంలో వర్షాలు కురవలేదు. దీంతో చేతికందే పంట దక్కకుండా పోతుందని ఆందోళన చెందుతున్నా. - బాలయ్య, రైతు, ఎగ్గోని.

Updated Date - Nov 30 , 2026 | 12:50 AM