నీటి కోసం నిరీక్షణ..!
ABN , Publish Date - Aug 20 , 2026 | 11:59 PM
తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ఆయకట్టు సాగుపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగు, తాగునీరు విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
తుంగభద్ర డ్యాంలో 105 టీఎంసీలు చేరుతాయని అంచనా
టీబీపీ ఎల్లెల్సీ వాటా 11.88 టీఎంసీలు
సాగునీటికి 6.50 టీఎంసీలు ఇచ్చే అవకాశం..?
ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం
వరినాట్లపై ఆయకట్టు రైతుల్లో సందిగ్ధం
కర్నూలు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) ఆయకట్టు సాగుపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగు, తాగునీరు విడుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్టుల సీఈ కబీర్‌బాషా, ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ శైలేశ్వర్ కూడా హాజరయ్యారు. సాగునీటి కోసం నవంబరు ఆఖరు వరకు సాగు, తాగునీటి కోసం 6.50 టీఎంసీలు వినియోగించుకోవడానికి అవకాశం ఉందని గుర్తించారు. నీటి విడుదలపై గురువారం నిర్ణయం వెలువడుతుందని రైతులు ఆశించారు. అయితే.. ప్రభుత్వం నుంచి గాని, జలనవరుల శాఖ మంత్రి నిమ్మల నుంచి గాని ఎలాంటి ప్రకటన రాలేదు. సాగునీరు ఇస్తారా..? ఇవ్వలేమని తేల్చేస్తారా..? రైతుల మదిలో వేధిస్తున్న ప్రశ్నలు ఇవి.
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఉమ్మడి జలాశయం తుంగభద్ర. గురువారం నీటి లెక్కలు పరిశీలిస్తే 94.514 టీఎంసీలు వరద చేరింది. 12,025 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ కాలువలకు ఆ రాష్ట్ర నిర్ణయం మేరకు సాగునీటి కోసం 7,828 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రం రైతులకు సాగునీరు ఇవ్వడంతో దిగువన కూడా సాగునీరు ఇవ్వాలని జిల్లాలోనే ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలో 105 టీఎంసీలు వరద చేరుతుందని అంచనా వేసి.. టీబీపీ ఎల్లెల్సీ వాటాగా 11.8965 టీఎంసీలు, కేసీ కాలువ వాటా 4.623 టీఎంసీలు వస్తుందని అంచనా వేశారు. ఎల్లెల్సీ వాటాలో ఇప్పటికే వాడుకున్న 1.43 టీఎంసీలు పోను 10.5665 టీఎంసీలు మిగులు ఉంటుందని ఇంజనీర్ల అంచనా. ఈ నీటిలో నవంబరు ఆఖరు వరకు 90 రోజులు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి కోసం 6.50 టీఎంసీలు వినియోగించుకున్నా.. డిసెంబరు నుంచి వచ్చే ఏడాది జూన్ ఆఖరు వరకు తాగునీటికి నాలుగు టీఎంసీలు ఉంటుంది. సీఎం చంద్రబాబుతో చర్చించి సాగునీటిపై నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి నిమ్మల వెల్లడించినట్లు తెలుస్తోంది. సాగుపై తేల్చకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. కాల్వకు నీళ్లొస్తాయనే ఆశతో వెలకు వేలు ఖర్చు చేసి బోరుబావుల కింద వరినారు పెంచుతున్నారు. సకాలంలో నాట్లు వేయపోతే నారు ముదిరిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. తక్షణం నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఐఏబీ ఎప్పుడు..?
కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి సాగునీటి విడుదలపై స్థానికంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఆఫీసు నుంచి సూచినట్లు తెలుస్తోంది. దీంతో శుక్రవారం ఐఏబీ నిర్వహించాలని అనుకున్నారు. అయితే.. శ్రావణమాస శుక్రవారం సెలవు కావడం, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉండడంతో ఐఏబీ ఎప్పుడు నిర్ణయించేదీ తేది ఖరారు కాలేదు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో శనివారం సాయంత్రం ఐఏబీ సమావేశం నిర్ణయించి టీబీపీ ఎల్లెల్సీకి సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాగు నీటిని విడుదల చేయాల్సి వస్తే నీటి నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి..! అనే అంశంపై ఎస్‌ఈ శైలేశ్వర్ టీబీపీ ఎల్లెల్సీ డీఈఈ, ఏఈఈలతో సమీక్షా నిర్వహించారు.
ఆయకట్టుకు సాగునీరు ఇవ్వండి - సీపీఎం డిమాండ్
టీబీపీ ఎల్లెల్సీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రామకృష్ణ, కేవీ నారాయణ, అంజిబాబులు కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, జలనరుల శాఖ ఎస్‌ఈ శైలేశ్వర్‌లకు వినతి పత్రం అందజేశారు. తుంగభద్ర డ్యాంలో 105 టీఎంసీలు చేరే అవకాశం ఉందని అంచనా వేసినప్పుడు ఒక పంటకు పుష్కలంగా సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని, తక్షణమే నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. అదే క్రమంలో హంద్రీనీవా కాలువ నుంచి లద్దగిరి, కృష్ణగిరి స్లూయిస్ నుంచి 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేసి హంద్రీ నది పరివాహక గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. కర్నూలు ప్రగతి సమితి (కేపీఎస్) వ్యవస్థాప అధ్యక్షుడు హరీశ్ ఇదే విషయంపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
తాగునీటికి తల్లడిల్లుతున్న హంద్రీ గ్రామాల జనం
హంద్రీ నీవా కాలువ నుంచి లద్దరిగి, కృష్ణగిరి తూమల ద్వారా 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేసి హంద్రీ నది తీరంలోని గ్రామాలకు తాగునీరు ఇచ్చి ఆదుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అసెంబ్లీలో కోరారు. శ్రీశైలం ఎగువన మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీ నీవా కాలువకు 3,050 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. వానలు లేక హంద్రీ ఎండిపోవడంతో నియోజకర్గంలో దాదాపు 18 గ్రామాలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నాయన్నారు. హంద్రీనీవా నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.