Share News

యూరియా కోసం పడిగాపులు

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:30 AM

స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వెనక వైపు ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం సోమవారం ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాశారు.

యూరియా కోసం పడిగాపులు
రైతుసేవా సిబ్బందితో వాగ్వాదం చేస్తున్న రైతులు

రైతులను దోచుకుంటున్న ఎరువుల డీలర్లు

హొళగుంద, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వెనక వైపు ఉన్న రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం సోమవారం ఉదయం నుంచి రైతులు పడిగాపులు కాశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్‌కార్డులతో కార్యాలయం వద్ద కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. గత శుక్రవారం రైతు సేవా కేంద్రాలకు 840 బస్తాల యూరియా రాగా సోమవారానికి అయిపోయినట్లు తెలిపారు. అధికారులు ఒక్క పాసు పుస్తకానికి ఒక బస్తా యూరియా పంపిణీ చేయగా కొందరికి మాత్రమే అందాయి. మిగతా వారికి స్టాక్‌ లేకపోవడంతో వెనుదిరిగారు.

వేల రూపాయలు బిల్లులు వేస్తూ...

యూరియా కోసం రైతులు ఎరువు డీలర్‌ షాపులకు వెళితే అక్కడి షాపు యజమానులు యూరియాతో పాటు గుళికలు, బయో మందులు అంటగడుతున్నారని రైతులు వాపోయారు. రూ.268 యూరియాకు వేల రూపాయలు బిల్లులు వేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక యూరియా కోసం అవసరం లేని మందులు కొంటూ తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు వాపోయారు. ఈ విషయంపై వ్యవసాయ అధికారి ఆనంద్‌ లోకాదల్‌ను వివరణ కోరగా యూరియాతో పాటు గుళికలు తీసుకోవాలని బలవంతం చేస్తున్న డీలర్లపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యూరియా కావాలంటే ఇతర ఎరువులు కొనాల్సిందే..

యూరియా కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం. ఒక్క బస్తా యూరియా కావాలంటే సీట్రైట్‌, గుళికలు, కాంప్లెక్స్‌ ఎరువులు తీసుకోవాలని, లేకుంటే యూరియా ఇవ్వమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. - మహమ్మద్‌నూరుల్లా, రైతు, హొళగుంద

Updated Date - Jun 23 , 2026 | 12:30 AM