Share News

తప్పని పడిగాపులు

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:10 AM

పది రోజుల నుంచి పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పెట్రోలు, డీజిల్‌ కోసం వాహనదా రులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ బంకులో చూసినా నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

తప్పని పడిగాపులు
డోన్‌లో బంకును తనిఖీ చేస్తున్న అధికారులు

పెట్రోలు, డీజిల్‌ కోసం వాహనదారుల తిప్పలు

డీజిల్‌ దొరక్కపోవడంతో నిలిచిన వ్యవసాయ పనులు, పరిశ్రమలు మూతపడే ప్రమాదం

నామమాత్ర తనిఖీలు చేస్తున్న అధికారులు

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): పది రోజుల నుంచి పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పెట్రోలు, డీజిల్‌ కోసం వాహనదా రులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ బంకులో చూసినా నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని బంకుల్లో అరకొరగా సరఫరా అవుతుండటంతో వాహనాలు బారుదీరాయి. డీజిల్‌ దొరక్కపోవడంతో పరిశ్రమలు, వ్యవసాయ రంగం కుంటుపడే ప్రమాదం కనిపిస్తోంది. కొలిమిగుండ్ల, సంజామల, అవుకు, బనగానపల్లె, తదితర అనేక ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి, తదితర పంటలు కోతదశలో హర్వేస్టర్లు, ట్రాక్టర్లు, కోత మిషన్లు నిలిచిపోయే పరిస్థితి ఉంది.

డీజల్‌ పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలి

కొలిమిగుండ్ల: డీజిల్‌ పంపిణీకి ప్రాధాన్యమివ్వాలని ఏవో శారదాదేవి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని బెలుం, కొలిమిగుండ్ల గ్రామాల్లో పెట్రోల్‌ బంకులను అధికారులు తనిఖీ చేశారు. బంకుల్లో నిల్వలు, అవసరమైన ఉత్పత్తికి సంబంధించిన వివరాలను పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పంపిణీలో పారదర్శకత పాటిస్తూ అందుబాటులో ఉన్న స్టాక్‌ వివరాల ప్రదర్శన చేపట్టాలని అధికారులు సూచించారు. పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ గోవింద నాయక్‌, వీఆర్వో నారాయణ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

తీవ్రమైన ఇంధన కష్టాలు

ప్యాపిలి: ప్యాపిలి, గార్లదిన్నే, చిగురుమాన్‌మిట్ట వద్ద పెట్రోలు బంకుల్లో ఇంధనం కొరత కారణంగా ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పెట్రోలు దొరకకపోవడంతో గుత్తి, డోన్‌ ప్రాంతాలకు వెళ్లి ఇంధనం తెచ్చుకుంటున్నారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: ఆర్డీవో

డోన్‌ టౌన్‌: పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని ౅ బంకుల యజమానులకు డోన్‌ ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్‌ రవికుమార్‌, పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని టీఆర్‌ నగర్‌లోని భారత్‌ పెట్రోల్‌, ఇండియన్‌ ఆయిల్‌, నయారా బంకులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి, మున్సిపల్‌ అధికారులు ఉన్నారు.

బేతంచెర్ల: పట్టణంలో పది రోజులుగా పెట్రోల్‌ బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. నాపరాళ్ల రవాణా చేసేందుకు ట్రాక్టర్లకు, ప్రయాణీకులను చెరవేసేందుకు ఆటోలకు డీజిల్‌ లేక పెట్రోల్‌ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందని డ్రైవర్లు వాపోయారు.

నిలిచిన వ్యవసాయ పనులు

చాగలమర్రి: ఇరాన్‌, ఇజ్రాయిల్‌ యుద్ధ ప్రభావంతో డీజిల్‌, పెట్రోల్‌ కొరతతో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు. పెట్రోల్‌ బంకుల్లో కొద్దిసేపు మాత్రమే అమ్మకాలు చేసి, నో స్టాక్‌బోర్డు పెడుతున్నారు. డీజిల్‌ కొరతతో రైతులు లబోదిబోమంటున్నారు.

బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడితే కఠిన చర్యలు

ఇంధనం కొరత సృష్టించి బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్‌ ఫణింద్రుడు, ఎస్‌ఐ రాజారెడ్డి హెచ్చరించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమవారం గ్రామంలోని పెట్రోల్‌ బంకులను తనిఖీ చేశారు. డిజిల్‌, పెట్రోల్‌ బంకుల్లో రికార్డులు, స్టాక్‌ను పరిశీలించారు. ఏవో రంగనేతాజీ, హెచ్‌సీ రఫి, వీఆర్వో శ్రీనివాసులు, వీహెచ్‌ఏ ఫరూక్‌ ఉన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:10 AM