Share News

పెట్రోలు కోసం పడిగాపులు

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:46 PM

మండల కేంద్రంలో మూడు రోజులుగా పెట్రోల్‌, డిజిల్‌ కోసం వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ఎస్‌ఐ రాజారెడ్డి పర్యవేక్షణలో పోలీసుల సాయంతో ఇండియన్‌ ఆయిల్‌ బంకు నిర్వాహకులు క్యూలైన్‌ ఏర్పాటు చేసి ఒక్కోక్కరికి 20 లీటర్ల చొప్పున డిజిల్‌ను నింపారు.

పెట్రోలు కోసం పడిగాపులు
రుద్రవరంలో మూతపబడ్డ పెట్రోలు బంకు

మండలాల్లో ఇంధనం తీవ్ర కొరత..

రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్న వాహనదారులు

చాగలమర్రి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మూడు రోజులుగా పెట్రోల్‌, డిజిల్‌ కోసం వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ఎస్‌ఐ రాజారెడ్డి పర్యవేక్షణలో పోలీసుల సాయంతో ఇండియన్‌ ఆయిల్‌ బంకు నిర్వాహకులు క్యూలైన్‌ ఏర్పాటు చేసి ఒక్కోక్కరికి 20 లీటర్ల చొప్పున డిజిల్‌ను నింపారు. మరికొన్ని చోట్ల నో స్టాక్‌బోర్డులు దర్శనమిచ్చాయి. అలాగే పెట్రోల్‌ కొరత అధికంగా ఉండటంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. బంకు నిర్వాహకులు స్టాక్‌ లేదని చెబుతుండటంతో వాహనదారులు అయోమయానికి గురౌతున్నారు. రైతులు క్యాన్‌లు తీసుకొని బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

నాలుగురోజులుగా బంద్‌

రుద్రవరం: మండల కేంద్రంలో నాలుగురోజులుగా పెట్రోలు, డీజిల్‌ నాలుగు రోజులుగా సరఫరా లేదు. మండలంలో 5 బంకులు ఉండగా అన్నీ మూతపడ్డాయి. డీజల్‌ అందుబాటులో లేక వరి కోతలు నిలబడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చిన పంటను కోసుకోలేకపోతున్నామని వాపయారు.నరసాపురం గ్రామంలో పెట్రోలు బంకులో డీజలు, పెట్రోలు అందుబాటులో లేదు. రైతులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తప్పని నిరీక్షణ

సంజామల: నాలుగు రోజుల నుంచి పెట్రోల్‌ సరఫరా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం ఉదయం సంజామల పెట్రోల్‌ బంక్‌ డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా కావడంతో ఉదయం నుంచే వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ కోసం నిరీక్షించారు. మండలంలో నాలుగు పెట్రోల్‌ బంక్‌లు ఉన్నా ఎక్కడా ఇంధనం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లి డీజిల్‌, పెట్రోల్‌ తెచ్చుకుంటున్నారు. సంజామల బంకు వద్ద ముదిగేడు, ఆకుమల్ల, ఆల్వకొండ, కమలపురి, కానాల, సంజామల, ఎగ్గోని, గిద్దటూరు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వాహనదారులు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. డీజిల్‌, పెట్రోల్‌ కొరతను దృష్టిలో పెట్టుకుని పౌర సరఫరా శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

డోన్‌ టౌన్‌: పట్టణంలోని పెట్రోల్‌ బంకుల్లో అర్ధరాత్రి నుంచి పడిగా పులు కాస్తున్నా లభించటం లేదని వాహనదారులు వాపోతున్నారు. కొరతను ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. అధికారుల, ప్రజాప్రతినిధులు స్పందించి వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ సక్రమంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:46 PM