Share News

ప్రభుత్వ ఇళ్ల కోసం ఎదురుచూపు

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:49 AM

సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆశపడుతున్న గ్రామీణ ప్రాంత పేదలకు నిరీక్షణ తప్పడం లేదు. ఆదోని-1, ఆదోని-2 మండలాల పరిధిలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పిటివరకు ఒక్క ఇల్లు కూడా మంజూరుకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఇళ్ల కోసం   ఎదురుచూపు

ఆదోని రెండు మండలాల్లో 2,200 దరఖాస్తులు

గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మంజూరు కాని వైనం

పట్టణంలో 1,112 ఇళ్లు మంజూరైనా 510 పనులు ప్రారంభం కాని దుస్థితి

లబ్ధిదారుల వలసలే కారణమంటున్న అధికారులు

ఆదోని, నవంబరు 29 (ఆంధ్ర జ్యోతి): సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆశపడుతున్న గ్రామీణ ప్రాంత పేదలకు నిరీక్షణ తప్పడం లేదు. ఆదోని-1, ఆదోని-2 మండలాల పరిధిలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పిటివరకు ఒక్క ఇల్లు కూడా మంజూరుకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతంలో ఇళ్లు మంజూరైనప్పటికీ వలసల కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు.

గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌లో దరఖాస్తులు

ఆదోని-1,2 మండలాల పరిధిలో ప్రభుత్వ పక్కా ఇళ్ల కోసం మొత్తం 2,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన అధికారులు, సొంత ఇంటి స్థలం ఉన్న 1645 మంది లబ్ధిదారులను గుర్తించారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) 2.0 కింద ప్ర స్తుతం కేవలం మున్సిపాలిటీ పరిధిలో మా త్రమే ఇళ్లు మంజూరయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మంజూరు ప్రక్రియ ప్రా రంభం కాలేదని హౌసింగ్‌ డీఈ చంద్రశేఖర్‌ అన్నారు.

మండలంలో వలసల ప్రభావం

ఆదోని మున్సిపాలిటీ పరిధిలో పీఎంఏవై అర్బన్‌ 2.0 కింద ఇప్పటివరకు 1,112 ఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఇందులో 510 ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పనులు ఎందుకు మొదలు పెట్టలేదని అధికారులు విచారణ చేపట్టగా లబ్ధిదారుల్లో చాలామంది ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు గుర్తించారు.

యూనిట్‌ ధరలు, రాయితీ వివరాలు ఇలా..

కూటమి ప్రభుత్వం పీఎంఏవై 2.0 కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా యూనిట్‌ ధరలను ఖరారు చేసింది. పట్టణ ప్రాంతంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష అందిస్తోంది. దీనికి అదనంగా ఉపాధి హామీ పథకం (మెటీరియల్‌/లేబర్‌ కాంపోనెంట్‌), స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు అందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు యూనిట్‌ ధరను రూ.2.39 లక్షలుగా నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే సొంత స్థలాలు ఉన్న అర్హులకు ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పట్టణంలో వలస వెళ్లిన లబ్ధిదారులను గుర్తించి వారిని తిరిగి రప్పించి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే గ్రామీణ ప్రాంత పేదలకు తక్షణమే ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Nov 30 , 2026 | 12:49 AM