వేతన వెతలు
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:11 PM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నాలుగు నెలలుగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులకు వేతనాలు అందక అల్లాడిపోతున్నారు.
కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందని జీతాలు
కర్నూలు హాస్పిటల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నాలుగు నెలలుగా కాంట్రాక్టు స్టాఫ్ నర్సులకు వేతనాలు అందక అల్లాడిపోతున్నారు. ట్రెజరీ డీటీవో లాగిన్ నుంచి 200 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను రిజెక్ట్ జాబితాలో పంపడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. నాలుగు రోజులుగా వెనక్కు పంపిన జాబితాను సరి చేసే ప్రక్రియలోకర్నూలు జీజీహెచ్ సంబంధిత క్లర్క్ నిమగ్నమయ్యారు. ఈనెల 25వ తేదీ లోపు కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు ట్రెజరీ శాఖకు పంపించకపోతే ఉద్యోగులకు వేతనాలు అందడం కష్టంగా మారుతుంది. తిరస్కరించిన జాబితాను త్వరగా నమోదు చేసే ప్రక్రియను అదనంగా ఉద్యోగులతో చేయించి జాబితాను ట్రెజరీ అధికారులకు పంపించాలని కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు కోరుతున్నారు. ఇప్పటికే అప్పులపాలయ్యామని, ఇళ్లను కూడా ఇంటి యజమానులు అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క స్కూల్స్ ప్రారంభం కావడం మరో పక్క వేతనాలు అందకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువ పెట్టామని ఓ స్టాప్ నర్సు కన్నీరు మున్నీరైంది.