బత్తాయికి వైరస్..
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:26 AM
చీని మొక్కలకు వైరస్ సోకడంతో పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి ఏళ్లతరబడి పెంచుకున్న పండ్ల మొక్కలు ఇలా ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో సుమారు వంద ఎకరాల్లో చీని తోటలను సాగు చేశారు.
ఎండిపోతున్న చెట్లు.. దిక్కుతోచని స్థితిలో రైతులు
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
కొలిమిగుండ్ల, ఆగస్టు 15 (ఆంఽధ్రజ్యోతి): చీని మొక్కలకు వైరస్ సోకడంతో పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి ఏళ్లతరబడి పెంచుకున్న పండ్ల మొక్కలు ఇలా ఎండిపోతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో సుమారు వంద ఎకరాల్లో చీని తోటలను సాగు చేశారు.
అదుపులోకి రాని వైరస్
సాధారణ పంటలతో వరుస నష్టాలు వస్తుండటంతో రైతులు పండ్ల తోటలను సాగుచేశారు. మొక్కలు పెరిగి, తీరా కాపుకొచ్చిన సమయంలో ఇలా వైరస్ సోకి ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. 5 నుంచి 10 ఏళ్ల వయస్సు ఉన్న చెట్లు కాయలతోనే వాడిపోతుండడం రైతులకు ఆవేదన కలిగిస్తోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా వైరస్ పోవడం లేకపోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఏడాదికేడాది ఇలా చెట్టు ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఉద్యాన అధికారులు తోటలను పరిశీలించి, తగు విధంగా సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వం ఆర్ధికసాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మొక్కలు ఎండిపోతున్నాయి..
పది ఎకరాలలో చీని తోట సాగుచేశా. ఏటా దిగుబడి సమయంలో చెట్లు చనిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఉపయోగం లేదు. ప్రభుత్వ ఆదుకోవాలి. - నరసింహా రెడ్డి, రైతు, నందిపాడు