Share News

ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:14 AM

అతనో ప్రభుత్వ ఉద్యోగి.. నగరంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే పలు అనారోగ్య సమస్యలు అధికమయ్యాయి. గతంలో ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు. ఎక్కువ నడవడం, నిలబడటం ఇబ్బందికరంగా మారింది. ఫీల్డ్‌ వర్క్‌ చేయటం కష్టంగా ఉందని అధికారులను వేడుకున్నారు. కానీ వారు కనికరించలేదు. కర్కశంగా వ్యవహరించారు. పని ఒత్తిడి పెంచారు. విధులు కఠినతరం చేశారు. అతను తట్టుకోలేకపోయాడు. బాధను దిగమింగే ఓపిక నశించింది. గుండెను రాయి చేసుకున్నాడు. దేవుడా.. ఇక తట్టుకోలేను అంటూ బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించాడు. కుటుంబాన్ని అనాథగా మార్చి అనంతలోకాలకు చేరాడు. బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టింది.

ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య
వీఆర్వో హుస్సేన్‌ మృతదేహంతో కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఉద్యోగులు

సూసైడ్‌ లేఖలో ఇద్దరు రెవెన్యూ అధికారుల పేర్లు

కలెక్టరేట్‌ వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యుల నిరసన

డీఆర్వో డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు

సమగ్ర విచారణకు కలెక్టర్‌ హామీ

కర్నూలు కలెక్టరేట్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అధికారుల ఒత్తిడితో ఓ వీఆర్వో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు నగరంలో చోటుచేసుకోగా రెవెన్యూ శాఖలో విషాదాన్ని నింపింది. నగరంలోని 30వ సచివాలయంలో గ్రేడ్‌-2 వీఆర్వోగా మహమ్మద్‌ హుస్సేన్‌(49) శనివారం ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. కర్నూలు నగర శివారులోని వెంకాయపల్లెలో నివాసం ఉంటున్న ఆయన తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాసినట్లు చెబుతున్న సూసైడ్‌ లేఖలో కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. విధుల ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మహమ్మద్‌ హుస్సేన్‌ కొంతకాలంగా వెన్నెముక సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. గతంలో ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారని, ఎక్కువ సేపు నడవడం, నిలబడటం ఇబ్బందిగా ఉంటుందని పలుమార్లు అధికారులకు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంటింటికి వెళ్లాల్సిన బీఎల్‌వో బాధ్యతలు అప్పగించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని వారు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విధుల్లో సడలింపులు ఇవ్వాలని కోరినా స్పందన లభించలేదని, దీంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు సూసైడ్‌ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని..

వీఆర్వో మృతదేహాన్ని కలెక్టరేట్‌ వద్దకు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న డీఆర్వో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, డీఆర్వో డౌన్‌డౌన్‌ నినాదాలు చేశారు. కలెక్టర్‌ బాధిత కుటుంబాన్ని కలెక్టరేట్‌లోకి పిలుచుకొని మాట్లాడారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు..

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఘటనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, కుటుంబ సభ్యుల్లో అర్హత కలిగిన వ్యక్తికి ఉద్యోగావకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సూసైడ్‌ లేఖలో చేసిన ఆరోపణలపై అధికారిక విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.

అధికారులపైన చర్యలు తీసుకోవాలి

వీఆర్వో మృతికి కారణమైన కర్నూలు అర్బన్‌ రెవెన్యూ అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ అంజిబాబు డిమాండ్‌ చేశారు. తన ఆరోగ్యం బాగాలేదని అధికారులకు విన్నవించినా కూడా విధులు కేటాయించడం రెవెన్యూ అధికారుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిరసనలో జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు దివాకర్‌, కార్యదర్శి రామకృష్ణ, ఓల్డ్‌ సిటీ కార్యదర్శి విజయ్‌, న్యూసిటీ కార్యదర్శి నరసింహులు, నగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:14 AM