ఓటర్లు సహకరించాలి
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:55 PM
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు ఓటర్లు సహకరించాలని కర్నూలు జిల్లా సర్ ఎలెక్టోరల్ అబ్జర్వర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి సూచించారు.
సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ లావణ్య వేణి
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు ఓటర్లు సహకరించాలని కర్నూలు జిల్లా సర్ ఎలెక్టోరల్ అబ్జర్వర్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి సూచించారు. మంగళవారం నగరంలోని పాతబస్తీ పెద్దమార్కెట్ వద్ద ప్రభుత్వ బాలికల పాఠశాలలో 248 పోలింగ్ బూతలో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన డేను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సర్ ప్రక్రియలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఓటర్లకు సూచించారు. మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఆచూకీ లేని వారు, డూప్లికేట్ ఓటర్లకు సంబంధించిన వివరాలను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండ చర్యలు తీసుకోవడం సర్ ప్రధాన ఉద్దేశమన్నారు. సర్ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత స్థాయి ఏజెంట్లు క్రియాశీలకంగా భాగస్వాములై ఓటరు జాబితా మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్‌ఓలు తహసీల్దారు రవికుమార్, డిప్యూటీ తహసీల్దారు ధనుంజయ, కార్యదర్శి నాగరాజు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్‌లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.