ఓటర్ల జాబితా సిద్ధం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:15 PM
పంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
పంచాయతీల్లో 10,84,704 మంది ఓటర్లు
అన్ని కేటగిరిల్లో మహిళా ఓటర్లే ఆధిక్యం
54 శాతం బీసీ, 22 శాతం ఎస్సీలు
నంద్యాల హాస్పిటల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. 10,84,704 మందితో జిల్లా పంచాయతీ యంత్రాంగం ఓటర్ల జాబితాను సిద్దం చేసింది. 5,33,160 మంది పురుషులు, 5,51,419 మంది మహిళా ఓటర్లు ఉండగా, 125 మంది ఇతరులున్నారు. జిల్లాలో 54శాతం బీసీ ఓటర్లు ఉండగా, 22 శాతం ఎస్సీ, 21 శాతం ఇతరులు, 3శాతం ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అన్ని కేటగిరిల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం నంద్యాల జిల్లా పరిషత్ మొట్టమొదటి సారిగా ఏర్పడనుంది. ఈ నెల 23న ఎంపీటీసీల, 24న జడ్పీటీసీల పదవికాలం ముగియనుంది. దీంతో ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈమేరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను ఏర్పాటు చేయాలని, జడ్పీ సీఈవోలు జిల్లాలోని మండలాల్లో జడ్పీటీసీ జాబితాలు ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. జిల్లాలో 489 పంచాయతీలకు గాను ఎస్టీ ఓటర్లు 33,831, ఎస్టీ ఓటర్లు 2,34,535, బీసీ ఓటర్లు 5,92,107, ఓసీ, మైనార్టీ 2,24,231 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు జాబితా సిద్ధం చేశారు.
బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న మండలాలు
బనగానపల్లె మండలంలో 49,513 మంది, ప్యాపిలి మండలంలో 38,211, డోన్ మండలంలో 34,052 ఓట్లు ఉన్నాయి. బనగానపల్లె మండలంలో 13,820 ఎస్సీ ఓటర్లు, 3,441 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు.
కేటగిరిల వారీగా ఓటర్లు ఇలా
జిల్లాలో ఎస్టీ కేటగిరిలో 16,375 మంది పురుషులు, 17,449మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. ఎస్సీ కేటగిరిలో 1,14,204మంది పురుషులు, 1,20,307 మంది మహిళలు, 24మంది ఇతరులు ఉన్నారు. బీసీ కేటగిరిలో 2,90,892 మంది పురుషులు, 3,11,44 మంది మహిళలు 71 ఇతరుల ఓటర్లు ఉన్నారు. ఓసీ మైనార్టీ కేటగిరిలో 1,11,689 మంది పురుషులు, 1.12.519 మంది మహిళలు, 23 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.