‘ఓటు’ సునామీ
ABN , Publish Date - Nov 30 , 2026 | 12:10 AM
పల్లె పోరులో గ్రామీణ ఓటర్లు పోటెత్తారు. పల్లె సీమల అభివృద్ధికి కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రతినిధిగా సర్పంచ్‌ను ఎన్నుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.53 శాతం పోలింగ్
గంటగంటకూ పెరిగిన పోలింగ్
కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు
86.12 శాతంతో కల్లూరు మండలం టాప్
అత్యల్పంగా కోసిగి మండలంలో 75.26 శాతం
కర్నూలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పల్లె పోరులో గ్రామీణ ఓటర్లు పోటెత్తారు. పల్లె సీమల అభివృద్ధికి కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రతినిధిగా సర్పంచ్‌ను ఎన్నుకోవడానికి ఓటర్లు ఆసక్తి చూపారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన 9 మండలాల్లో 80.53 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7గంటలకే పోలింగ్ కేంద్రాలు బారులు తీరారు. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ ముగిసే మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అయ్యింది. కల్లూరు మండలంలో 86.12 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. అత్యల్పంగా కోసిగి మండలంలో 75.26 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం, మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో 186 పంచాయతీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్డ్ జారీ చేశారు. 17 సర్పంచ్ స్థానాలు, 381 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఆదివారం 169 సర్పంచ్ స్థానాలు, 1,590 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. 1,772 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,36,939 మంది ఓటర్లకు గాను 3,51,882 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. ఉదయమే గ్రామీణ ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది.
గంట గంటకూ పెరిగిన జోరు
తొలి రౌండ్ : ఉదయం 9గంటల వరకు 1,18,702 మంది ఓటర్లు ఓటు వేశారు. 27.17 శాతం పోలింగ్ నమోదైంది. ఆ సమయానికి అత్యధికంగా ఓర్వకల్లు మండలంలో 35.74శాతం ఓట్లు పోలయ్యాయి.
రెండో రౌండ్: 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఎండ తీవ్రత పెరిగినా ఓటర్లలో ఉత్సాహం తగ్గలేదు. 11 గంటల సమయానికి 2,68,171 మంది ఓటు వేశారు. 61.37 శాతానికి పోలింగ్ చేరుకుంది.
మూడో రౌండ్: 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య పోలింగ్ మందకొడిగా సాగింది. ఓటర్లు లేక పలు కేంద్రాలు వెలవెలబోయాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటు వేయని వారిని గుర్తించి పోలింగ్ కేంద్రాలకు రప్పించి ఓటు వేయించారు. పోలింగ్ ముగిసే సమయానికి 80.53 శాతం అంటే 3,51,882 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మండలాల వారీగా మొత్తం ఓట్లు,
పోలైన ఓట్లు , శాతం వివరాలు
మండలం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు శాతం
కల్లూరు 33,647 28,976 86.12
ఓర్వకల్లు 48,317 41,386 85.66
నందవరం 45,669 37,381 81.85
పెద్దకడబూరు 45,864 36,946 80.56
మంత్రాలయం 40,933 32,935 80.46
కౌతాళం 57,519 45,837 79.69
గోనెగండ్ల 53,615 42,691 79.63
ఎమ్మిగనూరు 55,851 43,945 78.68
కోసిగి 55,524 41,785 758.26
మొత్తం 4,36,939 3,51,882 80.53
కూటమి కుమ్మేసింది
120 సర్పంచ్ స్థానాలు కూటమికే
పల్లెపీఠాలపై పసుపు జెండా రెపరెపలు
వైసీపీ మద్దతుదారులు 59 సర్పంచ్ స్థానాల్లో విజయం
మంత్రాలయం, గోనెగండ్లలో టీడీపీ రెబల్ అభ్యర్థి పన్నాగ శాంతిలత విజయం
కర్నూలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పల్లె పోరులో గ్రామీణ ఓటర్లు కూటమికే జైకొట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతులో పల్లె కురుక్షేత్రంలో తలపడిన అభ్యర్థులే సర్పంచులుగా విజయ దుందుభి మోగించారు. టీడీపీ మద్దతుతో పోరులో తలపడిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు సునామీలో వైసీపీ మద్దతుదారులు కొట్టుకుపోయారు. సర్పంచ్ సహా మెజార్టీ వార్డు స్థానంలో కూటమి మద్దతు అభ్యర్థులు విజయయాత్ర సాగించారు. త్వరలో జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లోనూ గెలుపు ఖరారు చేసుకుంటూ వార్డుల్లో కూడా కూటమి జైత్రయాత్ర కొనసాగించింది. జిల్లాలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలతో కలిపి 150 సర్పంచ్ స్థానాలు దక్కించుకొని పల్లె పీఠాలపై కూటమి జెండా ఎగురవేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మూడు గంటలు నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే టీడీపీ మద్దతుదారుల ఆధిక్యతతో విజయం దిశగా దూసుకుపోయారు. ఎన్నికలు జరిగిన 186 గ్రామ పంచాయతీల్లో 120 సర్పంచ్ పీఠాలను టీడీపీ చేజిక్కించుకుంది. టీడీపీ శ్రేణుల విజయోత్సవ సంబరాలతో పల్లెసీమలు సందడిగా మారాయి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ బందోబస్తును పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 484 గ్రామ పంచాయతీల ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర పునేఠా షెడ్యూల్ జారీ చేశారు.
అందులో భాగంగా ఈ నెల 26న ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో 148 పంచాయతీల్లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఆరంభంలోనే ఆదుర్స్ అంటూ అఽధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 91 సర్పంచ్ స్థానాల్లో విజయ ఢంకా మోగించి పల్లెసీమల్లో స్పష్టమైన పట్టు సాధించింది. రెండవ విడతలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో 186 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు సహా 1,972 వార్డులకు ఎన్నికలు జరగాలి. 17 సర్పంచ్ స్థానాలు, 381 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగే 169 సర్పంచ్ స్థానాలకు 478 మంది అభ్యర్థులు, 1,590 వార్డులకు 3,547 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆదివారం 1,772 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం ఒంటి గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 4,36,939 ఓటర్లకు గాను 3,51,882 మంది ఓటర్లు (80.52 శాతం) ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేశారు. మూడు గంటల నుంచి ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు.
పల్లెపీఠాలపై పసుపు జెండా:
ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. వార్డు, సర్పంచ్ బ్యాలెట్ పత్రాలను వేరు చేశారు. మొదట వార్డు స్థానాల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించారు. ఆ తరువాత సర్పంచ్ స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టారు. పలు పంచాయతీల్లో రాత్రి 9 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. రౌండ్ రౌండ్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో విజయం తీరాలకు చేరుకున్నారు. ఏకగ్రీవాలతో 186 పంచాయతీల్లో టీడీపీ 119, జనసనే ఒక స్థానం కలిపి కూటమి 120 సర్పంచ్ పీఠాలు సొంతం చేసుకుంది. తొలి విడతలోనే కాదు.. రెండవ విడతలోనూ కూటమి జైత్రయాత్రతో వైసీపీ కుదేలైంది. వైసీపీ కేవలం 59 స్థానాలతో సరిపుచ్చుకుంది. ఏడుగురు స్వతంత్రులు విజయం సాధిస్తే, వారిలో నలుగురు టీడీపీ మద్దతు ఆశించి, రెబల్‌గా పోటీ చేసిన వారే.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాల్లో 52 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే, 31 సర్పంచ్ స్థానాలు టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రాజకీయ వ్యూహంలో వైసీపీ నేతలు కొట్టకుపోయారు. వైసీపీ 16 సర్పంచ్ స్థానాలు దక్కించుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి పట్టున్న ఎమ్మిగనూరు మండలంలో 9 సర్పంచ్ స్థానాలు దక్కించుకొని ఎమ్మెల్యే బీవీ పట్టు సాధించారు. 25-30 ఏళ్ల తరువాత కోటేకల్లు, కడివెళ్ల, దైవందిన్నె.. వంటి పంచాయతీల్లో టీడీపీ జెండాలు ఎగడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అయితే.. మండల కేంద్రం గోనెగండ్ల మేజర్ పంచాయతీలో టీడీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో 40 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 28 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు విజయం సాధించింది. ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి దంపతులు పల్లెసీమల్లో ఆధిక్యతను సాధించారు. వైసీపీ 12 సర్పంచ్ స్థానాలతో సరిపుచ్చుకుంది.
మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయం 94 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదరులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 60 సర్పంచ్ స్థానాలు, జనసేన మద్దతుదారు ఒకస్థాబడనం కలిపి కూటమి 61 స్థానాలు దక్కించుకుంది. వైసీపీ 31, స్వతంత్రులు ఇద్దరు గెలిచారు. మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డికి జడ్పీ చైర్మన్ చూడి ఉలిగయ్య జత కావడంతో కూటమి సునామీ సృష్టించింది. కాగా.. నియోజకవర్గం కేంద్రం మంత్రాలయం సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతులో బరిలో దిగాలని ఆశించిన, ఆ పార్టీ ఇన్‌చార్జి మద్దతు ఇవ్వకపోవడంతో రెబల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పన్నాగ శాంతిలత విజయం సాధించారు. ఈమె టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి సన్నిహితుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు పన్నాగ వెంకటేశ్ స్వామి భార్య.
మండలాల వారిగా విజయం సాధించిన వివిధ పార్టీ మద్దతుదారులు:
మండలం పంచాయతీలు టీడీపీ జనసేన మొత్తం వైసీపీ ఇతరులు
కల్లూరు 18 14 -- 14 4 --
ఓర్వకల్లు 22 14 -- 14 8 --
ఎమ్మిగనూరు 17 9 -- 9 8 --
నందవరం 15 11 -- 11 4 --
గోనెగండ్ల 20 11 -- 11 4 5
మంత్రాలయం 20 12 -- 12 7 1
కోసిగి 24 15 1 16 8 --
కౌతాళం 30 19 -- 19 10 1
పెద్దకడబూరు 20 14 -- 14 6 --
మొత్తం 186 119 1 120 59 7