Share News

సద్గుణమే జీవితం

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:45 PM

రంజాన్‌ మాసంలో అనుసరించిన సద్గుణాలను ఎల్లవేళలా ఆచరిస్తేనే జీవితానికి సార్థకత అని ముస్లిం మతపెద్దలు యువతకు పిలుపునిచ్చారు.

సద్గుణమే జీవితం
ఈద్గాలో రంజాన్‌ ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

సేవ, శాంతి రంజాన్‌ సారం

యువతకు ముస్లిం మతపెద్దల పిలుపు

జిల్లాలో ఘనంగా జరిగిన ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’

కర్నూలు కల్చరల్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసంలో అనుసరించిన సద్గుణాలను ఎల్లవేళలా ఆచరిస్తేనే జీవితానికి సార్థకత అని ముస్లిం మతపెద్దలు యువతకు పిలుపునిచ్చారు. ఈ మాసంలో పాటించిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు మిగతా పదకొండు నెలలు కూడా కొనసాగించాలన్నారు. సేవాగుణం, శాంతియుత జీవనమే రంజాన్‌ సారాంశమని ప్రసంగించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ (రంజాన్‌) వేడుకను ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ఈద్‌ నమాజులు నిర్వహించారు. కర్నూలు నగరంలో కొత్తబస్టాండు రోడ్డులోని పాత ఈద్గాలో ప్రభుత్వ ఖ్వాజీ హాఫిజ్‌ సయ్యద్‌ షా సలీంబాషా నిజామీ, సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలో ముఫ్తీ మన్సూర్‌ అహ్మద్‌ ఖ్వాస్మీ ప్రార్థనలు చేయించి దైవ సందేశం అందించారు. రంజాన్‌ మాసం ముస్లింలకు ఒక ఆధ్యాత్మిక, మానసిక శిక్షణ వంటిదని చెప్పారు. ఈ మాసంలో చేసిన ఉపవాసాలు, దానధర్మాలు, పుణ్యకార్యాలు మానసిక సంతృప్తితోపాటు సంఘజీవులుగా పరస్పరం కలిసిమెలసి జీవించేందుకు దోహదపడతాయని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని మహ్మద్‌ ప్రవక్త తెలియజేశారని, దీన్ని పాటిస్తూ సమాజంలో ముస్లింలు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈద్గా వద్ద ప్రార్థనలకు ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ ప్రార్థనల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు చట్టాల సవరణకు నిరసనగా, దాన్ని రద్దు చేయాలని, యథావిధిగా కొనసాగించాలని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. కర్నూలులో జరిగిన ప్రార్థనల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలో ముస్లింలతో కలసి ప్రార్థనలు చేశారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర నాయకుడు వహీద్‌ హుస్సేన్‌, మాజీ ఏఐఎస్‌ అధికారి ఇంతియాజ్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనలో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

రంజాన్‌ పండుగ సందర్భంగా శనివారం బస్టాం డు వద్ద ఉన్న ఈద్గాలో జాయిం ట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ముస్లింలతో కలసి సామూహిక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్‌ మాసంలో అనుసరిం చిన క్రమశిక్షణ, సోదర భావం, పేదలకు సాయం చేయడం వంటి కార్యక్రమాలు మున్ముం దు కూడా కొనసాగించాలని, మహమ్మద్‌ ప్రవక్త బోధనలే మార్గదర్శనమని ముస్లింలకు ఆయన సూచించారు. అనంతరం ఆలింగనం చేసుకుంటూ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - Mar 21 , 2026 | 11:45 PM