Share News

ఓటుకు పోటెత్తిన పల్లెలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:12 AM

పల్లెలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. మేము సైతం అంటూ వృద్ధుల నుంచి యువత వరకు కదిలొచ్చారు. ఏ పల్లెకు వెళ్లినా.. ఏ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించినా ఎవరిని కదిపినా ఒకటే మాట ఓటేయడం మన బాధ్యత.

ఓటుకు పోటెత్తిన పల్లెలు

జిల్లాలో 74.27 శాతం పోలింగ్‌

అత్యధికంగా బండి ఆత్మకూరులో 80.52 శాతం

అత్యల్పంగా ఉయ్యాలవాడలో 67.39 శాతం

బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం

పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌లో స్వల్ప ఘర్షణ

పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతం

రేపు కౌంటింగ్‌

పల్లెలో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తారు. మేము సైతం అంటూ వృద్ధుల నుంచి యువత వరకు కదిలొచ్చారు. ఏ పల్లెకు వెళ్లినా.. ఏ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించినా ఎవరిని కదిపినా ఒకటే మాట ఓటేయడం మన బాధ్యత. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద జనం బారులు దీరారు. పల్లె ప్రగతిపై ఓటర్లు తమ ఆకాంక్షను చాటారు. వృద్ధులు, మహిళలు, గర్భిణులు, పసిపిల్లల తల్లులు, దివ్యాంగులు, యువత సైతం ఓటేసేందుకు తరలిరావడం స్ఫూర్తిదాయకం. ఓటరన్న తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఫలితాలు ఎలా ఉంటాయో? అని అభ్యర్థులు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ మొదలైంది. జిల్లాలోని పగిడ్యాల మండలంలో నెహ్రూనగర్‌లో స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ ఘటన మినహా పోలింగ్‌ అంతా ప్రశాంతంగా ముగిసింది.

నంద్యాల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పోరులో భాగంగా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఎక్కడికక్కడ ఆయా అభ్యర్థులతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 8 జడ్పీటీసీ, 152 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 20 జడ్పీటీసీ, 224 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 7 గం టల నుంచి రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది. జిల్లాలో పరిషత్‌ పోరు పరంగా 74.27 శాతం నమోదైంది. ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు నిఘా విస్తృతం చేశారు. కొన్ని చోట్ల మాత్రం వైసీపీ, టీడీపీ వర్గీయులు చిన్నపాటి ఘర్షణలకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశంతో సద్దుమణిగింది. అధికార యంత్రాంగం సైతం ఊపిరి పీల్చుకున్నారు. అత్యధికంగా బండి ఆత్మకూరులో 80.52, అత్యల్పంగా ఉయ్యాలవాడలో 67.39 పోలింగ్‌ శాతం నమోదైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌ ప్రక్రియ సాఫీగా సాగింది.

20 జడ్పీటీసీ స్థానాలకు..

జిల్లాలోని నంద్యాల, డోన్‌, శ్రీశైలం, ఆళ్లగడ్డ, పాణ్యం, నందికొట్కూరు నియోజకవర్గాల పరిధిలోని 20 జడ్పీటీసీ స్థానాలకు 79మంది, 224 ఎంపీటీసీ స్థానాలకు 594మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఈలెక్కన పరిషత్‌ పోరు పరంగా జిల్లాలో 6,88,495 మంది ఓటర్లు ఉండగా.. 5,11,340 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు తరలిరావడంతో పోలింగ్‌ శాతం 74.27 శాతానికి నమోదైంది.

గతంతో పోలిస్తే 9శాతం..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2021లో జరిగిన పరిషత్‌ ఎన్నికల పరంగా పరిశీలిస్తే.. నంద్యాల జిల్లాలో 65 శాతం నమోదైంది. ఈ లెక్కన ఈసారి పరిషత్‌ పోరులో 9శాతం పోలింగ్‌ పెరిగింది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. నంద్యాలలో-74.79, పాణ్యం- 73.75, శ్రీశైలం- 82.79, నందికొట్కూరు- 84.64, ఆళ్లగడ్డ- 83.84, డోన్‌- 82.54 శాతం చొప్పున పోలింగ్‌ నమోదైందని తెలుస్తోంది.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ నేతృత్వంలో భద్రతతో పాటు ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. నంద్యాల, నందికొట్కూరు, డోన్‌ నియో జకవర్గాల్లో అక్కడక్కడ వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అవసరమైన ప్రాంతాల్లో వైసీపీ కీలక నాయకుల గృహా నిర్భంధం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పారవి, చక్రపాణిరెడ్డి కూడా గృహా నిర్బంధం చేశారు.

రసవత్తరంగా పోరు..

పరిషత్‌ పోరు మొదట నుంచి జిల్లాలో ఎక్కడిక్కడ రసవత్తరంగా మారింది. ఏకగ్రీవాలు.. టీడీపీ, వైసీపీ ఒప్పందాలతో రోజుకో కొత్త కోణాల్లో రాజకీయ చర్చలు సాగాయి. మొదటి విడతలో భాగంగా 8 జడ్పీటీసీలు, 152 ఎంపీటీసీ స్థానాలు ఏక్రగ్రీవం చేసుకోగలిగారు. మిగిలిన 20 జడ్పీటీసీ, 224 ఎంపీటీసీ స్థానాలకు పోరు నడిచి తాజా పోలింగ్‌ జరిగింది. పరిషత్‌ పోరు ఇటు టీడీపీ, అటు వైసీపీ మధ్య ఉత్కంఠ భరితంగా నడిచింది. అభ్యర్థులతో పాటు రాజకీయ వర్గాలు, ప్రజలు, చూపు అంతా కూడా శనివారం జరిగే కౌంటింగ్‌పైనే ఉంది. ఓటర్ల తీర్పులో విజేతలు ఎవరు? అన్న దానిపైనే చర్చ సాగుతోంది.

అభ్యర్థుల్లో అలజడి

పరిషత్‌ పోలింగ్‌ ముగియగా 7వతేదిన జరిగే ఓట్ల లెక్కింపుతో బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లపరంగా ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉందో తెలియాల్సి ఉంది. మరో 48 గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఏదిఏమైనా విజయం ఎవరిని వరిస్తుందోదనని అభ్యర్థుల్లో అలజడి మొదలైంది.

పోలింగ్‌ను పరిశీలించిన కూటమి నేతలు

నంద్యాల, నవంబరు5(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను కూటమి నేతలు పరిశీలించారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తోపాటు టీడీపీ సీనియర్‌ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి పెద్దకొట్టాల, అయ్యలూరు, గోస్పాడు, యాలూరు, కానాల, జిల్లెల్ల తదితర గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మహానంది మండలం గాజులపల్లె, శిరివెళ్ల మండలం గంగవరం, కోటకొండ, గోస్పాడు, బండి ఆత్మకూరు మండలం పెద్దదేవులాపురం తదితర గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పరిశీలించారు.

నెహ్రూనగర్‌లో ఉద్రిక్తత

పగిడ్యాల: మండలంలోని నెహ్రూనగర్‌ గ్రామంలో పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ నాయకులు ఘర్షణ పడ్డారు. ఎంపీపీ పాఠశాలలోని 6వ పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీకి చెందిన సతీశ్‌ అనే వ్యక్తి మహిళలకు ఫ్యాన్‌కు ఓటేయాలని చెప్పాడు. అక్కడే ఉన్న టీడీపీకి చెందిన రాము పక్కకు వెళ్లి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి తోపులాడుకున్నారు. అక్కడే ఉన్న టీడీ పీ నాయకులు శ్రీనివాసులునాయుడు, ధర్మక్షేత్ర, వైసీపీ నాయకులు పులేంద్రనా యుడు, మోహన్‌తో పాటు మరికొంత మంది గొడవకు దిగారు. అక్కడే ఉన్న పోలీ్‌సలు ఇరువర్గాల వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపివేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు. వైసీపీ నాయకులను పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Updated Date - Nov 06 , 2026 | 12:12 AM