Share News

విజయ డెయిరీ ఎన్నికలకు బ్రేక్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:45 PM

ఉత్కంఠ రేపిన నంద్యాల విజయ డెయిరీ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఊహించని రీతిలో శాంతి భద్రత దృష్ట్యా మూడు డైరెక్టర్ల నామినేషన్‌ పక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.

విజయ డెయిరీ ఎన్నికలకు బ్రేక్‌
డెయిరీ వద్ద పోలీసుల పహారా

నిలిచిన మూడు డైరెక్టర్ల నామినేషన్‌ ప్రక్రియ

శాంతి భద్రతల దృష్ట్యా తాత్కాలిక వాయిదా

నంద్యాల, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఉత్కంఠ రేపిన నంద్యాల విజయ డెయిరీ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఊహించని రీతిలో శాంతి భద్రత దృష్ట్యా మూడు డైరెక్టర్ల నామినేషన్‌ పక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. కొన్ని రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సదరు డెయిరీ ఎన్నికల ప్రక్రియ భూమా.. ఎస్వీ వర్గాలతో పాటు కూటమి వర్సెస్‌ వైసీపీ అన్నట్టుగా సాగింది. సోషల్‌ మీడియాలోనూ ఇదే హాట్‌ టాఫిక్‌గా మారింది. మొత్తంగా శుక్రవారం ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియఉ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని డెయిరీ ఎండీ ప్రదీ్‌పకుమార్‌ మీడియాతో ప్రకటించారు. నంద్యాలలోని విజయ డెయిరీ వద్ద శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నోటిఫికేషన్‌ ప్రకారం మూడు డైరెక్టర్ల పదవులకు నామినేషన్‌ పక్రియ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఉదయం నుంచి పోలీసు బలగాలు డెయిరీ ఆవరణతో పాటు సమీపంలో మొహరించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గం మొదటి నుంచి డెయిరీపై పై చేయి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో డెయిరీ ఎన్నికలు నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్నాయంటూ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో భూమా, ఎస్వీ వర్గాల మధ్య డెయిరీ వ్యవహారం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు సదరు డెయిరీ ఎండీకి లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఎండీ మీడియా ఎదుట వెల్లడించారు. మ్యాక్స్‌ చట్టం ప్రకారం.. న్యాయ నిపుణులతో చర్చించి ఎన్నికల పక్రియపై నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే నెలలో నామినేషన్‌ పక్రియ ఉండే అవకాశం ఉందన్నారు. స్పష్టమైన ప్రకటనను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అవసరమైతే కోర్టు అదేశాలు మేరకు త్వరలో ఎన్నికల పక్రియను నిర్వహిస్తామన్నారు.

46మందిలో.. నలుగురే

మూడు డైరెక్టర్‌ పదవులకు అర్హులుగా ప్రకటించిన 46 మందిలో కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయడానికి వచ్చారు. నంద్యాల మండలం మునగాల సోసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, పాణ్యం మండలం గోరుకల్లు సోసైటీ లక్ష్మిదేవి, శిరివెళ్ల మండలం గంగవరం సోసైటీ అధ్యక్షులు చంద్రకళ, ఆళ్లగడ్డ పరిధిలోని శాంతినగరం సోసైటీ గంగుల ప్రమీలరాణి డెయిరీ ఆవరణలోకి చేరుకుని నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నామినేషన్‌ పక్రియ వాయిదా వేశామని చెప్పినా వారు వినలేదు. కాసేపు వారిమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Updated Date - Jan 23 , 2026 | 11:45 PM