విఘ్నేశ్వరా.. నిమజ్జనమెలా?
ABN , Publish Date - Sep 01 , 2026 | 10:59 PM
కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనానికి జల గండం పట్టుకుంది.
గణనాథులకు జల గండం
0.398టీఎంసీలకు పడిపోయిన సుంకేసులు జలాశయం
చుక్కనీరు లేక ఒట్టిపోయిన తుంగభద్ర
వెలవెలబోతున్న కేసీ కాలువ
నిమజ్జనం కోసం నీటిని వదిలితే నగరానికి తాగునీటి కష్టాలు
హంద్రీనీవా కాల్వలో నిమజ్జనం ఉత్తమ ప్రత్యామ్నాయం
కర్నూలు నగరంలో వినాయక నిమజ్జనానికి జల గండం పట్టుకుంది. ఎన్‌నినో ప్రభావంతో చుక్కనీరు లేకుండా తుంగభద్ర నది ఒట్టిపోయింది. ఏటేటా వేలాది గణనాథులను గంగమ్మ ఒడిన చేర్చే కేసీ కాల్వలో నీటి ప్రవాహం లేక వెలవెల బోతుంది. కాల్వ పొడవునా గుర్రపు డెక్కతో నిండిపోయింది. కేసీ జీవనాడి అయిన సుంకేసుల జలాశయం అడుగంటి పోయింది. నీటినిల్వలు 0.398 టీఎంసీలకు పడిపోయాయి. నిమజ్జనం కోసం కేసీకి నీటిని వదిలితే నగరానికి తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముంది. వర్షాలు కురిసి సుంకేసుల జలాశయానికి వరద చేరితేనే కేసీ కాల్వలో నిమజ్జనం సాధ్యం అవుతుంది. నగర శివారులో ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువ ఉత్తమ ప్రత్నామ్నాయంగా భక్తులు భావిస్తున్నారు.
కర్నూలు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏటా కర్నూలు నగరంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటా రు. నగర విస్తరణతో పాటుగా వినాయక మండపాలు కూడా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. కేసీ కాల్వ వినాయక ఘాట్‌లో గణనాథులను గంగమ్మ ఒడిని చేరుస్తారు. ఆమేరకు జిల్లా అధికార యంత్రాంగం, పాలక పెద్దలు, గణేశ్ మహోత్సవ కేంద్ర కమిటీ, వీహెచ్‌పీ నాయకులు వినాయక ఘాట్ వద్ద ఏర్పాట్లు చేస్తారు. ఈనెల 14న వినాయక చవితి పర్వదినం. ఆరోజు నుంచి తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో కొలువుదీరిన లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇప్పటికే వినాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు వివిధ మిత్ర మండళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర నది ఒట్టిపోయింది. కేసీ కాల్వ జీవనాడి అయిన సుంకేసుల జలాశయం అడుగంటడంతో గణనాథుడి నిమజ్జనానికి జల గండం వెంటాడుతుంది. ఏకదంతుడిని గంగమ్మ ఒడిన చేర్చే క్రతువుపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
మూడు నెలలు గడిచినా..
నగరవాసుల దాహం తీర్చే జీవనాడి సుంకేసుల జలాశయం. కేసీ కాల్వకు నీటిని మళ్లించే జలాధారం కూడా సుంకేసుల బ్యారేజీనే. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోయినా తుంగభద్రకు ఒక్క వరద రాలేదు. నది పూర్తిగా ఎం డిపోయింది. సుంకేసుల జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 1.235 టీఎంసీ లు కాగా, ప్రస్తుతం 0.398 టీఎంసీలే ఉన్నాయి. నగర ప్రజల దాహం తీర్చేందుకు రోజుకు 159 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉన్న నీరు 20-25 రోజులకు మించి సరిపోవడం లేదు. ఆతరువాత నగర ప్రజల దాహం తీర్చేదెలా? జిల్లా అధికారు లను వెంటాడుతన్న ప్రశ్న ఇది. ఈనెల 14న నగరంలో కొలువుదీరే దా దాపు రెండు వేల వినాయక విగ్రహాలు నవరాత్రులు పూజలు అందు కొని ఈనెల 22న నిమజ్జనం చేసే అవకాశం ఉంది. కేసీ కాలువలో చుక్కనీరు లేక వెలవెలబోతుంది.
గుర్రపు డెక్కతో నిండిపోయింది
వివిధ కాలనీల డ్రైనేజీల ద్వారా మురుగు కేసీ కాల్వలోకి చేరుతోంది. నీటి ప్రవాహం లేక కేసీ కాల్వ మురుగుకూపంగా మారింది. గుర్రపు డెక్కతో నిండి పోయింది. మురుగంతా దిగువకు కొట్టుకుపోయి కేసీ కాల్వ స్వచ్ఛమైన నీటితో నిండా లంటే సుంకేసుల బ్యారేజీ నుం చి రోజుకు వెయ్యి నుంచి రెండు వేల క్యూసెక్కులు కేసీ విడుదల చేయాలని ఇంజనీర్లు అంటున్నారు. అదే జరిగితే ఒకటి రెండు రోజుల్లో సుంకేసుల ఖాళీ అవుతుంది. వర్షాలు రాకపోతే నిమజ్జనం నాటికే సుంకేసుల ఖాళీ అవుతుందని అంచనా వేస్తున్నారు. నగర ప్రజలకు తాగునీటి గండం తప్పదు. వర్షాలు కురిసి తుంగభద్రకు వరదొచ్చి సుంకేసుల బ్యారేజీ నిండితే తప్పా కేసీకి నీటిని విడుదల చేసే అవకాశాలు లేవని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీ కాలువ వినాయక ఘాట్‌లో గణనాథుల నిమజ్జనం సాధ్యమేనా?
గతంలోనూ ఇదే పరిస్థితి..
జిల్లాలో 2004, 2017లోనూ వర్షాభావ పరిస్థితుల కారణంగా వినాయక నిమజ్జనా నికి నీటి సమస్య తలెత్తింది. 2004లో కాల్వలో తక్కువ లోతు నీటిలో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి భక్తులు పాట్లుపడ్డారు. 2017లో కూడా ఇదే పరిస్థితి. 2024లో కూడా మళ్లీ ఇలాంటి పరిస్థితి వచ్చినా, నిమజ్జనాకికి రెండు రోజుల ముందు భారీ వర్షాలు కురవడంతో జల గండం నుంచి గట్టెక్కారు.
హంద్రీనీవాలో కృష్ణమ్మ పరవళ్లు
నగర శివారున నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలో హంద్రీనీవా కాల్వ ప్రవహిస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం ఎగువన మల్యాల ఎత్తిపోతల నుంచి తొమ్మిది పంపుల ద్వారా 3,050 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. హంద్రీనీవాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ రాయలసీమ పల్లె ప్రజల దాహార్తిని తీరుస్తోంది. నన్నూరు, తడనకపల్లె, ఉల్లిందకొండ దగ్గర ప్రవహించే హంద్రీనీవా కాల్వలో నిమజ్జనం చేయడం ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో దాదాపు 15-20 అడుగుల లోతులో ప్రవాహం ఉంది. ఎంతటి భారీ విగ్రహాలైన నిమజ్జనం చే యవచ్చు. నగరాన్ని మూడుమార్గాలుగా విభజించి ఈమూడు ప్రాంతాల్లో తాత్కా లిక నిమజ్జన ఏర్పాట్లు చేస్తే పవిత్రమైన వాతావరణంలో కృష్ణమ్మ ఒడిలో గణ నాథుడిని భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలకవచ్చని పలువురు పేర్కొంటున్నారు. గార్గేయపురం చెరువులో కూడా నిమజ్జనానికి అవకాశముంది. ఈవిషయంపై జిల్లా యంత్రాంగం, పాలక పెద్దలు, శ్రీగణేశ్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు సమాలోచన చేసి భక్తుల ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
నేడు ప్రత్యేక భేటీ
వినాయక నిమజ్జనంపై కలెక్టర్ ఏ.సిరి ఆధ్వర్యంలో గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి ముఖ్య నాయకులు, జలవనరుల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. తుంగ భద్ర డ్యాంలో కేసీ కాల్వ వాటాగా 4.5 టీఎంసీలున్నాయి. డ్యాం నుంచి ఒక టీఎంసీ తీసుకోవడానికి అవకాశం ఉన్నా ఒట్టిపోయిన తుంగభద్ర నదిలో 205 కిలోమీటర్లు ప్రవహించి, ఆర్డీఎస్ ఆనకట్ట దాటి సుంకేసుల బ్యారేజీకి నీరు చేరే అవకాశాలు ఏమాత్రం లేవని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. వినాయక నిమజ్జన ప్రత్యామ్నాయాల అన్వేషణ కోసం మంగళవారం జలవనరుల శాఖ, హంద్రీనీవా ప్రాజెక్టు, కర్నూలు కార్పోరేషన్ ఎస్‌ఈలు శైలేశ్వర్, రాజన్‌బాబు, రమణమూర్తి సమావేశం అయ్యారు. హంద్రీనీవా కాల్వలోనే నిమజ్జనం ప్రత్యామ్నాయమని ఓ నిర్ణయానికి వచ్చారు. అదే క్రమంలో నిమజ్జనంపై శ్రీగణేశ్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కూడా సమావేశమై చర్చించారు.