అవకాశాల వారధి విద్యాజ్యోతి
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:34 PM
ఇంటర్మీ డియట్ విద్య అనంతరం ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ‘విద్యాజ్యోతి’ కార్యక్రమం సరైన వారధి అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అభిప్రాయపడ్డారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీ డియట్ విద్య అనంతరం ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ‘విద్యాజ్యోతి’ కార్యక్రమం సరైన వారధి అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్ తర్వాత విద్యాసంస్థలు, ఉత్తమ కోర్సుల ఎంపిక చాలా ముఖ్య మన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఏడీ-6 అడ్వర్‌టైజ్ సంయుక్త ఆధ్వ ర్యంలో శనివారం కర్నూలు మౌర్యఇన్ హోటల్‌లో జరిగిన ‘విద్యాజ్యోతి మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో’కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యాజ్యోతి ఎడ్యుకేషన్ ఎక్స్‌పో’ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆర్‌ఐఓ లాలెప్ప, ఆంధ్రజ్యోతి యూనిట్ మేనేజర్ బి.లక్ష్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో కార్యక్రమానికి జేసీ నూరుల్ ఖమర్‌తో పాటు, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ ఇంటర్ విద్య అనంతరం ఉన్నత చదువుకు ఏ యూనివర్సిటీల్లోనూ ఏయే కోర్సులు అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో వాటిని ఎన్నుకోవాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇలాంటి ఎక్స్‌పో కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పోను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాలకు విద్యారులు, వారి తల్లిదండ్రులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు వ్యయ భారాన్ని తగ్గించేలా ఇలాంటి ఎక్స్‌పోలు కర్నూలులో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటివి ప్రతి ఏటా నిర్వహించాలన్నారు. కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ‘విద్యాజ్యోతి’ అనే బృహత్ కార్యక్రమం ద్వారా బెంగుళూరులోని ప్రముఖ విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం గొప్పవిషయమన్నారు. ఈ వేదిక విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రపంచం గ్లోబలైజేషన్ దిశగా పరుగులు పెడుతున్న సమయంలో ఇంటర్నెట్‌పై అవగాహన లేని గ్రామీణ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇలాంటి కార్యక్రమంలో తీసుకురావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఆర్‌ఐవో జి.లాలెప్ప మాట్లాడుతూ భవిష్యత్తును నిర్దారించుకునేందుకు మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో విద్యార్థులకు సువర్ణ అవకాశం అన్నారు. డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఇక్కడకు విద్యాజ్యోతికి వచ్చిన విద్యార్థులకు వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు అర్థమయ్యేలా సులభమైన తరహాలో వివరిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పోలను నంద్యాల, ఆదోని పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఏడీ-6 అడ్వర్‌టైజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యాజ్యోతి కర్నూలులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.
కర్నూలు నారాయణ, మాంటిస్సోరి విద్యాసంస్థలతో పాటు నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు తల్లిదండ్రులు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలిరావడంతో మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకు విశేష స్పందన లభించింది. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆయా స్టాల్స్ వద్దకు వెళ్లి ఫీజులు, కోర్సులతో పాటు తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. భవిష్యత్‌కు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపారు. ప్రతి గంటకు ఒకసారి ఎక్స్‌పోకు వచ్చి రిజిస్ర్టేషన్ చేయించుకున్న విద్యార్థులకు లక్కీడ్రా నిర్వహించి అతిథుల చేతుల మీదుగా ఆకర్షణీయమైన బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్స్‌పో కార్యక్రమానికి వచ్చి ప్రసిద్ధిచెందిన విద్యాసంస్థల్లో నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకోవాలని నిర్వాహకులకు పిలుపునిచ్చారు. స్టాల్స్‌లో కర్నూలు మాంటిస్సోరి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ నీలకంఠేశ్వరరెడ్డి విద్యార్థులతో మాట్లాడి వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌చార్జి చల్లా నవీన్ కుమార్, ఏబీఎన్ స్టాఫ్ రిపోర్టర్ పసుపుల సుంకన్న, సర్క్యులేషన్ మేనేజర్ గోపాల్, ఏడీ-6 సీఈవో భాస్కర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హాజరైన విద్యాసంస్థలివే..
రేవా యూనివర్సిటీ,
రెసిడెన్సీ యూనివర్సిటీ,
న్యూహరిజోన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,
సీఎంఆర్ యూనివర్సిటీ,
ఆర్‌ఆర్ ఇనిస్టిట్యూషన్
సబర్మా ఇనిస్టిట్యూషన్
ఎంఎస్ రామయ్య ఫౌండేషన్
గోకుల్ బెంగుళూరు
హర్షా ఇనిస్టిట్యూషన్
కృపానిధి గ్రూఫ్ ఆప్ ఇనిస్టిట్యూషన్
కేంబ్రిడ్జి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఈస్ట్, వెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్
ఎస్.ఈ.ఏ.సి గ్రూఫ్
రామయ్య యూనివర్సిటీ సైన్సెస్, ఏబీబీఎస్ అటానమస్
రామయ్య కాలేజీ ఆప్ ఆర్ట్స్, సైన్స్
ఎస్-వైస్య యూనివర్సిటీ
గార్డెన్ సిటీ యూనివర్సిటీ
ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్
బృందావన గ్రూప్స్
విద్యాజ్యోతి సహాయకారి
మా అబ్బాయి సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువు తున్నారు. విద్యాజ్యోతి సదస్సులో బెంగుళూరు చెందిన విద్యాసంస్థలు కోర్సులు, కోర్సుల వ్యవధి వాటి ఫీజుల వివరాల సమాచారం తెలుసు కున్నాం. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఏఏ కోర్సులు కొత్తగా ఉన్నాయో విద్యాసంస్థల ప్రతినిధులు వివరించడం జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రికలో చూసి విద్యాజ్యోతి సదస్సుకు రావడం జరిగింది. తన కుమారున్ని ఇంజనీర్ చేయాలన్న ఉద్ధేశంతో విద్యాజ్యోతి సదస్సుకు వచ్చాను. నిజంగా విద్యాజ్యోతి ఒక సహాయకారిగా ఉంది. - నాగన్న,
విద్యార్థి తండ్రి, చెట్లమల్లాపురం, కల్లూరు మండలం
అగ్రికల్చర్ కోర్సులను తెలుసుకున్నాం
మా అమ్మాయి షారోణి ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్ తర్వాత ఉన్న కోర్సులను విద్యాజ్యోతి ద్వారా విద్యాసంస్థల ప్రతినిఽధులు చక్కగా వివరించారు. మా అమ్మాయికి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. ఇందుకు సంబంధించిన కోర్సుల, ఫీజుల వివరాలు క్యాంపస్ సెలక్షన్ గురించి తెలుసుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సదస్సుతో మంచి బెనిఫిట్ ఉంది. చాలా ఉపయోగకరంగా ఉంది.
- సి.రంగన్న, సి. షారిణి, డోన్
బీఎస్సీ నర్సింగ్‌పై ఆసక్తి
శ్రీజ, మనీషా విద్యార్థులు ఏపీ మోడల్ కాలేజీలో ఇంటర్ బైపీసీ పూర్తి చేశారు. ఇంటర్ తర్వాత ఈ విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ కోర్సుల గురించి బెంగుళూరు చెందిన విద్యాసంస్థలు కోర్సుల వివరాలను వివరించారు. మా పేరెంట్స్‌తో కలిసి విద్యాజ్యోతి సదస్సుకు హాజరై అనేక విషయాలు తెలుసుకున్నాం. ఈ సమాచారంతో బీఎస్సీ నర్సింగ్ కోర్సులపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి సాధ్యం అవుతుంది.
- గంగాధరి శ్రీజ, మనీషా, కొర్రపోలూరు గ్రామం, గడివేముల
విద్యార్థులకు సరైన వేదిక
నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో అడుగుపె డుతున్నాను. ఇంటర్ తర్వాత ఏ కోర్సులో చేరాలన్న అవగాహన కోసం విద్యాజ్యోతి సదస్సుకు వచ్చాను. ఆంధ్రజ్యోతి కల్పించిన విద్యాజ్యోతి వేదిక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. సరైన కోర్సును కావాల్సిన కోర్సును విద్యావేదిక ద్వారా ఎంచుకునే వీలు ఉంది.
- కీర్తాంజన విద్యార్థిని, సెకండియర్ ఇంటర్, కర్నూలు
ప్రభుత్వ ప్రాజెక్టులో కూడా...
గార్డెన్ సిటీ యూనివర్సిటీ ప్రభుత్వ సంస్థల ప్రాజెక్టులో పని చేస్తుంది. ముఖ్యంగా స్యామ్‌సంగ్ సీడ్ ల్యాబ్ మా యూనివర్సిటీలో ప్రత్యేకమైంది. స్టూడెంట్‌గా చదువుతున్న సమయంలో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అంతా పేపర్స్‌లెస్, స్టూడెంట్స్‌కు బిజినెస్ ఫండింగ్‌తో సహాయకారిగా ఉంటుంది. బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ రోబోటిక్, ఐటీసీఎస్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
- మానసగౌడ, అసిస్టెంట్ ప్రొఫెసర్ గార్డెన్ సిటీ యూనివర్సిటీ, బెంగుళూరు
ఏఐ వైపు మొగ్గు చూపుతున్నారు
విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడంతా ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తప్పనిసరిగా మారింది. ఏఐ ప్రమేయం లేని రంగం ఏదీ లేదు. అందుకే విద్యార్థులు ఎక్కువగా ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే ఎలక్ర్టికల్ అండ్ ఎలక్ర్టానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఏఐ చేయాలంటే ఖచ్చితంగా కంప్యూటర్స్ సైన్స్ చేయాల్సిందే. భవిష్యత్తులో అన్నింటికీ ఏఐ అత్యంత కీలకంగా మారుతుంది. కావాల్సిన ప్రతీ అంశాన్ని తక్కువ సమయంలో అందజేస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థుల్లో ఆలోచనాశక్తితో పాటు కష్టపడాలన్న తపన ఉన్నట్లు గుర్తించాం. ఆ పోరాట పటిమ ఉండటం అభినందనీయం.
- టి.దివ్య, అడ్మినిస్ర్టేషన్ కౌన్సిలర్, న్యూహరిజోన్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, బెంగుళూరు