Share News

కూటమికే పట్టం

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:58 AM

సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి పుర ప్రజలు పట్టం కట్టారు. అభివృద్ధి.. సంక్షేమానికి నగర, పట్టణ ఓటర్లు జై కొట్టారు.

కూటమికే పట్టం

కందనవోలు కోటపై విజయబావుటా

చేనేతపురిలో దూసుకెళ్లిన సైకిల్‌

గూడూరులో వికసించిన కమలం

ఆదోనిలో విజయస్వప్న

ఉత్కంఠగా ఓట్ల లెక్కిపు

రౌండ్‌ రౌండ్‌కూ కూటమి అభ్యర్థుల ఆధిక్యం

అభివృద్ధి, సంక్షేమానికి జైకొట్టిన పట్టణ ఓటర్లు

సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి పుర ప్రజలు పట్టం కట్టారు. అభివృద్ధి.. సంక్షేమానికి నగర, పట్టణ ఓటర్లు జై కొట్టారు. నాలుగు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఘన విజయం అందించారు. ప్రతిపక్ష వైసీపీకి కోలుకోలేని దెబ్బకొట్టారు. కర్నూలు కోటపై పసుపు జెండాను ఎగుర వేశారు. చేనేతపురి (ఎమ్మిగనూరు)లో సైకిల్‌ దూసుకుపోయింది. ఫ్యాన్‌ గాలి వీయనే లేదు. గూడూరులో కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. రెండో ముంబై(ఆదోని)లో జనసేన రెబల్‌ అభ్యర్థి విజయ ఢంకా మోగించారు. కూటమి సాధించిన విజయాలపై టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలతో తడిసిముద్దయ్యాయి.

కర్నూలు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని పురపోరులో ఓటరన్నలు కూటమికే పట్టం కట్టారు. ప్రతిపక్ష వైసీపీకి కోలుకోలేని దెబ్బకొట్టారు. కర్నూలు నగరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నాయకత్వానికి అండగా నిలిచారు. నగరపాలక సంస్థలో స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టి కందనవోలు కోటపై పసుపు జెండాను ఎగుర వేశారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వరంలో టీడీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి క్లీన్‌స్వీప్‌ చేసింది. గూడూరులో కూటమి మద్దతులో బీజేపీ పాగా వేసింది. ఆదోని ఫలితం మాత్రం రాజకీయ వర్గాలకు విస్మయానికి గురి చేసింది. కూటమి సీట్లు సర్దుబాటులో భాగంగా చైర్‌పర్సన్‌ టికెట్‌ ఆశించిన భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన జనసేన ఇన్‌చార్జి ఎన్‌.మల్లప్ప భార్య స్వప్న నాయకర్‌ను ఓటర్లు అక్కున చేర్చుకున్నారు. సంప్రదాయ రాజకీయ ఆధిపత్యాలకు చెక్‌ పెట్టారు. కందనవోలు గడ్డపై కర్నూలు మేయర్‌, ఎమ్మిగనూరు, గూడూరు చైర్‌పర్సన్‌ పీఠాలు సహా 173 వార్డుల్లో విజయకేతనం ఎగుర వేసి కూటమి స్పష్టమైన ఆధికత్యను సాధించింది. నాలుగు పట్టణాల్లో పోలైన 4,26,140 ఓట్లలో 2,03,488 ఓటర్లు కూటమికి పట్టం కట్టారు. కూటమి సాధించిన విజయాలతో ఆయా పార్టీలు సంబరాలు మునిగిపోయారు.

ప్రతి ఓటును ఏజెంట్లకు చూపించి..

మొదట మేయర్‌/ చైర్‌పర్సన్‌, కార్పొరేటర్‌/కౌన్సిలర్ల వారీగా ఓట్లను వేరు చేసి 25 ఓట్లు చొప్పున కట్టలు కట్టి, డ్రమ్ముల్లో విసి మిక్స్‌ చేశారు. ఆ తరువాత చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ప్రక్రియ ఉత్కంఠంగా సాగింది. బ్యాలెట్‌ పత్రాలు కావడం, ప్రతి ఓటును పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల వారీగా వేరు చేసి లెక్కించాల్సి రావడంతో బాగా ఆలస్యమైంది. కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరులో కూటమి అభ్యర్థులు రౌండ్‌ రౌండ్‌కు ఆధిపత్యం సాధిస్తే, ఆదోనిలో జనసేన రెబల్‌ స్వతంత్ర అభ్యర్థి స్వప్న ప్రభంజనం సృష్టించింది.

జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో..

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఏ.సిరి పర్యవేక్షణలో మం గళవారం ఉదయం 8 గం టలకు ఓట్ల లెక్కింపు ప్రారం భమైంది. కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల అథారిటీలైన కమిష నర్లు, ఆర్‌వోల ఆధ్వర్యంలో ఓట్లను లెక్కించారు. కర్నూలు నగరపాలక సంస్థ మేయర్‌, 68 వార్డుల కార్పొరేటర్లను ఎన్నుకోవ డానికి 2,58,597 మంది ఓటర్లు ఓటేశారు. ఆదోని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, 52 వార్డుల కౌన్సిలర్లను ఎన్నుకోవడానికి 94,683 మంది ఓటర్లు ఓటేశారు. ఎమ్మిగనూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, 44వార్డుల కౌన్సిలర్లను ఎన్నుకోవడానికి 57,889 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గూడూరు నగర పంచా యతీ చైర్‌పర్సన్‌, 23 వార్డుల కౌన్సిలర్ల ఎన్నిక కోసం 14,971 మంది ఓటర్లు ఓటేశారు.

కర్నూలులో విజయయాత్ర

కర్నూలులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ హవా కొనసాగించారు. ఆయనకు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి ప్రచారంలో అండగా నిలిచారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష ఎంపిక మొదలుకొని ప్రచార వ్యూహాలను పదును పెట్టడుతూ ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఓటర్లకు చేరువ కావడంలో సక్సెస్‌ అయ్యారు. నగర ఓటర్లు కూటమి ప్రభుత్వానికి జైకొడుతూ.. సైకిల్‌ వేగానికి మరింత జోష్‌ ఇచ్చారు. టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి విజయ ప్రత్యూష ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి యు.సుశీలపై 27,033 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 68 వార్డుల్లో టీడీపీ 52, జనసేన 2, బీజేపీ 3 వార్డుల్లో కూటమి విజయం సాధించాయి. ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు బెడిసికొట్టాయి. క్రాస్‌ ఓటింగ్‌ ఆశలపై నగర ఓటర్లు నీళ్లు పోశారు. అతికష్టంపైన 11 వార్డుల్లో వైసీపీ సరి పుచ్చుకోవాల్సి వచ్చింది. మొత్తం 2,58,597 ఓట్లు పోలైతే.. విజయ ప్రత్యూషకు 1,28,888 ఓట్లు (49.84 శాతం) పోల్‌ కాగా సుశీలకు1,01,855 (39.38 శాతం) ఓట్లు వచ్చాయి. విజయ ప్రత్యూష 27,033 ఓట్లతో టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థి తామర వేణికి 4,326 ఓట్లు, సీపీఎం బి.శ్యామలకు 5,156 ఓట్లు పోలయ్యాయి. 9,363 చెల్లని ఓట్లు ఉంటే, 1,476 మంది నోటాకు ఓటేశారు.

ఆదోనిలో ఓటర్ల తీర్పు సంప్రదాయ రాజకీయ ఆధిపత్యాలకు చెక్‌ పెట్టింది. ఆదోని చరిత్రలోనే తొలిసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు గుణపాఠం చెబుతూ స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. తనకు పాతికేళ్లుగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లప్ప ఆవేదన వ్యక్తం చేస్తూ జనసేన రెబల్‌గా భార్య స్వప్న నాయకర్‌తో నామినేషన్‌ వేయించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆమెకు ఎన్నికల అధికారులు రింగ్‌ గుర్తు కేటాయించారు. తనకు జరిగిన అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా అది నిజమేగా..! చర్చకు తెర తీశారు. స్వతంత్ర అభ్యర్థి ఓట్లు చీలిస్తే వైసీపీకి లాభమని కొందరు, కాదు.. టీడీపీకే లాభమని మరికొందరు అంచనాలు వేశారే తప్పా ఆమె గెలుస్తుందని ఊహించలేదు. ఓటరు మాత్రం ఆమెకు అండగా నిలిచారు. 2,062 ఓట్ల ఆధిక్యతతో విజయం అందించారు. స్వప్న నాయకర్‌కు 32,572 ఓట్లు రాగా, ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి టి.మణికి 30,510 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గాజుల ప్రణతి 22,368 ఓట్లతో మూడో స్థానంతో సరిపుచ్చుకున్నారు. 52 వార్డుల్లో టీడీపీ 30, బీజేపీ మూడు, వైసీపీ 16, సీపీఎం, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరో ఒక వార్డులో విజయం సాధించారు.

గూడూరులో వికసించిన కమలం

సీట్ల సర్దుబాటులో భాగంగా గూడూరు నరగ పంచాయతీ చైర్‌పర్సన్‌ సీటును బీజేపీకి కేటాయించారు. ఆపార్టీ రాష్ట్ర నాయకుడు డమాం సురేశ్‌ సతీమణి డమాం సునీతాబాయి చైర్‌పర్సన్‌ బరిలో దిగారు. ఈస్థానం బీజేపీకి ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోయారు. సునీతాబాయి నామినేషన్‌కి కూటమి ముఖ్య నాయకులు హాజరు కాకపోగా, రెబల్‌గా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపారు. టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకొని పొత్తు ధర్మం పాటించాల్సిందేనని హెచ్చరించింది. టీడీపీ అభ్యర్థి విత్‌డ్రా చేసుకున్నా కూటమి అభ్యర్థి గెలుపు కోసం మొదట్లో ప్రచారం కూడా చేయలేదు. దీనిపై అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆఖరి రోజు ఒక గంట ర్యాలీ, ప్రచారం నిర్వహించారు. టీడీపీ ముఖ్య నాయకుల మద్దతు లేకపోవడంతో బీజేపీ ఓడిపోతుందనే ప్రచారం జరిగింది. గూడూరు ఓటర్లు కూటమికే పట్టం కట్టారు. కమలం వికసించింది. బీజేపీ అభ్యర్థి డమాం సునీతాబాయి 1,463 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ 14,791 ఓట్లు పోలైతే.. అందులో చెల్లని ఓట్లు 579. మిగిలిన 14,212 ఓట్లలో బీజేపీ అభ్యర్థి డమాం సునీతాబాయికి 7,797 ఓట్లు (52.71 శాతం) ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ఎల్‌.పద్మావతికి 6,334 ఓట్లు (42.82 శాతం) పోలయ్యాయి.

పసుపు సైన్యం అఖండ విజయం

ఎమ్మిగనూరు మున్సిపాలిటీని టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తిరుగులేని ఆధిపత్యం సాధించారు. చైర్‌పర్సన్‌ టీడీపీ అభ్యర్థిగా మాచాని సునీత సహా 44వార్డులకు కౌన్సిలర్‌ అభ్యర్థుల ఎంపిక వరకు అంతా తానై నడిపించారు. వారిని గెలిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. ఒంటి చేత్తో పసుపు సైన్యాన్ని నడిపించి అఖండ విజయం సాధించారు. ఈ విజయాన్ని సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌కు కానుకగా ఇస్తామన్నారు. ఇక్కడ 57,887 పోలైతే.. టీడీపీ అభ్యర్థి మాచాని సునీతకు 36,293 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ కేఎస్‌ రఘుకు 13,417 ఓట్లు, స్వత్రంత్ర అభ్యర్థి నజీర్‌కు 3,431 ఓట్లు వచ్చాయి. రఘుపై 22,777 ఓట్ల భారీ ఆధిక్యతతో సునీత విజయ దుందుభి మోగించారు. వార్డుల్లో టీడీపీ 38, జనసేన ఒకటి, బీజేపీ ఒక వార్డులో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేశారు. వైసీపీ కేవలం రెండు వార్డులతో సరిపుచ్చుకుంది. స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు.

నగర/మున్సిపాలిటీల మేయర్‌/చైర్మన్‌ వారీగా విజేత, పార్టీ, మెజార్టీ వివరాలు

నగర/పురపాలిక విజేత పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు మెజారిటీ

కర్నూలు బొల్లెద్దుల విజయ ప్రత్యూష టీడీపీ 1,28,88 యు.సుశీల వైసీపీ 1,01,855 27,033

ఆదోని స్వప్న నాయకర్‌ స్వతంత్ర 36,293 టి.మణి టీడీపీ 30,510 2,062

ఎమ్మిగనూరు మాచాని సునీత టీడీపీ 36,293 కేఎస్‌ రఘు వైసీపీ 13,417 22,777

గూడూరు డమాం సునీతాబాయి బీజేపీ 7,797 పద్మావతి వైసీపీ 6,334 1,463

నగర/మున్సిపాలిటీల్లో పోలైన ఓటర్లు, పార్టీల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు

నగర/పురపాలిక పోలైన చెల్లని లెక్కించిన టీడీపీ వైసీపీ జనసేన నోటా ఇతరులు

ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు రెబల్‌ ఓట్లు ఓట్లు

కర్నూలు 2,58,597 9,363 2,49,234 1,28,888 1,01,855 -- 1,476 17,476

ఆదోని 94,683 5,044 89,639 30,510 22,368 32,572 472 3,717

ఎమ్మిగనూరు 57,887 1,948 55,939 36,293 13,417 -- 466 5,763

గూడూరు 14,791 579 14,212 7,797(బి) 6,334 -- 81 --

మొత్తం 4,25,958 16,934 4,09,024 2,03,488 1,43,974 32,572 2,495 26,497

నగర/మున్సిపాలిటీల్లో మొత్తం వార్డులు, పార్టీల వారీగా గెలిచిన వార్డుల వివరాలు

నగర/పురపాలిక వార్డులు టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ ఇతరులు

కర్నూలు 68 52 2 3 11 --

ఆదోని 52 30 -- 3 16 3

ఎమ్మిగనూరు 44 38 1 1 2 2

గూడూరు 23 11 1 1 8 2

మొత్తం 187 131 4 8 37 7

రాజకీయ ఆధిపత్యాలకు చెక్‌

Updated Date - Nov 04 , 2026 | 12:58 AM