కూటమిదే విజయం
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:47 PM
స్థానిక సంస్ధల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మంత్రి బీసీ కసరత్తు
సమన్వయంతో గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు ఆదేశం
వైసీపీపై మండిపడిన మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
కొలిమిగుండ్ల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్ధల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహల వద్ద టీడీపీ శ్రేణులతో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నేరుగా చర్చించి అభ్యర్ధుల ఎంపికపై అభిప్రాయాలను సేకరించారు. శ్రేణులంతా సమన్వయంతో కలిసికట్టుగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్ధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మూలే రామేశ్వర్ రెడ్డి, వీఆర్ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వర్ రెడ్డి, పోతిరెడ్డి రాఘవరెడ్డి, హుస్సేన్ రెడ్డి, క్రిష్ణరంగారెడ్డి పాల్గొన్నారు.
గొడవకు వైసీపీనే ప్రధాన కారణం
రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో నామినేషన్ల సందర్భంగా జరిగిన అల్లర్లకు వైసీపీనే ప్రధాన కారణమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం పుంగనూరు, రాయచోటిలో జరిగిన అల్లర్లపై మంత్రి స్పందిస్తూ హింసతోనే గెలవాలని వైసీపీ భావిస్తోందని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియను చెడగొట్టడానికి టీడీపీ ప శ్రేణులపై దాడులు చేయడం తీవ్ర అభ్యంతరకరమని మంత్రి బీసీ విమర్శించారు. వైసీపీ అరాచకాలను ప్రజలు హర్షించే పరిస్థితి లేదని అన్నారు. ఓటమి భయంతోనే అల్లర్లకు పాల్పడుతున్నారని మంత్రి బీసీ విమర్శించారు.