Share News

వేదవతీ.. ఏమిటీ గతి !

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:30 PM

ఎన్నికలు వస్తాయి.. పాలకులు మారుతారు.. కానీ కందనవోలు పశ్చిమ ప్రాంతం రైతులు, పల్లె ప్రజల తలరాతులు మాత్రం మారడం లేదు.

వేదవతీ.. ఏమిటీ గతి !
హంద్రీ-నీవా కాలువపై నిర్మాణం చేపట్టిన వేదవతి ప్రాజెక్టు స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ దుస్థితి ఇలా

ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చినా ముందుకు సాగని పనులు

క్షేత్రస్థాయిలో పునఃప్రారంభానికి నోచుకోని వైనం

పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం నగరడోణ జలాశయం

పనులు సాగని గుండ్రేవుల

సీఎం గారూ..! పశ్చిమ ప్రాంతం అభివృద్ధిపై దృష్టి సారించాలి

నేడు ఆస్పరికి సీఎం చంద్రబాబు

సంజీవని ప్రాజెక్టు ఆరో విడత ప్రారంభం

కర్నూలు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు వస్తాయి.. పాలకులు మారుతారు.. కానీ కందనవోలు పశ్చిమ ప్రాంతం రైతులు, పల్లె ప్రజల తలరాతులు మాత్రం మారడం లేదు. దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆలూరు ప్రాంతానికి వేదవతి ప్రాజెకు,్ట నగరడోణ జలాశయం జీనవాడులు. శిలాఫలకాలకు వయసు మీరిపోవడమే తప్ప నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. కూటమి ప్రభుత్వం 36 పాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో వేదవతి ప్రాజెక్టును చేర్చి.. 2028 జూలై ఆఖరులోగా పూర్తి చేస్తామని ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పనులేమీ జరగడం లేదు. కరువు, వలసల నివారణ లక్ష్యంగా చేపట్టిన మరో ప్రాజెక్టు ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. గుండ్రేవుల జలాశయం ఊసే లేదు. ఇప్పటికీ వక్రేణి (వర్షపు నీటి నిల్వకుంట) బురద నీరే తాగవలసి వస్తున్నది. అస్తవ్యస్తమైన రోడ్లు.. అంతంతంగానే రవాణా సౌకర్యం.. దైన్యంగా మారిన వైద్యం.. ఇదీ ఆలూరు నియోజకవర్గం ముఖచిత్రం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెజార్టీ గ్రామాల పరిస్థితి ఇదే. నేడు సీఎం చంద్రబాబు ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) సంజీవని ప్రాజెక్టు ఆరో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ నేపథ్యంలో పెండింగ్‌ ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పశ్చిమ ప్రాంతం రైతులు కోరుతున్నారు.

ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 192 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంగా వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు చేపట్టారు. 2019 జనవరి 29న అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.1,942.80 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నం.77 జారీ చేసింది. వేదవతి నదిపై స్టేజ్‌-1 పంప్‌హౌస్‌, హంద్రీనీవా కాలువపై స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ నిర్మాణాలు చేపట్టి 8.292 టీఎంసీలు ఎత్తిపోసి 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. ప్రాజెక్టులో భాగంగా 2.029 టీఎంసీల సామర్థ్యంతో హాలహర్వి జలాశయం, 1.027 టీఎంసీల సామర్థ్యంతో మొలగవెళ్లి జలాశయం నిర్మాణం చేయాలి. ఈ పనులు పూర్తైతే.. నిత్యం కరువు, వలసలతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఆలూరు నియోజకవర్గం జీవనాడి వేదవతి. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ 4.65 శాతం ఎక్కువ (ఎక్సెస్‌) ధరకు పనులు దక్కించుకొని అదే ఏడాది మార్చి 7న ఒప్పందం చేసుకొని పనులకు శ్రీకారం చుట్టారు. రూ.181 కోట్లు ఖర్చు చేసి కొంత భాగం పైపులైన్‌, హంద్రీనీవా కాలువపై స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ పనులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. ఐదేళ్ల నిర్లక్ష్యం రైతులకు శాపమై వెంటాడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం 36 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో వేదవతి ప్రాజెక్టు చేర్చింది. 2028 జూలై ఆఖరులోగా ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ ఆ దిశగా పనులేమీ జరగడం లేదు. ఈ ప్రాజెక్టు కోసం 4,819.73 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. అవార్డు పాస్‌ అయ్యింది 196.15 ఎకరాలకే.

ఆలూరు నియోజకవర్గం రైతులను ఊరిస్తున్న ప్రాజెక్టుల్లో నగరడోణ జలాశయం ఒకటి. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలోని ఆలూరు బ్రాంచి కెనాల్‌ (ఏబీసీ) కింద 14,255 ఎకరాల ఆయకట్టు, మరో 4,250 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో 9 గ్రామాల్లో 15 వేల మందికి తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా 2007 జనవరి 11న అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం రూ.11.58 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఎంఎస్‌ నం.11 జారీ చేసింది. భూసేకరణ 610 ఎకరాలకు గాను 572 ఎకరాలు పూర్తిగా సేకరించారు. 2021 జూలై 14న నిర్మాణ వ్యయం అంచనా రూ.53.82 కోట్లకు పెంచి జీవో ఎంఎస్‌ నం.37 జారీ చేశారు. వైసీపీ హయాంలో పనులు చేసి ఆపేసిన కాంట్రాక్టర్‌కు సీఎం చంద్రబాబు సారథ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.17.63 కోట్లు బిల్లులు చెల్లించింది. అయినా.. కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టలేదు.

సీమ రైతుల జీవం గుండ్రేవుల:

తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 21న నాటి సీఎం చంద్రబాబు రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీఓ ఎంఎస్‌ నం.153 జారీ చేశారు. కేసీ కాలువ కింద కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 31.90 టీఎంసీలు నీటి వాటా ఉన్నా.. ఆ నీటిని నిల్వ చేసుకునే జలాశయం లేదు. తుంగభద్ర నదిలో వరద ప్రవాహ సమయంలో సుంకేసుల బ్యారేజీ నుంచి మళ్లించుకోవాలి. కేసీ నీటివాటాలో 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం అంతర్‌ రాష్ట్ర సమస్య అంటూ అటకెక్కించింది. జూన్‌ 25న తుంగభద్ర డ్యాం గేట్లు ప్రారంభం సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి ఎస్‌ఆర్‌ పాటిల్‌ సమక్షంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్‌, రేవంత్‌రెడ్డి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు తుంగభద్ర జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ముందు గుండ్రేవుల ఆవశ్యకతను వివరించేందుకు గుండ్రేవుల జలాశయం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నిబంధనలు, ఫార్మేట్‌లో డీపీఆర్‌ తయారీకి ఇంజనీర్లు శ్రీకారం చుట్టడంతో సీమ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సీఎం సార్‌..! ఈ సమస్యలపై దృష్టి సారించండి:

మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందించే ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చాలి. నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలి.

ఆలూరు నియోజవర్గం జనాభా 3.50 లక్షలు పైమాటే. వైద్య సేవల కోసం ఆలూరులో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నా.. మెరుగైన వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. ఆరుగురు వైద్యులు ఉన్నా.. స్థానికంగా లేరు. ఎక్స్‌రే యూనిట్‌ ఉన్న ఆపరేటర్‌ లేడు. ఆపరేషన్‌ థియోటర్‌ కూడా సక్రమంగా లేదు. జ్వరం వచ్చినా సరైన వైద్యం అందడం లేదు. అత్యసవర వైద్యం కోసం కర్నూలు, ఆదోని, సరిహద్దు కర్ణాటకలోని బళ్లారి నగరాలకు పరుగులు పెట్టాల్సిన దైన్య పరిస్థతి ఉంది.

ఆలూరు బస్టాండ్‌ అస్తవ్యస్తంగా మారింది. ఆర్డీసీ డిపో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఉన్నా చర్యలు శూన్యం. దీంతో మెజార్టీ గ్రామాలకు రవాణా సౌకర్యం లేదు. ఆటోలే శరణ్యం.

ప్రభుత్వ ఐటీఐ కళాశాల, ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసినా సొంత భవనాలు లేవు. విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. బీసీ బాలికల వసతి గృహం లేకపోవడంతో బాలికల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి.

ఆలూరు చెరువు 162 ఎకరాల్లో ఉన్నా.. 80 ఎకరాలు కబ్జాకు గురైంది. చెరువును అభివృద్ధి చేసి టీబీపీ ఎల్లెల్సీ, హంద్రీనీవా కాలువ నుంచి నీటిని నింపితే ఆలూరు పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య తీరుతుంది.

ఫ కర్నూలు సర్వజన వైద్యశాల, మెడికల్‌ కాలేజీ భనవాలు నిర్మాణాలు రూ.450 కోట్లతో, ఆదోని మెడికల్‌ కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాలు రూ.480 కోట్లతో చేపట్టారు. వివిధ దశల్లో నిర్మాణాలు ఆపేశారు. వీటిని పూర్తి చేసి పేదలకు వైద్య సేవలు మెరుగు పరచాలి.

జిల్లా ప్రాజెక్టుల్లో గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ఒకటి. నిర్వహణ, రక్షణ లేక పంప్‌హౌస్‌ కేంద్రాల్లో దొంగలు పడి విలువైన కాపర్‌ వైర్‌ దోచుకెళ్లారు. మరమ్మతులకు రూ.11 కోట్లు కావాలని పంపిన ప్రతిపాదనలకు అతీగతి లేదు.

హంద్రీనీవా సులజ స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7.5 టీఎంసీలు నీటిని వినియోగించుకొని 80 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. పత్తికొండ (పందికోన) జలాశయం కుడి, ఎడమ కాలువల కింద 61,394 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటే 15-20 వేల ఎకరాకు మించి ఇవ్వడం లేదు. రూ.210 కోట్లతో

అసంపూర్తి పనులు పూర్తి చేస్తే అదనంగా 45 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. అధికారులు పంపిన ప్రతిపాదనలకు మోక్షం లేదు.

కర్నూలు జిల్లాలో 16,595, నంద్యాల జిలాలో 7,050 టిడ్కో ఇళ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయి. లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

నంద్యాల జిల్లాలో గోరకల్లు, అలగనూరు, అవుకు జలాశయాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. గోరుకల్లు రిజర్వాయర్‌ అసంపూర్తి పనులకు రూ.53 కోట్లు నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు.

ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అద్దె భవనంలో అసౌకర్యాల మధ్య కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు ఆ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. శాశ్వత భవనాలకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలి.

Updated Date - Jul 24 , 2026 | 11:30 PM