వేదవతిని పూర్తి చేయాలి
ABN , Publish Date - May 14 , 2026 | 11:07 PM
జిల్లాలో అత్యంత వెనుకబడిన ఆలూరు ప్రాంతంలోని రైతాంగం కరువు కాటకాల నుంచి గట్టెక్కడానికి వేదవతి ప్రాజెక్టుకు తక్షణమే నిధులు కేటా యించి పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామ కృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ
ఆలూరు, మే 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత వెనుకబడిన ఆలూరు ప్రాంతంలోని రైతాంగం కరువు కాటకాల నుంచి గట్టెక్కడానికి వేదవతి ప్రాజెక్టుకు తక్షణమే నిధులు కేటా యించి పూర్తి చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామ కృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆలూ రు పట్టణంలోని ఉమా కళ్యాణ మండపంలో సీపీఐ ఆధ్వర్యంలో వేదవతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు ఆరంభించాలనే డిమాండ్‌తో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోందని అన్నారు. దీనికి ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 10 శాతం నిధులను సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించే రాజకీయ సంకల్పం ఉంటే వేదవతి వంటి కీలక ప్రాజెక్టులు మూడు సంవత్సరాల్లోనే పూర్తవుతాయన్నారు. ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, డోన్ వంటి ప్రాంతాలు పదే పదే కరువుబారినపడి ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. దీంతో భారీ ఎత్తున వలసబాట పడుతున్నారన్నారు. వేదవతి ప్రాజెక్టు పూర్తయితే 80 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. నగరడోన రిజర్వాయర్‌ను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, సీపీఐ మాజీ కార్యదర్శి కె. రామాంజనేయులు, తెలుగు రైతు కమిటీ రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి, సీపీఎం నాయకులు రామకృష్ణ, వెంకటేశ్వర్లు, జనసేన కో ఆర్డినేటర్ బోయ రంజిత్‌కుమార్, బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దిలేటిశెట్టి, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి పూల రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్ నాయకుడు కత్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.