వేదవతిని నిర్మించాలి
ABN , Publish Date - May 22 , 2026 | 11:24 PM
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల శాశ్వత కరువును పారదోలే వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామక్రిష్ణ
కర్నూలు న్యూసిటీ, మే 22(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల శాశ్వత కరువును పారదోలే వేదవతి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో జాతీయ కార్యవర్గసభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జీ. ఈశ్వరయ్యలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామక్రిష్ణ మాట్లాడుతూ వేదవతి ప్రాజెక్టు 8.25 సామరఽ్ద్యంతో నిర్మిస్తే దాదాపు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే కాకుండా 160 గ్రామాలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. 2014 రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వేదవతి నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పడమటి ప్రాంతాలకు ఉపయోగపడే వేదవతి ప్రాజెక్టును తక్షణమే నిర్మించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరామన్నారు.