అక్షర క్షేత్రంలో వసంత పంచమి
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:58 PM
అక్షర క్షేత్రం కొలనుభారతికి భక్తులు పోటెత్తారు. వసంతపంచమి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
తొలిసారిగా శ్రీశైలం ఆధ్వర్యంలో ఉత్సవాలు
మల్లన్న ఆలయం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ
నందికొట్కూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): అక్షర క్షేత్రం కొలనుభారతికి భక్తులు పోటెత్తారు. వసంతపంచమి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కొలనుభారతి క్షేత్రాన్ని శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకున్న అనంతరం తొలిసారిగా వసంత పంచమి వేడుకలు శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం శ్రీశైల దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఆలయ సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున ఐదు గంటలకు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అమ్మవారు శ్రీశైలం నుంచి తెచ్చిన పట్టువస్ర్తాల అలంకరణతోనే భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభాస్యం, బీజాక్షర క్రతువులను శాస్రోక్తంగా చేయించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి అక్షరాభ్యాసం ప్రారంభమైంది. ముందస్తు ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసంత పంచమి వేడులకు కొనసాగాయి. కొలనుభారతి క్షేత్రానికి భక్తుల రద్దీని ఊహించిన అధికారులు శివపురం గూడెం వద్ద వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 2 కి.మీటర్ల దూరంలో ఉన్న దేవస్థానానికి ఆర్‌టీసీ, దేవస్థానానికి చెందిన బస్సుల్లో భక్తులకు తీసుకెళ్లి అమ్మవారి దర్శనం పూర్తి అయ్యాక తిరిగి అదే వాహనాల్లో పార్కింగ్ వద్దకు వదిలారు. మధ్యాహ్నం 12 గంటల అనంతరం భక్తులు ఒక్కసారిగా ఆలయ క్షేత్రానికి రావడంతో రోడ్డుపై వాహనాల రద్దీ పెరగడంతో రాకపోకలు స్తంభించాయి. అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.
క్షేత్రానికి వచ్చిన భక్తులకు సమగ్ర సమాచారాన్ని అందించేందుకు సమాచార కేంద్రంతో పాటు, వైద్య శాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసం టికెట్లు, విద్యా సామగ్రిని ఇచ్చేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. కాశిరెడ్డి నాయన, హైదరాబాదుకు చెందిన వైష్ణవి క్యాంటిన్, వాసవి సత్రం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ సభ్యులు 200 మంది కొలనుభారతి క్షేత్రానికి చేరుకొని భక్తులకు సేవలు అందించారు. అలాగే కొత్తపల్లి మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు కూడా అక్షరాభ్యాస సమయంలో పలకలపై అక్షరాలు రాస్తూ సేవలు అందించారు.
కొలనుభారతిలో అస్సాం వాసులు
అస్సాం నుంచి కొలనుభారతి క్షేత్రానికి వచ్చిన డాక్టర్ జిత్తు గోస్వామి, భారతిరెడ్డి అనే దంపతులు వారి కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా భారతిరెడ్డి మాట్లాడుతూ తనది నందికొట్కూరు మండలం 10-బొల్లవరం గ్రామమన్నారు. తనకు కూడా చిన్నతనంలో ఇక్కడే అక్షరాభ్యాసం చేయించారని, అస్సాంకు చెందిన డాక్టర్ జిత్తు గోస్వామితో వివాహం అయిందని హైదరాబాదులో ఉంటున్నామన్నారు. నేడు తన కొడుక్కు కూడా ఇక్కడే అక్షరాభ్యాసం చేయిస్తున్నామన్నారు. బాసర కంటే ఇక్కడే బాగుంటుందని ఆమె తెలిపారు.
ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు
ప్రతి సంవత్సరం కొలనుభారతి క్షేత్రానికి విద్యార్థులతో వలంటీర్‌గా సేవలు చేసేందుకు వస్తుంటాం. కానీ ఈ ఏడాది లాగా ఎప్పుడు దేవాలయంలో వసంత పంచమి వేడుకలు జరగలేదు. శ్రీశైల దేవస్థానం వారు దత్తత తీసుకోవడంతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. భారీ ఏర్పాట్లతో అక్షర దేవాలయం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది.
- వసుంధర, థెరిసా కళాశాల కరస్పాండెంట్, ఆత్మకూరు
కొలనుభారతి ఖ్యాతిని దేశవ్యాప్తం చేస్తాం
శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు
శ్రీశైలం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రాచీన చరిత్ర కలిగిన కొలను భారతి సరస్వతీ అమ్మవారి క్షేత్ర ఖ్యాతిని దేశవ్యాప్తం చేస్తామని శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అన్నారు. శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకున్న తరువాత జరిగిన తొలి మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. కొలనుభారతి క్షేత్ర అభివృద్ధికి రూ.1.20 కోట్లను శ్రీశైల దేవస్థానం త్వరలో నిధులు కేటాయిస్తుంది. ఈ నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధి వేగంగా జరుగుతున్న తరుణంలో కొలనుబారతి ప్రాశస్త్యాన్ని దేశం నలుమూలలా ప్రఖ్యాతిగాంచేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం పాలకమండలి సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, చలివేరు కాశీనాథ్, గుండ్ల గంగమ్మ, రేఖగౌడ్, ఆలయ ఈఈ నరసింహారెడ్డి, ఫెస్టివల్ స్పెషల్ ఆఫీసర్ ఫణిధర్ ప్రసాద్, ఏఈవోలు హరిదాసు, సతీష్ మాలిక్, ఏపీఆర్‌వో శీవారెడ్డి, టెంపుల్ ఆఫీసర్ దివాకర్‌రెడ్డి, ఈవో సీసీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్టిపడేలా ఉత్సవ శోభ
ఆత్మకూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): కొలనుభారతి క్షేత్రాన్ని శ్రీశైల దేవస్థానం దత్తతకు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి వేడుక వసంత పంచమి కావడంతో ఉట్టిపడేలా ఉత్సవ శోభ సంతరించుకుంది. శ్రీశైల దేవస్థానం తరుపున కొలనుభారతి ఆలయాన్ని అద్భుతమైన పుష్ప, విద్యుత్ దీపాలంకరణతో సుందరీకరించారు. అలాగే పలు చోట్ల ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారికి గావించిన అలంకరణ కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడు కల్లో ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, డీఎస్పీ రామాంజి నాయక్, మాజీ ఎమ్మె ల్యే లబ్బి వెంకటస్వామి, శివపురం సర్పంచ్ చంద్రశేఖరరెడ్డి, కొలనుభారతి ఆలయ కమిటీ చైర్మన్ వెంకటనాయుడు, తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీవో మేరీ, సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు జయశేఖర్, ఓబులేసు, తిరుపాలు, ఓబులేసు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్‌నాయుడు, బీజేపీ నాయకులు కపిలేశ్వరయ్య తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పర్యాటకరంగంగా అభివృధ్ది చేస్తాం
అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రీశైల దేవస్థానం దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి 29 సార్లు లేఖలు రాశాను. శ్రీ చక్రంతో స్వయంభువుగా వెలసిన కొలనుభారతి క్షేత్రం ఎంతో ప్రాచీనమైనదని, రాష్ట్రంలోనే ఏకైక దేవాలయం కొలనుభారతి క్షేత్రం. అమ్మవారి మహిమ, ప్రతిష్ట రాష్ట్ర ప్రజలందరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ క్షేత్రం చుట్టూ ఉన్న అడవిని దృష్టిలో ఉంచుకొని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. త్రిఫేజ్ విద్యుత్ లైన్, బీటీ రోడ్డు, తాగునీటి వసతులను ఏర్పాటు చేస్తాం.
-ఎమ్మెల్యే గిత్త జయసూర్య
కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి
తీగెల వంతెన ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడకు వస్తారు. ఆ సమయంలో కొలనుభారతి క్షేత్రాన్ని ఆయన దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కూటమి హయాంలోనే కొలనుభారతి క్షేత్రం అభివృద్ధి చెందుతోంది. శివపురం నుంచి కొలనుభారతి క్షేత్రం వరకు రూ.70 లక్షలతో రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల అయ్యాయి. అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే రోడ్డును ఏర్పాటు చేస్తాం.
- మాండ్ర శివానందరెడ్డి, టీడీపీ నంద్యాల పార్లమెంటరీ ఇన్‌చార్జి