Share News

శ్రీశైలంలో వరుణయాగం ప్రారంభం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:54 PM

రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, తగిన వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూజలు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

శ్రీశైలంలో వరుణయాగం ప్రారంభం
అలంకార మండపంలో పూజలు చేస్తున్న ఈవో, చైర్మన్‌

శ్రీశైలం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, తగిన వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక పూజలు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ముందుగా ఈవో శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమే్‌షనాయుడు పసుపు కుంకుమ, పూలు, పండ్లు, రుశ్యశృంగ మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆలయ సంప్రదాయానుసారం తిలకధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు. వారు ఆలయ ప్రవేశం చేసి భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత అక్కమహాదేవి అలంకార మండపంలో లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజలు జరిపించారు. అనంతరం రుత్విగరణం, రుశ్యశృంగజపం, వారుణానువాక పారాయణాలు, వరుణజపం, భాగవత విరాట పర్వ పారాయణాలు, పంచాక్షరీ జపాలను ఆలయ అర్చక వేదపండితులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 36 మంది పండితులతో పూజాధి క్రతువులు నిర్వహిస్తున్నట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణాణంద ఆరాధ్యులు తెలిపారు. వరుణయాగ పూజలు ఈనెల 11 వరకు నిర్వహించనున్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:54 PM