Share News

శ్రీశైలంలో వరుణయాగ జపపారాయణలు

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:28 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవాలని కాంక్షిస్తూ శ్రీశైల క్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

శ్రీశైలంలో వరుణయాగ జపపారాయణలు
నీటితొట్టిలో కూర్చుని వరుణ జపం చేస్తున్న రుత్వికులు

శ్రీశైలం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవాలని కాంక్షిస్తూ శ్రీశైల క్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేక ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శనివారం రెంవరోజు పూజా క్రతువులలో భాగంగా రుత్వికులు నీటిలో కుర్చుని వరుణ జపపారాయణలు, మూలమంత్ర జపాలు, శివపంచాక్షరీ జపం, మహాభారతంలోని విరాటపర్వ పారాయణ, భాగవత పారాయణలను సంపూర్ణంగా పఠించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా రుష్యశృంగ మహాముని మృతికా ప్రతిమను తలపై పెట్టుకుని ప్రధానాలయ ప్రదక్షిణలు చేసి షోడశోపచార పూజా క్రతువులు నిర్వహించారు. ఆదివారం ఉదయం శివసంకల్పంతో కంకణధారణ, అఖండస్థాపన, రుద్ర చండీ కళశస్థాపనలు, ఘటశుద్ది, ఘటాలంకరణములతో శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశ కార్యక్రమం ఉంటుందని ఈవో తెలిపారు.

శివనామ స్మరణతో మార్మోగిన శ్రీశైలం

శ్రీశైల క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆది దంపతులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల శివనామస్మరణతో క్షేత్ర పురవీధులతోపాటు ప్రధానాలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. వరుస సెలవు రోజులు కావడంతో తెలుగు రాష్ట్రాల భక్తులేకాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకోవడంతో వసతి గదుల కోసం భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. భక్తులు ఎక్కువ సమయం దర్శనాలకు వేచి ఉండకుండా దేవస్థానం అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కసారిగా రద్దీ ఎక్కువగా రావడం వల్ల దర్శనానికి అధిక సమయం పట్టింది. అదే విధంగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాల కోసం కూడా అధిక సంఖ్యలో భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి మూడు గంటల సమయం పట్టింది. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, ఉద్యానవనాలు, అనుబంధాలయాలు కూడా భక్తులతో సందడిగా మారాయి.

Updated Date - Aug 08 , 2026 | 11:28 PM